పోటీ పరీక్షల్లో ఎక్కువ ప్రశ్నలు వచ్చేవి వీటినుంచే..!

ABN , First Publish Date - 2022-05-18T18:25:32+05:30 IST

భారత రాజ్యాంగ లక్షణాలను చదివేటపుడు అందులోని భాగాలను ఒక క్రమ పద్ధతిలో గుర్తుంచుకోవాలి. మొదటి ఆరు భాగాలు, తొమ్మిది, తొమ్మిది(ఎ), తొమ్మిది(బి), పదకొండు, పన్నెండు, పద్దెనిమిది, ఇరవై భాగాలను సవివరంగా చదువుకోవాలి. వీటినుంచే పోటీ పరీక్షల్లో..

పోటీ పరీక్షల్లో ఎక్కువ ప్రశ్నలు వచ్చేవి వీటినుంచే..!

ప్రభుత్వ పోటీ పరీక్షల ప్రత్యేకం

ఇండియన్‌ పాలిటీ


భారత రాజ్యాంగ లక్షణాలను చదివేటపుడు అందులోని భాగాలను ఒక క్రమ పద్ధతిలో గుర్తుంచుకోవాలి. మొదటి ఆరు భాగాలు, తొమ్మిది, తొమ్మిది(ఎ), తొమ్మిది(బి), పదకొండు, పన్నెండు, పద్దెనిమిది, ఇరవై భాగాలను సవివరంగా చదువుకోవాలి.  వీటినుంచే పోటీ పరీక్ష(Competitive examination)ల్లో ఎక్కువగా ప్రశ్నలు అడుగుతుంటారు. రాజ్యాంగం(Constitution)లోని షెడ్యూళ్లను వివరణాత్మకంగా చదవాలి.


రాజ్యాంగ లక్షణాలు

ప్రపంచంలోని ఇతర రాజ్యాంగాలతో పోల్చినపుడు భారత రాజ్యాంగం భౌతిక స్వరూపంలో, తత్త్వంలో విశిష్ఠమైనదిగా చెప్పవచ్చు. కానీ, భారతదేశంలో భిన్నత్వం దృష్ట్యా భారత రాజ్యాంగం అతి సుదీర్ఘ లిఖిత రాజ్యాంగంగా రూపొందింది. 

  • యూఎస్‌ఏ రాజ్యాంగంలో 7, ఫ్రాన్స్‌ రాజ్యాంగంలో 92, జపాన్‌ రాజ్యాంగంలో 103, ఆస్ట్రేలియా రాజ్యాంగంలో 128, చైనా రాజ్యాంగంలో 138, కెనడా రాజ్యాంగంలో 147, ఇండియా రాజ్యాంగంలో 395 నిబంధనలు ఉన్నాయి. 
  • 1950లో భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినపుడు అందులో 395 సంఖ్యాయుత ప్రకరణలు ఉన్నాయి. ప్రస్తుతం వీటితోపాటు మొత్తం 470 ప్రకరణలు ఉన్నాయి. 
  • రాజ్యాంగంలో మొదట 22 భాగాలు ఉండేవి. ప్రస్తుతం ఉప విభాగాలతో కలిపి 25 భాగాలు ఉన్నాయి. అప్పుడు ఎనిమిది షెడ్యూల్స్‌ ఉండేవి. ఇప్పుడు 12 షెడ్యూల్స్‌ ఉన్నాయి. 
  • ఇందువల్లనే హెచ్‌వి. కామత్‌ భారత రాజ్యాంగాన్ని ‘ఐరావతం’తో పోల్చారు. 


షెడ్యూల్స్‌ వివరాలు

షెడ్యూల్‌-1: భారత భూభాగం, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, వాటి పేర్ల విస్తరణ

షెడ్యూల్‌-2: రాష్ట్రపతి, రాష్ట్రాల గవర్నర్‌లు, లోక్‌సభ, విధాన సభల స్పీకర్‌లు, డిప్యూటీ స్పీకర్‌లు, రాజ్యసభ-విధాన పరిషత్‌ల చైౖర్మన్‌లు, డిప్యూటీ చైౖర్మన్‌లు, సుప్రీంకోర్టు, హైకోర్టు ప్రధాన, ఇతర న్యాయమూర్తులు, కంట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ల వేతనాలు 

షెడ్యూల్‌-3: కేంద్ర, రాష్ట్ర మంత్రులు, రాష్ట్ర శాసన సభల సభ్యులు, పార్లమెంట్‌ సభ్యులు, సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు, కాగ్‌, పార్లమెంట్‌, రాష్ట్ర శాసన సభలకు పోటీ చేసే అభ్యర్థులు చేయాల్సిన ప్రమాణ స్వీకార విషయాలు. 

షెడ్యూల్‌-4: రాజ్యసభలో వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేటాయించిన సీట్ల వివరాలు

షెడ్యూల్‌-5: షెడ్యూల్డ్‌, గిరిజన ప్రాంతాల పాలన

షెడ్యూల్‌-6: అసోం, మేఘాలయ, త్రిపుర, మిజోరాం రాష్ట్రాలకు చెందిన గిరిజన ప్రాంతాల పాలన

అసోం షెడ్యూల్డ్‌ ప్రాంతం: ఉత్తర కచార్‌ జిల్లా కొండ ప్రాంతం, కర్బి అన్గ్‌లాంగ్‌ జిల్లా, బోడోలాండ్‌ జిల్లాలోని కొంత ప్రాంతం

మేఘాలయ షెడ్యూల్డ్‌ ప్రాంతం: కాశీ జిల్లా కొండ ప్రాంతాలు, జయంతియా జిల్లా కొండ ప్రాంతాలు, గారో జిల్లా కొండ ప్రాంతాలు

త్రిపుర షెడ్యూల్డ్‌ ప్రాంతం: త్రిపుర గిరిజన ప్రాంత జిల్లా

మిజోరాం షెడ్యూల్డ్‌ ప్రాంతం: చక్మా జిల్లా, మరా జిల్లా, లాయ్‌ జిల్లా

షెడ్యూల్‌-7: కేంద్ర, రాష్ట్రాల మధ్య అధికార విభజన జాబితాలు 1950లో కేంద్రంలో 97 జాబితాలు, రాష్ట్రంలో 66 జాబితాలు, ఉమ్మడిగా 47 జాబితాలు ఉన్నాయి. ప్రస్తుతం కేంద్రంలో 98 జాబితాలు, రాష్ట్రంలో 59 జాబితాలు, ఉమ్మడిగా 52 జాబితాలు ఉన్నాయి. 

షెడ్యూల్‌-8: రాజ్యాంగం గుర్తించిన భాషల వివరాలు ఉన్నాయి. రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు అందులో తెలుగు, కన్నడం, హిందీ, సంస్కృతం, అస్సామి, గుజరాతి, పంజాబి, ఒరి యా, తమిళం, మలయాళం, ఉర్దూ, బెంగాల్‌, కశ్మీరి, మరాఠీ భాషలు ఉన్నాయి. ప్రస్తుతం 22 భాషలు గుర్తించారు. 2011లో 96వ రాజ్యాంగ సవరణ ద్వారా ఒరియాను ‘ఒడియా’గా మా ర్చారు. 1967లో 21వ రాజ్యాంగ సవరణ ద్వారా సింధి భాషను; 1992లో 71వ రాజ్యాంగ సవరణ ద్వారా కొంకణి, మణిపూరి, నేపాలి భాషలను; 2003లో 92వ రాజ్యాంగ సవరణ ద్వారా బోడో, డోంగ్రి, మైథిలి, సంతాలి భాషలను చేర్చా రు. ఎనిమిదో షెడ్యూల్‌లో ఇంగ్లీష్‌ భాషను గుర్తించలేదు.

ఇంగ్లీష్‌ అధికార భాషగా ఉన్న రాష్ట్రం నాగాలాండ్‌

భారత్‌లో మాట్లాడే విదేశీ భాష నేపాలీ.

ప్రస్తుతం ప్రాచీన హోదా పొందిన భాషలు: తమిళం-2004, సంస్కృతం-2005, తెలుగు - 2008, కన్నడం-2008, మలయాళం-2013, ఒడియా-2014

షెడ్యూల్‌-9: ఇందులో భూసంస్కరణలను వివరించారు. ప్రారంభంలో 13 భూ సంస్కరణల చట్టాలు ఉండగా ప్రస్తుతం 284 ఉన్నాయి. తొమ్మిదో షెడ్యూల్‌ను 1951 మొదటి రాజ్యాంగ సవరణ ద్వారా భారత రాజ్యాంగంలో పొందు పరిచారు.  

షెడ్యూల్‌-10: ఇందులో పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని పొందుపరిచారు. 52వ రాజ్యాంగ సవరణ ద్వారా 1985లో దీనిని చేర్చారు. దీనిని అవకాశవాద రాజకీయాలను అడ్డుకొనేందుకు రూపొందించారు. 

షెడ్యూల్‌-11: ఇందులో గ్రామ పంచాయతీల వివరాలను చేర్చారు. 1992లో 73వ రాజ్యాంగ సవరణ ద్వారా  పంచాయతీలు నిర్వర్తించాల్సిన 29 విధులను పదకొండో షెడ్యూల్‌లో పేర్కొన్నారు. 

షెడ్యూల్‌-12: ఇందులో మున్సిపాలిటీల వివరాలు చేర్చారు. 1992లో 74వ రాజ్యాంగ సవరణ ద్వారా మున్సిపాలిటీలు నిర్వర్తించాల్సిన 18 విధులను 12వ షెడ్యూల్‌లో పేర్కొన్నారు. 


భారత రాజ్యాంగం అరువు మూట

  • భారత రాజ్యాంగంలోని అనేక అంశాలను వివిధ రాజ్యాంగాల నుంచి గ్రహించడం వల్ల భారత రాజ్యాంగాన్ని ఒక అరువు మూట అని కొందరు వ్యాఖ్యానించారు. భారత రాజ్యాంగానికి అతిపెద్ద ఆధారం 1935 భారత ప్రభుత్వ చట్టం. 
  • 1935 భారత ప్రభుత్వ చట్టం నుంచి సమాఖ్య వ్యవస్థ, గవర్నర్‌ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌లు, అత్యవసర అంశాలు, గవర్నర్‌లు, రాష్ట్రాల బిల్లులను రాష్ట్రపతి పరిశీలనకు పంపడం, బలహీన వర్గాలకు రిజర్వేషన్‌లు అనే అంశాలు గ్రహించారు.
  • బ్రిటన్‌ రాజ్యాంగం నుంచి పార్లమెంటరీ తరహా ప్రభుత్వం, సమన్యాయ పాలన, శాసన నిర్మాణ ప్రక్రియ, ఏక పౌరసత్వం, క్యాబినెట్‌ వ్యవస్థ, రిట్‌లు, ఏకీకృత న్యాయ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ నిర్మాణం, పార్లమెంటరీ సభ్యుల హక్కులు, ప్రత్యేక సౌకర్యాలు, సమష్టి బాధ్యత, వెస్ట్‌ మినిస్టర్‌ తరహా ప్రభుత్వ పద్ధతి, క్యాబినెట్‌ ప్రభుత్వం, స్పీకర్‌, ఎన్నికల యంత్రాంగం, దేశాధిపతి నామ మాత్రపు అధికారిగా ఉండటం, ఉద్యోగుల ఎంపిక, ఉద్యోగిస్వామ్యం, కాగ్‌, ద్విసభా విధానం అంశాలు గ్రహించారు. 
  • అమెరికా రాజ్యాంగం నుంచి ప్రాథమిక హక్కులు, స్వతంత్ర న్యాయ వ్యవస్థ, న్యాయ సమీక్షాధికారం, రాష్ట్రపతి తొలగింపు(మహాభియోగం), సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల తొలగింపు, ఉప రాష్ట్రపతి పదవి, రాజ్యాంగ ప్రవేశిక, రాజ్యాంగ ఆధిక్యత, రాజ్యాంగ సవరణలో రాష్ట్రాల పాత్ర, ప్రజాప్రయోజనాల వ్యాజ్యం, రాష్ట్రపతి సర్వ సైన్యాధ్యక్షుడిగా వ్యవహరించడం, సుప్రీంకోర్టు, ఉపరాష్ట్రపతి తొలగింపు అంశాలను గ్రహించారు.  
  • ఐర్లాండ్‌ రాజ్యాంగం నుంచి ఆదేశ సూత్రాలు, రాజ్యసభకు సభ్యులను రాష్ట్రపతి నామినేట్‌ చేయడం, రాష్ట్రపతి ఎన్నిక పద్ధతి(ఏక ఓటు బదిలీ పద్ధతి) అంశాలను గ్రహించారు.
  • కెనడా రాజ్యాంగం నుంచి బలమైన కేంద్ర ప్ర భుత్వం గల సమాఖ్య వ్యవస్థ, కేంద్రానికి అవశిష్ట అధికారాలు ఇవ్వడం, గవర్నర్లను కేంద్ర ప్రభుత్వం నామినేట్‌ చేయడం, సుప్రీంకోర్టు సలహా అధికార పరిధి అంశాలు తీసుకొన్నారు. 
  • ఆస్ట్రేలియా రాజ్యాంగం నుంచి ఉమ్మడి జాబితా, అంతర్‌ రాష్ట్ర వ్యాపార స్వేచ్ఛ, పార్లమెంట్‌ ఉభయ సభల సంయుక్త సమావేశం, కేంద్ర ఫైనాన్స్‌ కమిషన్‌, భాషలకు సంబంధించిన అంశాలు, స్వేచ్చా వ్యాపార వాణిజ్య చట్టాలను తీసుకొన్నారు. 
  • జర్మనీ రాజ్యాంగం నుంచి అత్యవసర పరిస్థితుల్లో ప్రాథమిక హక్కులను సస్పెండ్‌ చేయడం అనే అంశాన్ని తీసుకొన్నారు. 
  • దక్షిణాఫ్రికా రాజ్యాంగం నుంచి రాజ్యాంగ సవరణ పద్ధతి, రాజ్యసభ సభ్యుల ఎన్నిక పద్ధతి అంశాలను తీసుకొన్నారు. 
  • యుఎస్‌ఎస్‌ ఆర్‌/ రష్యా రాజ్యాంగం నుంచి ప్రాథమిక విధులు, ప్రవేశికలోని సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాలు, ప్రణాళికాబద్దమైన ఆర్థిక వ్యవస్థ అనే అంశాలు గ్రహించారు. 
  • ఫ్రాన్స్‌ రాజ్యాంగం నుంచి ప్రవేశికలోని గణతంత్రం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, రిపబ్లిక్‌ వ్యవస్థ, ప్రొటెం స్పీకర్‌ అంశాలు గ్రహించారు 
  • జపాన్‌ రాజ్యాంగం నుంచి జీవించే హక్కుకు సంబంధించిన అంశాలను తీసుకొన్నారు. 
  • నార్వే రాజ్యాంగం నుంచి విధాన పరిషత్‌లోని 1/3వ వంతు సభ్యులను, విధాన సభలోని శాసన సభ్యులు ఎన్నుకొనే పద్ధతిని గ్రహించారు. 
  • ఇలా అనేక దేశాల నుంచి పలు అంశాలను భారత రాజ్యాంగం గ్రహించినప్పటికీ ఏ అంశాన్ని కూడా యథాతథంగా రాజ్యాంగంలో పొందుపరచలేదు. కేవలం ఆయా అంశాల స్ఫూర్తితో రాజ్యాంగంలో విభిన్న అంశాలను చేర్చారు. అందుకే డాక్టర్‌ అంబేద్కర్‌ ‘ప్రపంచంలోని వివిధ రాజ్యాంగాలను సగర్వంగా కొల్లగొట్టి భారత రాజ్యాంగాన్ని రూపొందించాం’ అని పేర్కొన్నారు.

రాజ్యాంగ సవరణల ద్వారా షెడ్యూళ్లలో వివరించిన అంశాలు

1951లో మొదటి రాజ్యాంగ సవరణ ద్వారా తొమ్మిదో షెడ్యూల్‌లో భూ సంస్కరణలను వివరించారు. 1985లో 52వ రాజ్యాంగ సవరణ ద్వారా పదో షెడ్యూల్‌లో పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని వివరించారు. 1992లో 73వ రాజ్యాంగ సవరణ ద్వారా పదకొండో షెడ్యూల్‌లో పంచాయతీల అంశాలను వివరించారు. 1992లో 74వ రాజ్యాంగ సవరణ ద్వారా పన్నెండో షెడ్యూల్‌లో మున్సిపాలిటీల అంశాలను వివరించారు. 


-వి.చైతన్యదేవ్‌

పోటీ పరీక్షల నిపుణులు



Updated Date - 2022-05-18T18:25:32+05:30 IST