chanakya niti: ఈ 9 అమూల్యమైన సూత్రాలు మీ జీవితాన్ని అద్భుతంగా మార్చివేస్తాయి!

ABN , First Publish Date - 2022-09-29T12:03:25+05:30 IST

చాణక్యుడు లేకుండా చంద్రగుప్త మౌర్య అంతటి...

chanakya niti: ఈ 9 అమూల్యమైన సూత్రాలు మీ జీవితాన్ని అద్భుతంగా మార్చివేస్తాయి!

చాణక్యుడు లేకుండా చంద్రగుప్త మౌర్య అంతటి ఘన విజయం సాధించలేడని చెబుతారు. ఆచారాలు, మతం గురించి చాణక్యుడు చేసిన వ్యాఖ్యానం చాలా లోతైనది. ఎవరూ తప్పుపట్టలేనిది. ఇది ప్రతి ఒక్కరి జీవితానికీ సరైన మార్గాన్ని చూపుతుంది. కష్ట సమయాల్లో మార్గనిర్దేశం చేసే 9 అద్భుతమైన విషయాలను చాణక్యుడు చెప్పాడు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

1. చాణక్యుడు తెలిపిన ప్రకారం గడిచిన సమయాన్ని స్మరించుకుని పశ్చాత్తాపం చెందడం పనికిరాదు. పొరపాటు జరిగినా, దాని నుండి గుణపాఠం నేర్చుకుని, వర్తమానాన్ని మెరుగుపరుచుకునేందుకు ప్రయత్నించాలి.

2. కష్టపడి సంపాదించిన సంపదను సద్వినియోగం చేయాలి. దానధర్మాలు చేయాలి. అమితంగా ధనవ్యామోహం పనికిరాదు. 


3. మీరు ఏదైనా పనిని ప్రారంభిస్తే 3 విషయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించండి. మొదట మీరు దీనిని ఎందుకు చేయాలనుకుంటున్నారు? రెండవది, ఈ పనికి లభించే ఫలితం ఏమిటి? ఇందులో విజయం సాధిస్తానా?

4. పాము విషపూరితం కాకపోయినా, అది బుసలు కొట్టడం మానదు. ఎందుకంటే అది విషరహితమని తెలిస్తే దాని ప్రాణానికి అపాయం తలెత్తుతుంది. అదేవిధంగా మనిషి ఎవరికీ హాని చేయకూడదు. కానీ ఎవరైనా మిమ్మల్ని బలహీనంగా భావించి, మీపై ఆధిపత్యం చెలాయించడానికి ప్రయత్నిస్తే, మీరు మీ సత్తా చూపాలి.  అటువంటి సందర్భంలో కోపం ప్రదర్శించాలని, నిరసనను వ్యక్తం చేయాలని ఆచార్య చాణక్య తెలిపారు. 

5. పూల సువాసన వ్యాప్తి కావడానికి చల్లని గాలి అవసరం. అదే విధంగా ఒక వ్యక్తి తన గుణాలు లేదా సామర్థ్యాలను తన నోటితో చెప్పాల్సిన అవసరం లేదు. వాటికవే సువాసనలా వ్యాపిస్తాయి. సువాసనను ఎలా అణచివేయలేమో, అలాగే మంచి లక్షణాలను కూడా అణచివేయలేం. అటువంటి వ్యక్తి కీర్తిప్రతిష్టలను పొందుతాడు. 

6. ఒకరి కింద పనిచేయడం కన్నా మరొకరి ఇంట్లో నివసించడం చాలా బాధాకరమైన విషయం.

7. మన ముందు మంచిగా మాట్లాడి, వెనుక గోతులు తవ్వే  స్నేహితులను విడిచిపెట్టడం ఉత్తమం. 

8. మానసికంగా బలహీనంగా ఉన్న వ్యక్తితో ఎప్పుడూ స్నేహం చేయవద్దు. ఎందుకంటే అతను మీరు బలహీనంగా ఉన్నప్పుడు లేదా మీరు ఏమరపాటుగా ఉన్న సమయంలో మీపై దాడి చేసేందుకు అవకాశం ఉంది. 

9. వేల పశువుల మధ్యనున్న దూడ తన తల్లి చెంతకే చేరుతుంది. అదే విధంగా మనుషులు చేసే కర్మల ఫలితాలు వారిని వెంటాడుతాయి. అందువల్ల ఎల్లప్పుడూ మంచి పనులు చేసేందుకు ప్రయత్నించాలని ఆచార్య చాణక్య తెలిపారు. 

Updated Date - 2022-09-29T12:03:25+05:30 IST