UAE new travelling rules: యూఏఈ వెళ్తున్నారా? అయితే ఈ కొత్త రూల్స్ మీరు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిందే..!

ABN , First Publish Date - 2022-09-29T15:50:32+05:30 IST

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (United Arab Emirates) తాజాగా కొన్ని ప్రయాణ నిబంధనలను మార్చింది. ఈ కొత్త రూల్స్‌ను ఈ నెల 28వ తేదీ (బుధవారం) నుంచే అమలు చేస్తున్నట్లు తెలిపింది.

UAE new travelling rules: యూఏఈ వెళ్తున్నారా? అయితే ఈ కొత్త రూల్స్ మీరు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిందే..!

దుబాయ్: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (United Arab Emirates) తాజాగా కొన్ని ప్రయాణ నిబంధనలను మార్చింది. ఈ కొత్త రూల్స్‌ను ఈ నెల 28వ తేదీ (బుధవారం) నుంచే అమలు చేస్తున్నట్లు తెలిపింది. యూఏఈకి వచ్చేవారితో పాటు అక్కడి నుంచి బయటి దేశాలకు వెళ్లేవారికి కూడా ఈ కొత్త నిబంధనలు వర్తిస్తాయని పేర్కొంది. ప్రధానంగా కరోనా సమయంలో తీసుకొచ్చిన కొన్ని ప్రయాణ ఆంక్షలను ఈ నెల 26న (సోమవారం) భేటీ అయిన నేషనల్ ఎమర్జెన్సీ క్రైసిస్ అండ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (NCEMA) సడలిస్తూ నిర్ణయం తీసుకుంది. దీనిలో భాగంగా అంతర్జాతీయ ప్రయాణికులకు ఎన్‌సీఈఎంఏ కొత్త గైడ్‌లైన్స్‌ (Guidelines)ను ప్రకటించింది. వీటిని బుధవారం నుంచే అమలు చేస్తున్నట్లు స్పష్టం చేసింది. 


విదేశాల నుంచి యూఏఈకి వచ్చే వారికి..

విదేశాల నుంచి యూఏఈకి వచ్చే అంతర్జాతీయ ప్రయాణికులకు ప్రస్తుతం అమలులో ఉన్న వ్యాక్సినేషన్ నిబంధనలు యధావిధగా కొనసాగుతాయని ఎన్‌సీఈఎంఏ వెల్లడించింది. కాగా, టీకా తీసుకున్నవారికి, వ్యాక్సినేషన్ పూర్తికాని వారికి వేర్వేరు రూల్స్ ఉన్నాయి. 


వ్యాక్సినేషన్ పూర్తైన ప్రయాణికులు..

ఈ ఏడాది ఫిబ్రవరి 26 నుంచి వ్యాక్సినేషన్ పూర్తైన ప్రయాణికులు దాని తాలూకు సర్టిఫికేట్ చూపిస్తే సరిపోతుంది. అది కూడా క్యూఆర్ కోడ్‌తో ఉండాలి. కాగా, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (World Health Organisation) ఆమోదం పొందిన టీకాలలో ఏదో ఒకటి తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా వ్యాక్సినేషన్ పూర్తైన ప్రయాణికులకు పీసీఆర్ టెస్టు అక్కర్లేదని ఎన్‌సీఈఎంఏ తెలిపింది. 


టీకా వేసుకొని ప్రయాణికులు..

టీకా తీసుకోకుండా యూఏఈకి వచ్చే ప్రయాణికులు తప్పనిసరిగా ప్రయాణానికి 48 గంటల ముందు పరీక్ష చేయించుకున్న ఆర్‌టీ-పీసీఆర్ టెస్టు నెగెటివ్ సర్టిఫికేట్ చూపించాల్సి ఉంటుంది. అది కూడా క్యూఆర్ కోడ్ కలిగి ఉన్నదై ఉండాలి. 


పీసీఆర్ టెస్టు, టీకా మినహాయింపులు ఎవరికంటే..

* 12ఏళ్లలోపు పిల్లలు

* మధ్యస్థ, పూర్తి వైకల్యాలున్న ప్రయాణికులు. ముఖ్యంగా నాడీ సంబంధిత రుగ్మతలు కలిగిన వారు. ఉదాహరణకు: తీవ్రమైన వెన్ను సంబంధిత గాయం, అల్జీమర్స్, అమియోట్రోఫిక్ లాటరల్ స్క్లెరోసిస్ (ALS), అటాక్సియా, ఆటిజం స్పెక్ట్రమ్, బెల్స్ పాల్సీ, బ్రెయిన్ ట్యూమర్స్, సెరిబ్రల్ అనూరిజం, సెరిబ్రల్ పాల్సీ, డౌన్ సిండ్రోమ్, మూర్ఛ తదితరులకు దీని నుంచి మినహాయింపు ఉంటుంది. 

* దృష్టి లోపం ఉన్నవారు, వినికిడి లోపం ఉన్నవారు, శారీరకంగా ఇతర లోపాలు ఉన్న వారితో సహా ఇతర ప్రయాణీకులందరూ అవసరాలకు అనుగుణంగా కోవిడ్-19 ఆర్‌టీ-పీసీఆర్ టెస్టు నెగెటివ్ సర్టిఫికేట్‌ను కలిగి ఉండాలి.    


యూఏఈ నుంచి విదేశాలకు వెళ్లే వారికి..

ఎన్‌సీఈఎంఏ (NCEMA) ప్రకారం వ్యాక్సినేషన్ పూర్తైన వారు, టీకాలు తీసుకోని ప్రయాణికులకు వారు వెళ్లే గమ్యస్థానాల అభ్యర్థన మేరకు ముందస్తు పీసీఆర్ పరీక్షలు ఉంటాయి.


మాస్క్ నిబంధనలివే..

ప్రయాణ సమయంలో ముఖానికి మాస్క్ ధరించడమనేది విమానయాన సంస్థలు వాటికి అనుగుణంగా నిర్ణయం తీసుకోవచ్చని ఎన్‌సీఈఎంఏ పేర్కొంది. దీంతో యూఏఈకి చెందిన ప్రముఖ విమానయాన సంస్థలు ఎమిరేట్స్, ఫ్లైదుబాయ్, ఎతిహాద్, ఎయిర్ అరేబియా కీలక ప్రకటన చేశాయి. దీనిలో భాగంగా ఎమిరేట్స్, ఫ్లైదుబాయ్ సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. దుబాయ్ వెళ్లే ప్రయాణికులు బోర్డింగ్ సమయంలో మాస్క్ ధరించడం తప్పనిసరి కాదని తెలిపాయి. అయితే, దుబాయ్ నుంచి ఇతర గమ్యస్థానాలకు ప్రయాణించేవారు జర్నీ సమయంలో ప్రస్తుతం అమలులో ఉన్న మాస్క్ నిబంధనలను పాటించాల్సి ఉంటుందని పేర్కొన్నాయి. 


మరో ఎయిర్‌లైన్ ఎతిహాద్ తన ప్రకటనలో ఇలా పేర్కొంది: "మేము బోర్డింగ్ సమయంలో మాస్క్‌లకు సంబంధించిన మా నిబంధనలను సడలించాము. మీరు చైనా, భారతదేశం, ఇండోనేషియా, జపాన్, మాల్దీవులు, ఫిలిప్పీన్స్, దక్షిణ కొరియా, సీషెల్స్, కెనడాకు వెళ్లినట్లయితే మీరు మాస్క్ ధరించాలి" అని తెలిపింది. యూఏఈకి వచ్చే ప్రయాణికులకు తమ విమానాల్లో ఫేస్ మాస్క్ ధరించడం తప్పనిసరి కాదని ఎయిర్ అరేబియా ప్రకటించింది. 

Updated Date - 2022-09-29T15:50:32+05:30 IST