TSPSC రూపొందించిన సిలబస్‌లో ఈ అంశాలే కీలకం.. తెలంగాణ జాబ్స్ స్పెషల్‌లో..!

ABN , First Publish Date - 2022-05-24T21:22:42+05:30 IST

తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ రూపొందించిన సిలబస్‌లో ‘సామాజిక నిర్మితి, వివాదాలు, విధానాలు’ అనేది అతి ముఖ్యమైన సబ్జెక్టు. సమాజశాస్త్రం లేదా సోషియాలజీ పునాదిగా సామాజిక అంశాల సృజన, సామాజిక రుగ్మతల పరిష్కారం, సామాజిక వ్యవస్థలపై అవగాహన కోసం ఈ అంశాలను చేర్చారు. గ్రూప్‌ - 1 ప్రిలిమ్స్‌, మెయిన్స్‌; గ్రూప్‌ - 2 రెండో పేపర్‌; గ్రూప్‌ - 3, గ్రూప్‌ - 4 పేపర్‌లలో ఇది కీలకాంశం....

TSPSC రూపొందించిన సిలబస్‌లో ఈ అంశాలే కీలకం.. తెలంగాణ జాబ్స్ స్పెషల్‌లో..!

తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ రూపొందించిన సిలబస్‌లో ‘సామాజిక నిర్మితి, వివాదాలు, విధానాలు’ అనేది అతి ముఖ్యమైన సబ్జెక్టు. సమాజశాస్త్రం లేదా సోషియాలజీ పునాదిగా సామాజిక అంశాల సృజన, సామాజిక రుగ్మతల పరిష్కారం, సామాజిక వ్యవస్థలపై అవగాహన కోసం ఈ అంశాలను చేర్చారు. గ్రూప్‌ - 1 ప్రిలిమ్స్‌, మెయిన్స్‌; గ్రూప్‌ - 2 రెండో పేపర్‌; గ్రూప్‌ - 3, గ్రూప్‌ - 4 పేపర్‌లలో ఇది కీలకాంశం. 


సాధారణ స్థాయిలో ప్రిపేరయ్యే విద్యార్థులకు సామాజిక శాస్త్రంపై సరైన అవగాహన కొరవడి మార్కులు కోల్పోయే ప్రమాదముంటుంది. అందుకే అభ్యర్థులు ఈ అంశంపై ప్రాథమిక అవగాహనతోపాటు వివరణాత్మక పరిజ్ఞానాన్ని పెంచుకోవాలి. గ్రూప్‌ - 1, గ్రూప్‌ - 2 ఉద్యోగ పరీక్షలకు సన్నద్దమౌతున్న అభ్యర్థులు భారతీయ సమాజ నిర్మాణం; అందులోని ప్రాథమిక అంశాలైన కులం, కుటుంబం, వివాహం, బంధుత్వం, మతం; సామాజిక రుగ్మతలు, ప్రభుత్వ విధి విధానాలు; సమాజ రక్షణలో రాజ్యాంగ ప్రకరణలు, ప్రభుత్వ చట్టాలు తదితర అంశాలను సవివరంగా చదవాలి. తెలంగాణ సమాజ నిర్మితిలో ప్రత్యేకతలు, సమాజ మూలాలు, అస్థిత్వ సమస్యలు, వెట్టి, జోగిని, పరదా ఆచారాలు, వివిధ కుల వృత్తుల ప్రత్యేక సమస్యలు, వీటి పరిష్కారం కోసం జరిగిన ఉద్యమాలు, పోరాటాలు, సంస్కరణలను పూర్తిగా తెలుసుకోవాలి. వెలివేసిన వర్గాలను సామాజిక సమ్మేళనంలో భాగం చేయడం కోసం ఉద్దేశించిన పథకాలు, సంక్షేమ కార్యక్రమాలను విశ్లేషణాత్మకంగా చదవాలి. ఎస్సీ, ఎస్టీ, బలహీన వర్గాలు, మైనారిటీలు, మహిళలు, శారీరక మానసిక వైకల్యాలతో జీవిస్తున్న ప్రత్యేక వర్గాల ప్రజల సమస్యలపై  అవగాహన తప్పనిసరి.


సిలబస్‌

గ్రూప్‌ - 1 ప్రిలిమ్స్‌లో పన్నెండో అంశంగా ‘సామాజిక వర్ణన(సోషల్‌ ఎక్స్‌క్లూజన్‌), లింగ, కుల, తెగ, వికలాంగుల హక్కుల అంశాలు - సమ్మిళిత విధానాలు’ ఉన్నాయి. వీటికి సంబంధించిన ప్రాథమిక సమాచారం సమాజశాస్త్రం/ సోషియాలజీ పుస్తకాల్లో లభిస్తుంది.  పోటీ పరీక్షలు రాసే అభ్యర్థులు ఈ సమాచారంతోపాటు ప్రభుత్వ విధానాలు, చట్టాలు, రాజ్యాంగ భరోసా సంబంధిత అంశాలను సమన్వయం చేసుకుంటూ చదువుకోవాలి. సమాజ శాస్త్రాన్ని అకడమిక్‌ కోణంలో చదవడానికి, పోటీపరీక్షల కోసం అధ్యయనం చేయడానికి గల తేడాను గుర్తించాలి.  


గ్రూప్‌ - 1 మెయిన్స్‌ సిలబస్‌

‘భారతీయ సమాజం, నిర్మితి, సామాజిక ఉద్యమాలు’ పేరుతో గ్రూప్‌ - 1 మెయిన్స్‌ పేపర్‌ - 3లో 75 మార్కులకు సిలబ్‌సను రూపొందించారు. దీనిని అయిదు యూనిట్‌లుగా వర్గీకరించి అధ్యయనం చేయాలి. 

యూనిట్‌ - 1 : భారతీయ సమాజం లక్షణాలు, భిన్నత్వంలో ఏకత్వం, కుటుంబం, వివాహం, బంధుత్వం, కులం, తెగ, మతం, భాష, గ్రామీణ - పట్టణ క్రమబద్దీకరణ, బహుళ సంస్కృతి 

యూనిట్‌ - 2: సామాజిక వర్గీకరణ (సోషల్‌ ఎక్స్‌క్లూజివ్‌), బలహీన వర్గాలు, షెడ్యూల్డ్‌ కులాలు, షెడ్యూల్డ్‌ తెగలు, వెనకబడిన తరగతులు, మైనారిటీలు, మహిళలు, పిల్లలు, వృద్ధులు, వికలాంగులు

యూనిట్‌ - 3: సామాజిక సమస్యలు, పేదరికం, నిరుద్యోగం, బాలకార్మికులు, మహిళలపై హింస, ప్రాంతీయ తత్వం, మతతత్వం, లౌకిక వాదం, అవినీతి, కుల ఘర్షణలు, వ్యవసాయ కార్మికుల సమస్యలు, పట్టణీకరణ, అభివృద్ధి, స్థానచలనం, పర్యావరణ క్షీణత, సుస్థిరాభివృద్ధి, జనాభా విస్ఫోటనం, వ్యవసాయ సంక్షోభం, వలసలు

యూనిట్‌ - 4 : తెలంగాణాలో సామాజిక సమస్యలు, వెట్టి, జోగిని, దేవదాసీ వ్యవస్థ, బాలికా శిశు సమస్యలు, ఫ్లోరోసిస్‌, బాల కార్మికులు, వలస కార్మికులు, బాల్య వివాహాలు; తెలంగాణ సామాజిక ఉద్యమాలు

యూనిట్‌ - 5: భారతదేశం, తెలంగాణాల్లో సామాజిక విధానాలు, కార్యక్రమాలు, మహిళలు, పిల్లలు, వృద్ధులు, వికలాంగులకు విధానాలు, షెడ్యూల్డ్‌ కులాలు, షెడ్యూల్డ్‌ తెగలు, వెనకబడిన వర్గాలు, మైనారిటీల సమస్యలు, సంక్షేమ విధానాలు, పర్యావరణం, జనాభా, విద్య, ఆరోగ్యం, పేదరిక నిర్మూలన, ప్రత్యేక సంక్షేమ పథకాలు


వివరణ

పై అంశాల్లో పొందుపరచిన సిలబస్‌ ఆధారంగా విషయ పరిధిని విస్తృత స్థాయిలో రూపొందించారని తెలుస్తోంది. టెక్నికల్‌, సైన్స్‌, ఫార్మసీ, కామర్స్‌ బ్యాక్‌గ్రౌండ్‌ అభ్యర్థులకు ఇది కొంతవరకు ఆందోళన కల్గించినప్పటికీ అంశాలవారీగా చదవడం ప్రారంభించాలి. సిలబస్‌ సంపూర్ణంగా భారతీయ సమాజం, తెలంగాణ సమాజ నిర్మితి, సామాజిక సంబంధాలు, మానవ సంబంధాలు, వివక్షత, వెలి అంశాలతో ఉన్నప్పటికీ సాధించిన ప్రగతి, అభ్యుదయం, సంక్షేమం కోసం ప్రారంభించిన పథకాలపై అవగాహన పెంచుకోవాలి.  ఈ అంశాలన్నింటినీ పోటీ పరీక్షల దృక్కోణంలో చదవాలి. 


అభ్యర్థులు తెలంగాణలోని ప్రత్యేక సామాజిక సమస్యలను వివరంగా తెలుసుకోవాలి. వెట్టి చాకిరి, బేకార్‌, భవేళ, జోగినీ, బాల కార్మికుల స్థితిగతులతో పాటు ఫ్లోరోసిస్‌ సమస్యలు, తెలంగాణలో వలసల సమస్యలపై అధ్యయనం చేయాలి. 


ప్రిపరేషన్‌

  • అభ్యర్థులు ముందుగా సిలబ్‌సను అవగతం చేసుకోవాలి. భారతదేశ సామాజిక నిర్మితిని అధ్యయనం చేస్తూ స్వీయ నోట్స్‌ రాసుకోవాలి. భారతీయ సమాజ ప్రత్యేక నిర్మాణం, విభిన్న మతాలు, కులాలు, వర్గాలు, వాటి మధ్య ఉన్న వైరుధ్యాలు, సారూప్యాలను వివరంగా చదవాలి. భిన్నత్వంలో ఏకత్వం ఈ సమాజ లక్షణమని గుర్తిస్తూ దానిపై పరిజ్ఞానాన్ని పెంచుకోవాలి. 
  • భారతదేశంపై ప్రాచీన కాలంలో మెగస్తనీస్‌ అభిప్రాయం మొదలుకొని ప్రస్తుత కాలంలో టోని జోషఫ్‌ రాసిన ‘ఎర్లీ ఇండియన్స్‌’ వరకు అవగాహన ఉండాలి. 
  • వర్గం, కులం, వర్గ మూలాలు, మారుతున్న ధోరణులు, కుటుంబం, విధుల్లో వస్తున్న మార్పులు, వివాహ వ్యవస్థ, బంధుత్వం, మతం, చారిత్రక నేపథ్యం, ప్రపంచీకరణ వల్ల వస్తున్న మార్పులు, తెగలు, సాంఘిక పరివర్తన, స్త్రీ సాధికారత అంశాలను సవివరంగా చదువుతూ నోట్స్‌ రాసుకోవాలి. 
  • తెలంగాణ సమాజపు సామాజిక - సాంస్కృతిక లక్షణాలు, జనాభా లక్షణాలు, సామాజిక నిర్మాణం, దొరల ఆధిపత్యం నుంచి ప్రజాస్వామ్య ప్రక్రియవైపు సాగిన పరిణామ క్రమం, తెలంగాణ సంస్కృతి, గంగ - జమున తహిజీబ్‌, తెలంగాణ పండుగలు, తెలంగాణలో కుల - జాతి పరమైన సమూహాలు, సామాజిక - ఆర్థిక అంశాలను అవగతం చేసుకోవాలి. 
  • అధ్యయనంలో సామాజిక అంశాలు, సామాజిక వివాదాలు అంతర్భాగంగా ఉండాలి. అసమానతల బహిష్కరణ, భారత సామాజిక చట్రంలో కుల మత సంఘర్షణ కారణాలు, సంప్రదాయ - ఆధునిక భావనలు, ప్రాంతీయ వాదం, లైంగిక హింస, బాల కార్మికులు, మనుషుల అక్రమ రవాణా, వ్యవసాయ సమాజాల బాధలు, వలస సమస్యలు, పుష్‌ - పుల్‌ కారణాలు, వైకల్య - వృద్ధాప్య సమస్యలతోపాటు వాటి పరిష్కారాలకోసం  అనుసరిస్తున్న రాజ్యాంగ విధానాలు, ప్రభుత్వ చర్యలు తెలుసుకోవాలి.  
  • భారతదేశంలోని సామాజిక ఉద్యమాలను అర్థం చేసుకోవాలి. రైతులు, గిరిజనులు, దళితులు, మహిళలు, వెనకబడిన వర్గాలు, పర్యావరణ ఉద్యమాల ఆవిర్భావ కారణాలు - వ్యాప్తి - ఫలితాలు తెలుసుకోవాలి. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం, నక్సల్‌బరీ ఉద్యమం, సమకాలీన రైతాంగ పోరాటాలు, గిరిజన ఉద్యమాలు - వాటి ప్రత్యేకతలు, బ్రిటిష్‌ ఇండియాలో అలాగే స్వాతంత్య్రం వచ్చిన తరవాత తిరుగుబాట్లు, వెనకబడిన వర్గాల అస్తిత్వం కోసం ఉద్యమాలు, మండల్‌ ఆందోళనలు, దళిత ఉద్యమాలు - స్వరూప స్వభావాలు, డా.బీ.ఆర్‌ అంబేద్కర్‌ దార్శనికత, మానవ హక్కుల ఉద్యమాలు, అంతర్జాతీయ ఉద్యమ ప్రభావాలు, భారతీయ నేపథ్యం, సమాజంలో పెరుగుతున్న హింస ప్రవృత్తి, గృహ హింస, పేదరికం, బాల కార్మిక వ్యవస్థ, మానవ హక్కుల సంఘాలు, స్త్రీ ఉద్యమ సంస్థలు, జెండర్‌ బడ్జెటింగ్‌, ఎకో ఫెమినిజం, నిర్భయ యాక్ట్‌, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాలు, పర్యావరణ ఉద్యమాలు చదవాలి.
  • భారతదేశ సాంఘిక, ఆర్థిక, పర్యావరణ ఉద్యమాలతోపాటు తెలంగాణ సామాజిక ఉద్యమాలపై అవగాహన పెంచుకోవాలి. అలాగే తెలంగాణ సాయుధ రైతాంగ వారసత్వ ఉద్యమాలు, తెలంగాణలో జైన్‌ ఇన్‌ ఇండియా, ఆర్య సమాజ్‌, లైబ్రరీ ఉద్యమం, గిరిజన - ఆదివాసీ ఉద్యమాలు, దళిత ఉద్యమాలు, మానవ హక్కుల ఉద్యమాలు వివరంగా చదవాలి. 
  • అభ్యర్థులు తెలంగాణలోని ప్రత్యేక సామాజిక సమస్యలను వివరంగా తెలుసుకోవాలి. వెట్టి చాకిరి, బేకార్‌, భవేళ, జోగినీ, బాల కార్మికుల స్థితిగతులతోపాటు ఫ్లోరోసిస్‌ సమస్యలు, తెలంగాణలో వలసల సమస్యలపై అధ్యయనం చేయాలి. వీటితోపాటు సమస్యల వారీగా ప్రభుత్వ సామాజిక విధానాలు, సంక్షేమ కార్యక్రమాలను తెలుసుకోవాలి. 
  • షెడ్యూల్డ్‌ కులాలు, తెగల సంక్షేమం కోసం చేపట్టిన పథకాలు, సామాజిక భద్రత చట్టాలు, రాజ్యాంగ ప్రకరణలు, సబ్‌ ప్లాన్‌ స్ట్రాటజీలు, ఆరోగ్య విధానాలు, పునరావాస విధానాలు, వ్యవసాయ సమస్యలు - పరిష్కార విధానాలు, ఓబీసీ పాలసీలు, వివిధ కమిషన్‌లు - వాటి రిపోర్టులు, మైనారిటీ పాలసీలు, బాలల జాతీయ పరిరక్షణ కమిషన్‌ యూనిసెఫ్‌ తోడ్పాటు వంటి అంశాలపై లోతైన అధ్యయనం తప్పనిసరి. 
  • భారతీయ సమాజంలో చారిత్రక పరిణామ క్రమంలో వస్తున్న మార్పులు, సామాజిక వెలి నుంచి సమ్మేళనం కోసం ప్రభుత్వం తీసుకొంటున్న చర్యలు తెలుసుకోవాలి.
  • అభ్యర్థులు తమ ప్రిపరేషన్‌లో భాగంగా మొదట సామాజిక సమస్యలను అర్థం చేసుకోవాలి. తరవాత సామాజిక రుగ్మతలను తొలగించడం కోసం ప్రభుత్వం చేస్తున్న చట్టాలు, రాజ్యాంగ రక్షణ విధానాలు తెలుసుకోవాలి. సమస్యలు, పరిష్కారాలను సమన్వయం చేసుకొంటూ సవివరంగా నోట్స్‌ రాసుకోవాలి.  


రిఫరెన్స్‌ బుక్స్‌

  • ఇంటర్‌ - సమాజ శాస్త్రం (సోషియాలజీ)  రెండు సంవత్సరాల పుస్తకాలు
  • బీఏ - సోషియాలజీ మూడు సంవత్సరాల పుస్తకాలు
  • సామాజిక నిర్మితి, వివాదాలు, విధానాలు - పోటీపరీక్షల ప్రత్యేకం - తెలుగు అకాడమీ
  • ఎర్లీ ఇండియన్స్‌ - టోని జోషఫ్‌
  • సోషల్‌ ప్రాబ్లమ్స్‌ ఇన్‌ ఇండియా - రామ్‌ అహుజ



-డాక్టర్‌ రియాజ్‌

సీనియర్‌ ఫ్యాకల్టీ, అకడమిక్‌ డైరెక్టర్‌, 5 మంత్ర కెరీర్‌ పాయింట్‌, హైదరాబాద్‌



Updated Date - 2022-05-24T21:22:42+05:30 IST