దేశాన్నే కదిలించిన థర్మల్‌ ఉద్యమం

ABN , First Publish Date - 2020-07-15T09:38:58+05:30 IST

సోంపేట థర్మల్‌ ఉద్యమం యావత్‌ భారతదేశాన్నే కదిలించిందని పర్యావరణ పరిరక్షణ సమితి అధ్యక్షుడు డాక్టర్‌ వై.కృష్ణమూర్తి అన్నారు.

దేశాన్నే కదిలించిన థర్మల్‌ ఉద్యమం

కాల్పుల ఘటనకు పదేళ్లు

అమరుల త్యాగాలు మరువలేనివి

నివాళులర్పించిన పర్యావరణ పరిరక్షణ సమితి, మత్స్యకార ఐక్యవేదిక ప్రతినిధులు


సోంపేట, జూలై 14 : సోంపేట థర్మల్‌ ఉద్యమం యావత్‌ భారతదేశాన్నే కదిలించిందని పర్యావరణ పరిరక్షణ సమితి అధ్యక్షుడు డాక్టర్‌ వై.కృష్ణమూర్తి అన్నారు. పోలీస్‌ కాల్పుల్లో రైతులు గున్న జోగారావు, బెందాళం కృష్ణమూర్తి, గొనప కృష్ణమూర్తిలు అమరులయ్యారు. మంగళవారం నాటికి ఈ ఘటనకు పదేళ్లు పూర్తయ్యింది. ఈ సందర్భంగా బీల ప్రాంతంలో అమరవీరుల స్థూపం వద్ద పర్యావరణ పరిరక్షణ సమితి, మత్స్యకార ఐక్యవేదిక ప్రతినిధులు, కుటుంబసభ్యులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ పర్యావరణాన్ని పరిరక్షించకుంటే కరోనాలాంటి ఎన్నో విపత్తులు వస్తాయని హెచ్చరించారు. నాడు చిత్తడి నేలల కోసం, భావితరాల కోసం రైతులు, మత్స్యకారులు జరిపిన పోరాటం ప్రపంచ స్థాయిలో నిలిచిపోయిందన్నారు. థర్మల్‌ ఉద్యమంలో ప్రధాన పాత్రపోషిస్తూ అమరులైన మాదిన రాఘవయ్య, తడక చంద్రయ్యల త్యాగాలను కొనియాడారు. 


2000 రోజులు రిలే నిరాహార దీక్షలతో జాతిని కదిలించిన విషయాన్ని గుర్తుచేశారు. ప్రభుత్వాలు మారినా పచ్చని బీలను నాశనం చేసే జీవోలను మాత్రం రద్దు చేయడం లేదన్నారు. కార్యక్రమంలో బీన ఢిల్లీరావు, సూరాడ చంద్రమోహన్‌, బార్ల సుందరరావు, సనపల శ్రీరామ్మూర్తి, మాదిన ధనుంజయరావు, నిట్ట గోపాల్‌, కోదండరావు,  బత్తుల శంకరరావు, గంగాధర్‌, డి.దీనబంధు, సత్యరాజ్‌, వెంకన్న, గున్న జగదాంబ, గొనప సత్యం పాల్గొన్నారు.

Updated Date - 2020-07-15T09:38:58+05:30 IST