Abn logo
Sep 9 2021 @ 01:27AM

వీళ్లే మన వేటగాళ్లు!

  • అశ్విన్‌ రీఎంట్రీ.. ఇషాన్‌, సూర్యకు చోటు 
  • చాహల్‌, ధవన్‌పై వేటు
  • స్టాండ్‌బైలుగా శ్రేయాస్‌, శార్దూల్‌
  • టీ20 వరల్డ్‌కప్‌నకు 15 మందితో భారత జట్టు


మెంటార్‌గా ధోనీ  

ప్రతిష్ఠాత్మక టీ20 వరల్డ్‌ కప్‌లో తలపడే టీమిండియాను బుధవారం ప్రకటించారు. 15 మందితో కూడిన ఈ జట్టుకు మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోనీని మెంటార్‌గా ఎంపిక చేస్తూ సెలెక్టర్లు అత్యంత ఆశ్చర్యకరమైన నిర్ణయం తీసుకున్నారు. ఇక సీనియర్‌ ఆఫ్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ సుదీర్ఘకాలం తర్వాత జట్టులోకి పునరాగమనం చేశాడు. 


ముంబై: ‘పొట్టి’ సంగ్రామానికి టీమిండియా సిద్ధమైంది. విరాట్‌ కోహ్లీ సారథ్యంలో తలపడే భారత జట్టును సెలెక్షన్‌ కమిటీ ఎంపిక చేసింది.  మాజీ  కెప్టెన్‌ ధోనీని మార్గదర్శకుడిగా  నియమిస్తూ అనూహ్య నిర్ణయం తీసుకుంది. సీనియర్‌ అశ్విన్‌కు చోటు కల్పించడంతోపాటు  యువ వికెట్‌ కీపర్‌ ఇషాన్‌ కిషన్‌, స్పిన్నర్లు వరుణ్‌ చక్రవర్తి, అక్షర్‌ పటేల్‌నూ ఎంపిక చేసింది.   ముంబై బ్యాట్స్‌మన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌కు కూడా జట్టులో స్థానం కల్పించింది. స్పిన్నర్లు వరుణ్‌ చక్రవర్తి, అక్షర్‌ పటేల్‌నూ జట్టులోకి తీసుకుంది. మొత్తం ఐదుగురు స్పిన్నర్లను ఎంపిక చేయడం విశేషం. వచ్చేనెల 17 నుంచి యూఏఈ, ఒమన్‌ వేదికలుగా ప్రపంచ కప్‌ జరగనుంది. ‘దుబాయ్‌లో ఉన్న ఽధోనీతో మాట్లాడా. మెంటార్‌గా ఉండేందుకు అతడు అంగీకరించాడు. ఇదే విషయాన్ని నా సహచరులందరితో చర్చించా. కెప్టెన్‌ కోహ్లీ, వైస్‌ కెప్టెన్‌ రోహిత్‌తోనూ చర్చించా. ఽఽధోనీ నియామకానికి వారు అంగీకరించారు’ అని  బీసీసీఐ కార్యదర్శి జై షా జట్టును ప్రకటిస్తూ వెల్లడించాడు.  


చాహల్‌, ధవన్‌పై వేటు: ఓపెనర్‌ శిఖర్‌ ధవన్‌, లెగ్‌స్పిన్నర్‌ యజ్వేంద్ర చాహల్‌ను జట్టు నుంచి తప్పించారు. ఇప్పటి వరకు పరిమిత ఓవర్ల జట్టులో భాగంగా ఉన్న చాహల్‌కంటే కూడా రాహుల్‌ చాహర్‌పై సెలెక్టర్లు మొగ్గుచూపారు. కేఎల్‌ రాహుల్‌, రోహిత్‌తోపాటు ఓపెనర్‌గా కిషన్‌కు ఓటేసిన వారు..ధవన్‌ను పక్కనబెట్టారు. ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా పూర్తి ఫిట్‌గా ఉన్నాడని తన కోటా ఓవర్లు బౌల్‌ చేస్తాడని చేతన్‌ శర్మ స్పష్టంజేశాడు. ‘పిచ్‌పై పేస్‌ను ఉపయోగించుకొని వేగంగా బౌలింగ్‌ చేయగల సమర్థుడు కావడంతో యుజీకి బదులు రాహుల్‌ చాహర్‌ను ఎంపిక చేశాం’ అని వివరించాడు. జడేజాకు ప్రత్యామ్నాయంగా ఆల్‌రౌండర్‌ అక్షర్‌ పటేల్‌కు స్థానం కల్పించారు. శ్రేయాస్‌ అయ్యర్‌, పృథ్వీ షాకు జట్టులో చోటు లభించలేదు. అయితే దీపక్‌ చాహర్‌, శార్దూల్‌ ఠాకూర్‌తోపాటు స్టాండ్‌బైగా శ్రేయా్‌సను ఎంపిక చేశారు. ఇటీవల ఆల్‌రౌండర్‌గా అదరగొడుతున్న శార్దూల్‌కు ప్రతిఫలం దక్కింది. వచ్చేనెల 24న దాయాది పాకిస్థాన్‌తో మ్యాచ్‌తో ప్రపంచ కప్‌ పోరును భారత్‌ ఆరంభించనుంది. 

మహీ అందుకేనా..?

40 ఏళ్ల ధోనీ గత ఏడాది అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. అతడు చివరిసారి 2019 వన్డే వరల్డ్‌ కప్‌ సెమీస్‌లో భారత్‌కు ఆడాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఎంఎస్‌కు అపార అనుభవం ఉంది. ఎత్తుగడలు వేయగల నేర్పు, హోరాహోరీగా సాగే పొట్టి క్రికెట్‌లో ప్రశాంత చిత్తంతో వ్యవహరిస్తూ విజయాలు అందించగల సమర్ధత ఉండడం, మరోవైపు కీలకమైన ఐసీసీ టోర్నీల్లో కెప్టెన్‌ కోహ్లీకి అంతగా అనుభవం లేకపోవడంలాంటి కారణాలతో ధోనీకి మెంటార్‌ బాధ్యతలు అప్పగించినట్టు తెలుస్తోంది. మహీ కెప్టెన్సీలో భారత్‌ 2007 టీ20, 2011 వన్డే వరల్డ్‌ కప్‌లను నెగ్గింది.   

జట్టు 

విరాట్‌ కోహ్లీ (కెప్టెన్‌), రోహిత్‌ శర్మ (వైస్‌-కెప్టెన్‌), కేఎల్‌ రాహుల్‌, సూర్యకుమార్‌, రిషభ్‌ పంత్‌ (కీపర్‌), ఇషాన్‌ కిషన్‌ (కీపర్‌), హార్దిక్‌ పాండ్యా, రవీంద్ర జడేజా, రాహుల్‌ చాహర్‌, అశ్విన్‌, అక్షర్‌ పటేల్‌, వరుణ్‌ చక్రవర్తి, బుమ్రా, 

భువనేశ్వర్‌, షమి.

స్టాండ్‌ బై: దీపక్‌ చాహర్‌, శ్రేయాస్‌ అయ్యర్‌, శార్దూల్‌ ఠాకూర్‌
నాలుగు సంవత్సరాల సుదీర్ఘ సమయం తర్వాత స్పిన్నర్‌ అశ్విన్‌ జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు. అతడు చివరిసారి 2017 జూలైలో వెస్టిండీస్‌లో టీ20 మ్యాచ్‌ ఆడాడు. అంతకుముందు జరిగిన చాంపియన్స్‌ ట్రోఫీ తర్వాత అశ్విన్‌ను వన్డేలకూ పక్కనబెట్టారు. అయితే ఐపీఎల్‌లో సత్తా చాటడంతోపాటు టెస్ట్‌ జట్టు స్పిన్‌ విభాగానికి నేతృత్వం వహిస్తుండడంతో అశ్విన్‌ను మళ్లీ ఎంపిక చేయక తప్పలేదు.  ‘అశ్విన్‌ జట్టుకు ఆస్తి. ఐపీఎల్‌లో అతడు బాగా ఆడుతున్నాడు. అందువల్ల అశ్విన్‌లాంటి అనుభవజ్ఞుడు జట్టులో ఉండాలని భావించాం’ అని చీఫ్‌ సెలెక్టర్‌ చేతన్‌ శర్మ వ్యాఖ్యానించాడు. కిషన్‌ (23), వరుణ్‌ చక్రవర్తి (30) ఐపీఎల్‌లో నిలకడగా రాణిస్తుండడం, టీమిండియాలో చోటు దక్కించుకున్న సందర్భాల్లో సత్తా చాటడంతో వీరిద్దరికి టీ20 జట్టులో స్థానం ఖాయమైంది. మిస్టరీ స్పిన్నర్‌గా వరుణ్‌కు చోటు కల్పించామని శర్మ తెలిపాడు.  

క్రైమ్ మరిన్ని...