జ్యోతిర్లింగ దర్శనం రైలు వివరాలు ఇవే...

ABN , First Publish Date - 2021-10-21T19:39:52+05:30 IST

దేశంలోని నాలుగు జ్యోతిర్లింగ క్షేత్రాలను కలుపుతూ

జ్యోతిర్లింగ దర్శనం రైలు వివరాలు ఇవే...

న్యూఢిల్లీ : దేశంలోని నాలుగు జ్యోతిర్లింగ క్షేత్రాలను కలుపుతూ ఓ రైలును గురువారం ప్రారంభిస్తారు. ఉత్తర ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ సంగం స్టేషన్‌ నుంచి ఈ రైలు ప్రారంభమవుతుంది. గుజరాత్‌లోని స్టాట్యూ ఆఫ్ యూనిటీ, ఉదయ్‌పూర్‌ను కూడా సందర్శించే అవకాశం కల్పించారు. 10 రోజుల యాత్రకు ఒక్కొక్కరికి రూ.10,395గా నిర్ణయించారు. 


జ్యోతిర్లింగ క్షేత్రాలు 12 ఉన్నాయి. వీటిలో నాలుగు క్షేత్రాలను కలుపుతూ ఈ రైలును ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సీటీసీ) ప్రారంభిస్తోంది. భక్తులు ఈ రైలులో ప్రయాణించి మహాకాళేశ్వర్, ఓంకారేశ్వర్, సోమనాథ్, నాగేశ్వర జ్యోతిర్లింగాలను సందర్శించవచ్చు. గుజరాత్‌లోని స్టాట్యూ ఆఫ్ యూనిటీ, ద్వారకలోని ద్వారకాధీశ్ మందిరం, భేంట్ ద్వారక మందిర్, సబర్మతి ఆశ్రమం, ఉదయ్‌పూర్‌లోని సిటీ ప్యాలెస్, సహేలియోంకీ బారీ, మహారాణా ప్రతాప్ మెమోరియల్‌లను కూడా సందర్శించవచ్చు. 10 రాత్రులు, 11 పగళ్ళు ప్రయాణం కోసం ప్యాకేజీ ధర ఒక్కొక్కరికి రూ.10,395గా నిర్ణయించారు. 


ఈ రైలులో ప్రయాణించేందుకు బుకింగ్స్ ఇటీవల ప్రారంభమయ్యాయి. ఉత్తర ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ నుంచి ఈ రైలు ప్రారంభమవుతుంది. ప్రతాప్‌గఢ్, అమేథీ, రాయ్ బరేలీ, లక్నో, కాన్పూరు, ఇటావా, భీండ్, గ్వాలియర్, ఝాన్సీ స్టేషన్లలో కూడా ప్రయాణికులు ఎక్కవచ్చు. 


ప్రయాణికులకు స్వచ్ఛమైన శాకాహార అల్పాహారం, భోజనం అందజేస్తామని ఐఆర్‌సీటీసీ తెలిపింది. ధర్మశాలలో వసతి సదుపాయం, ప్రకృతి దృశ్యాలను వీక్షించేందుకు లోకల్ బస్ సదుపాయం కల్పిస్తామని తెలిపింది. వీటన్నిటికి అయ్యే ఖర్చులు కలుపుకొని మొత్తం మీద ఒక్కొక్కరికి రూ.10,395గా నిర్ణయించినట్లు పేర్కొంది. 


Updated Date - 2021-10-21T19:39:52+05:30 IST