పిల్లల్లో వచ్చే క్యాన్సర్లు ఇవే..!

ABN , First Publish Date - 2022-09-27T19:47:30+05:30 IST

పెద్దల్లో వచ్చే క్యాన్సర్లన్నీ పిల్లల్లో కూడా వచ్చే అవకాశం ఉంది. అయితే ప్రధానంగా వారిలో

పిల్లల్లో వచ్చే క్యాన్సర్లు ఇవే..!

పెద్దల్లో వచ్చే క్యాన్సర్లన్నీ పిల్లల్లో కూడా వచ్చే అవకాశం ఉంది. అయితే ప్రధానంగా వారిలో రక్తసంబంధ క్యాన్సర్లు (లుకేమియా), మెదడు కణుతులు (బ్రెయిన్‌ ట్యూమర్లు), లింఫోమా, సాఫ్ట్‌ టిష్యూ సార్కోమా ఎక్కువ. అయితే పిల్లల్లో వచ్చే ఈ క్యాన్సర్లన్నీ చికిత్సకు లొంగిపోతూ ఉండడం విశేషం. 


పిల్లల్లో తరచుగా కనిపించే క్యాన్సర్లులు

కేమియా, బ్రెయిన్‌, స్పైనల్‌ కార్డ్‌ ట్యూమర్లు, న్యూరోబ్లాస్టోమా, విల్మ్స్‌ ట్యూమర్‌, లింఫోమా, బోన్‌ క్యాన్సర్‌, రాబ్డోమయోసార్కోమా, రెటినోబ్లాస్టోమా


లక్షణాలు 

పిల్లల్లో క్యాన్సర్‌ ఎటువంటి లక్షణాలూ చూపకపోవచ్చు. అకస్మాత్తుగా జ్వరంతో బయటపడవచ్చు. అయితే పిల్లల్లో క్యాన్సర్లు పూర్తిగా నయం చేయదగినవే కాబట్టి తల్లితండ్రులు భయపడవలసిన అవసరం లేదు. చిన్నప్పుడు 20 గ్రేల కంటే ఎక్కువ రేడియేషన్‌కు గురైన వాళ్లకు క్యాన్సర్‌ వచ్చే ప్రమాదం ఉంది. ‘‘గ్రే’’ అంటే శరీరం గ్రహించిన రేడియేషన్‌ అని అర్థం. మరీ చిన్న వయసులో మామోగ్రామ్‌ మొదలైన పరీక్షలు చేయించుకోవడం కూడా మంచిది కాదు. 30 ఏళ్లు పైబడిన తర్వాత డాక్టరు సూచన మేరకే ఈ పరీక్ష చేయించుకోవాలి. 12 ఏళ్లు పైబడిన ఆడ, మగా పిల్లలకు క్యాన్సర్‌ చికిత్స ప్రభావం పునరుత్పత్తి వ్యవస్థ మీద పడుతుంది అనుకున్నప్పుడు, ముందుగానే వారి నుంచి వీర్యకణాలు, అండాలు సేకరించి, భద్రపరుస్తారు.


లుకేమియా క్యాన్సర్‌ లక్షణాలు, చికిత్స

ఇన్‌ఫెక్షన్ల నుంచి రక్షించే తెల్ల రక్తకణాలు అపరిమితంగా పెరిగిపోవడమే లుకేమియా. ఈ క్యాన్సర్‌ చిన్న పిల్లల్లో సర్వసాధారణం. పెరిగిన తెల్ల రక్తకణాలు, ఎర్ర రక్తకణాలకు అవరోధంగా మారి, సరఫరాకు అడ్డుపడతాయి. ఇలా హఠాత్తుగా లేదా దీర్ఘకాలంలో జరగవచ్చు. బోన్‌మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్‌, స్టెమ్‌ సెల్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ ప్రక్రియలు ఈ క్యాన్సర్‌కు బాగా పని చేస్తాయి. మొదటి బిడ్డకు రక్తసంబంధిత క్యాన్సర్‌ ఉంటే, రెండో బిడ్డ విషయంలో కూడా జాగ్రత్త పడాలి. పిల్లలు పాలిపోయినట్టుగా ఉండడం, ఆకలి, బరువు తగ్గడం, నీరసం, అలసట ఎక్కువగా ఉండడం, చర్మం తేలికగా కమిలిపోవడం, తీవ్రమైన రక్తస్రావం ఒళ్లు నొప్పులు లక్షణాలు కనిపిస్తే, అనుమానించి పరీక్షలతో వ్యాధిని నిర్ధారించుకోవాలి.


బ్రెయిన్‌ ట్యూమర్లు

తలనొప్పి, వికారం, వాంతులు, ఫిట్స్‌, మాటలు మందగిస్తే మెదడులో ట్యూమర్‌గా అనుమానించాలి. అది క్యాన్సర్‌ కణితి అయనా కాకపోయినా, సర్జరీ లేదా ఇతరత్రా తగిన చికిత్సా విధానాలను వైద్యులు ఎంచుకుంటారు. మెదడు కణితిని రేడియో సర్జరీతో తొలగిస్తారు. మెడ, చంకలు, గజ్జల్లో లింఫ్‌ నాళాలు వాపుతో లింఫోమాలు బయటపడుతూ ఉంటాయి.


సాఫ్ట్‌ టిష్యూ సార్కోమా

ఇతర టిష్యూలను కలిపే సాఫ్ట్‌ టిష్యూలో తలెత్తే క్యాన్సర్‌ ఇది. ఈ క్యాన్సర్‌కు సర్జరీ, దాని కంటే ముందు లేదా తర్వాత రేడియో, కీమో థెరపీలు ఉంటాయి. రెండేళ్ల కంటే తక్కువ వయసున్న పిల్లల్లో అడ్రినల్‌ గ్రంథిలో, మెడ, ఛాతీ, పొట్టలో వచ్చే కణుతులు (న్యూరో) బ్లాస్టోమాలు. ఎముకలు, టిష్యూల్లో వచ్చే ఈవింగ్‌ సార్కోమా, మూత్రపిండాల్లో వచ్చే నెఫ్రాబ్లాస్టోమా వంటివి కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి.


-డాక్టర్‌ పాలంకి సత్య దత్తాత్రేయ

డైరెక్టర్‌ అండ్‌ చీఫ్‌ ఆఫ్‌ మెడికల్‌ ఆంకాలజీ సర్వీసెస్‌,

రెనోవా సౌమ్య క్యాన్సర్‌ సెంటర్‌, కార్ఖానా, సికింద్రాబాద్‌

సంప్రదించవలసిన నెంబరు: 7799982495



Updated Date - 2022-09-27T19:47:30+05:30 IST