ఇవీ కొత్త వంగడాలు

ABN , First Publish Date - 2021-10-23T06:17:59+05:30 IST

ప్రస్తుత రబీ సీజన్‌లో సాగుకు అనువైన నూతన శనగ వంగడాలను నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు రైతులకు సూచిస్తున్నారు..

ఇవీ కొత్త వంగడాలు
ఎన్‌బీఈజీ పంట (ఫైల్‌)

  1. శనగలో రబీ సీజన్‌కు అనువైనవి వాడండి 
  2. రైతులకు సూచించిన ఆర్‌ఏఆర్‌ఎస్‌ శాస్త్రవేత్తలు


నంద్యాల టౌన్‌, అక్టోబరు 22: ప్రస్తుత రబీ సీజన్‌లో సాగుకు అనువైన నూతన శనగ వంగడాలను నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు రైతులకు సూచిస్తున్నారు.. ఐదు రకాల కొత్త శనగ వండగాలు వాడాలని వారు పేర్కొన్నారు. ఆర్‌ఏఆర్‌ఎస్‌ ప్రిన్సిపల్‌ శాస్త్రవేత్త (వృక్ష జననం) డాక్టర్‌ వి.జయలక్ష్మి, శాస్త్రవేత్త (వృక్ష జననం) ఎస్‌.రమాదేవి, కీటకశాస్త్రం సీనియర్‌ శాస్త్రవేత్త డా.జె.మంజునాథ్‌, తెగుళ్ల విభాగం శాస్త్రవేత్త డా.బీహెచ్‌ చైతన్య రబీ సీజన్‌లో పప్పు శనగ సాగుకు ఇటీవల ఆర్‌ఏఆర్‌ఎస్‌ ద్వారా విడుదలైన నూతన వంగడాల వివరాలను వెల్లడించారు. కర్నూలు జిల్లాలో 1.50 లక్షల నుంచి 2 లక్షల హెక్టార్ల వరకు శనగ పంట సాగు అవుతుందని తెలిపారు. రైతులు కొత్త వంగడాలను సాగుచేసి సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపడితే నాణ్యమైన అధిక రాబడి పొందగలరన్నారు. వారు ఈ వంగడాలను రైతులకు సిఫార్సు చేస్తున్నట్లు తెలిపారు. 


నంద్యాల గ్రామ్‌ 452 (ఎన్‌బీఈజీ452): ఇది అధిక దిగుబడినిచ్చే దేశవాళి శనగ రకం. ఎండు తెగులును తట్టుకుంటుంది. జేజీ-11రకానికి మంచి ప్రత్యామ్నాయం. గింజలు జేజీ-11మాదిరిగానే ఆకర్షణీయంగా ఉంటాయి. కాలపరిమితి 90-105 రోజులు. ఇది 2020లో విడుదలైంది. వర్షాధారం కింద 8-10 క్వింటాళ్లు, నీటి వసతి కింద 10-12 క్వింటాళ్ల వరకు దిగుబడి ఇస్తుంది.


నంద్యాల గ్రామ్‌ 49 (ఎన్‌బీఈజీ 49) : ఇది ఎండు తెగులును తట్టుకునే, అధిక దిగుబడినిచ్చే దేశవాళీ రకం. గింజలు గుండ్రంగా కొంచెం లావుగా, ఆకర్షణీయంగా ఉంటాయి. వంద గింజలు 24-26 గ్రాముల బరువు ఉంటాయి. కాలపరిమితి 90-105 రోజులు. వర్షాధారం కింద 8-10 క్వింటాళ్లు, నీటి వసతి కింద 10-12 క్వింటాళ్ల వరకు దిగుబడిని వస్తుంది. 


ధీర (ఎన్‌బీఈజీ 47) : ఇది మిషన్‌ కోతకు అనుకూలమైన విత్తనం. మొక్క 55-60 సెంటీమీటర్ల వరకు ఎత్తు పెరుగుతుంది. విత్తనం మోతాదు కాస్త పెంచి చదరపు మీటర్‌కు 44 మొక్కలుండేలాగా చిక్కగా అనగా 30 ఇంటు 7.5 సెంటీమీటర్ల దూరంతో విత్తుకున్నప్పుడు నంద్యాల గ్రామ్‌ 452, 49లకు సమానంగా దిగుబడిని ఇస్తుంది. కాలపరిమితి 90-105 రోజులు. వంద గింజల బరువు 24-26 గ్రాములు. 


నంద్యాల గ్రామ్‌ 119 (ఎన్‌బీఈజీ 119) :  లావు గింజ, కాబూలీ శనగ రకాల సాగు మీద ఆసక్తి ఉన్న రైతులు ఈ రకం వంగడం సాగు చేసుకోవాలి. కాలపరిమితి 90-95 రోజులు. వర్షాధారం కింద 6-8 క్వింటాళ్లు, నీటి వసతి కింద 8 - 10 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుంది. వంద గింజల బరువు 40 గ్రాములు. 


నంద్యాల గ్రామ్‌ 776 (ఎన్‌బీఈజీ 776) : ఇది ఎండు తెగులును తట్టుకునే దేశవాళీ రకం. మొక్క అధిక కొమ్మలతో 40-50 సెంటీమీటర్ల పొడవు పెరుగుతుంది. మిషన్‌ కోతకు అనుకూలం. అధిక దిగుబడినిచ్చే రకం. ఈ రకం చిరుసంచుల పరిశీలనలో ఉండి విడుదలకు సిద్ధంగా ఉంది. 


రైతులకు సూచిస్తున్న నూతన శనగ రకాల విత్తనాలు నంద్యాల ఆర్‌ఏఆర్‌ఎస్‌లో ఉంటాయని శాస్త్రవేత్తలు తెలిపారు. సాగు యాజమాన్య పద్ధతులు, నీటి యాజమాన్యం, తెగుళ్ల యాజమాన్యాలను శాస్త్రవేత్తల సూచనలకనుగుణంగా పాటిస్తే మంచి దిగుబడి వస్తుందని వారు వెల్లడించారు.

Updated Date - 2021-10-23T06:17:59+05:30 IST