Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Sat, 28 May 2022 00:42:56 IST

అందుకే... ఆయన కలియుగ దైవం

twitter-iconwatsapp-iconfb-icon
అందుకే... ఆయన కలియుగ దైవం

పరుచూరి బ్రదర్స్‌లో.... ఏ ఒక్కరి గుండె చప్పుడు విన్నా.. ఒకేలా వినిపిస్తుంది. ఒకే పేరు ధ్వనిస్తుంది.  అదే ఎన్‌...టీ...ఆర్‌! వారిద్దరూ పది మాటలు మాట్లాడితే... అందులో తొమ్మిది ఎన్టీఆర్‌ గురించే. ఆయనంటే అంతిష్టం. ‘పరుచూరి బ్రదర్స్‌’ అని ఆ సోదరులకు పేరు పెట్టి, పరిశ్రమకు పరిచయం చేసింది ఆ పెద్దాయనే. ఎన్టీఆర్‌ సినిమాలతోనే పరుచూరి బ్రదర్స్‌ అనే పేరు మార్మోగింది. అందుకే.. ఇప్పటికీ ఆ పేరే.. వాళ్ల తారక మంత్రంగా మారింది. ఎన్టీఆర్‌ శతజయంతి సంవత్సరాన్ని పురస్కరించుకొని పరుచూరి గోపాలకృష్ణతో మాట కలిపింది ‘నవ్య’. దాంతో.. ఆయన ఒక్కసారిగా ఎన్టీఆర్‌ జ్ఞాపకాల్లోకి వెళ్లిపోయారు. 


ఎన్టీఆర్‌గారి శత జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి. నిర్వహణ కమిటీలో మీరు కూడా ఉన్నారు. తెలుగు ప్రజలకు, సంస్కృతికి ఆయన  చేసిన సేవలను  ఎలా నిర్వచిస్తారు?

ఎన్టీఆర్‌ అంటే కలియుగ దైవం. కృష్ణుడు పుట్టినప్పుడు ఆయన్ను ఎవరూ దేవుడిగా అంగీకరించలేదు. నందమూరి తారకరామారావును కూడా అలానే అంగీకరించలేదు. ఎందుకంటే మనతోపాటు ఉన్నారు కాబట్టి ఆయన. కృష్ణుడు పాండవులతో ఉన్నాడు. వారంతా ఆయన్ను తమ బంధువుగానే చూశారు. కొద్దిమంది మాత్రమే దైవంలా చూశారు. అలానే అభిమానుల హృదయాల్లో ఎన్టీఆర్‌ దైవం. ఎందుకంటే  తను హీరోగా  ఇంకో నాలుగైదు ఏళ్లు ఉండి, ఆ తర్వాత రిటైర్‌ అయి విశ్రాంత జీవితం గడపొచ్చు. కానీ ‘నాకు జీవితం ఇచ్చిన వాళ్లకు తిరిగి ఏదో ఇవ్వాలి’ అనే తపనతో తన అరవైయ్యో ఏట  రాజకీయాల్లోకి  ఆయన వచ్చారు. ముఖ్యమంత్రిగా  ఎన్ని సంస్కరణలు చేశారో అందరికీ తెలుసు.   60 ఏళ్లు దాటాక కూడా నటిస్తూనే ఉన్న వాళ్లను ఇప్పుడు మనం చూస్తున్నాం.  ప్రజల కోసం శేష జీవితాన్ని త్యాగం చేసిన దైవం కాబట్టి, ఆయన్ను నేను కలియుగ దైవం అన్నాను. 

అందుకే... ఆయన కలియుగ దైవం

ఎన్టీఆర్‌తో మీకున్న అనుబంధం గురించి చెప్పండి?

నాకు 13 ఏళ్లున్నప్పుడు అనుకుంటా... ఎన్టీఆర్‌ గారి ‘సీతారామ కల్యాణం’ రిలీజయితే చూడటానికి నూజివీడు వెళ్లా. అప్పట్లో అక్కడ మ్యాట్నీ షోలు ఉండేవి కావు. ఫస్ట్‌ షో, సెకండ్‌ షో మాత్రం ఉండేవి. ఫస్ట్‌ షోకు టికెట్‌ కొనుక్కుంటే కరెంట్‌ పోయింది. తెల్లవారి మూడు అయింది. అయినా కరెంట్‌ రాలేదు. దాంతో వాళ్లు ‘టికెట్లు ఇచ్చి పంపిస్తాం. కావాలంటే రేపు ఫస్ట్‌షోకి రావొచ్చు’ అని చెప్పారు. అయినా ఒక్కరు కూడా లేవలేదు. నాలుగు గంటలకు కరెంటు వ చ్చాక, మిగతా సినిమా అంతా చూశాం. నూజివీడు పక్కన ఉన్న కండ్రిగతోటలో అడుసుమిల్లి విశ్వేశ్వరరావుగారి మామిడితోటలో మా నాన్నగారు సూపర్‌వైజర్‌గా పనిచేసేవారు. సినిమాచూసి అక్కడకు వెళ్లి మామిడి చెట్టు కింద కూర్చుని   ‘నరుల వల్లా, వానరుల వల్ల దానవ జాతికి ఏనాడూ ప్రమాదం సంభవించలేదు స్వామి’ అని ఆ డైలాగ్‌లు అప్పచెబుతా ఉంటే, మా నాన్నగారు రెండు రోజులు చూశారు. మూడో రోజు ఇక ఓపిక పట్టలేక  కర్ర పట్టుకొని వెంటబడ్డారు. ‘చదువు మానేసి, ఈ డైలాగ్‌ల పిచ్చేంటిరా’ అని మామిడితోట అంతా తిప్పి తిప్పికొట్టారు. నా పదమూడో ఏట జరిగిన  ఆ సంఘటన నా జీవితంలో మర్చిపోలేను.  కృష్ణుడిగా ఆరాధించవచ్చు. రాముడిగా ఆరాధించవచ్చు.  కానీ రావణాసురుడిగా కూడా ఆయన్ను  మనం  ఆరాధించాం. ‘సీతారామకల్యాణం’లో విలనిజం కనిపించకుండా, తెలియని హీరోయిజం ఆ పాత్రకు ఆపాదించారు మహానుభావుడు! ఇది ఎందుకు చెబుతున్నానంటే అన్నగారి సినిమా  ‘చండశాసనుడు’కు వర్క్‌ చేస్తున్నాం. ఒకరోజు  ‘ఈ సీన్‌ చదవండి’ అని స్ర్కిప్ట్‌ ఫైల్‌ నాకు అందివ్వబోయారు ఎన్టీఆర్‌. ‘అక్కర్లేదు అన్నగారు నేను   చెబుతాను... పెద్ద ఎన్టీఆర్‌ దగ్గరకు చిన్న ఎన్టీఆర్‌ వచ్చే సీనే  కదండీ’ అన్నాను. ఆయన ఆశ్చర్యంగా నా వంక చూసి  ‘మొత్తం సీన్‌ చెబుతారా’ అని అడిగారు. ‘చెబుతాను సార్‌’ అన్నాను తడుముకోకుండా.  నేను చెప్పింది విన్న తర్వాత ‘ఓహ్‌...మీరు ఏకసంథాగ్రాహులు’ అని అభినందించారు. 

అందుకే... ఆయన కలియుగ దైవం

ఆయనలో మీకు నచ్చని గుణం ఏమిటి?

మీరు అతిశయోక్తి అనుకుంటారు కానీ  ఆయనలో నచ్చని లక్షణం ఏదీ లేదండి.  ఒక ఉదాహరణ చెబితే ‘నిజమా’ అని మీరు ఆశ్చర్యపోతారు. ‘చండశాసనుడు’ క్లైమాక్స్‌ ఆయన ఒక రకంగా రాయించారు. నేనేమో ఇది ఇలా రాస్తే బాగుండదండీ, ‘చండశాసనుడు’ ఇలా చేయకూడదు అని విజయా పూర్ణచంద్రరావుగారి కుమారుడితో  అన్నాను. ఆయన అన్నగారి దగ్గరకు వెళ్లి, ‘అన్నగారు ఆ  కుర్రాడు  బాధపడుతున్నాడు. క్లైమాక్స్‌ అలా ఉండకూడదంట’ అని చెప్పారు. అప్పుడు ఆయన ‘వారిని రమ్మనండి’ అని చెప్పారు. విజయా వాళ్లు టికెట్‌ కొనిచ్చి నన్ను అన్నగారి దగ ్గరకు పంపారు.  ‘ మీరు సంతృప్తిగా లేరనీ తెలిసింది.  ఎలా ఉండాలో చెప్పండి’ అన్నారు. నేను వివరంగా చెప్పాను. ‘చాలా బాగుంది. నిజమే.  మీరు ఆ రోజు చెబుతుంటే మేం వినలేదు’ అన్నారు.  చాపమీద పడుకొని, ఎడమ మోచేతిని  ఆనించి డైలాగ్‌లు రాసుకోవడం నాకు అలవాటు. ఆ విషయం అన్నగారికి తెలిసి  ‘మీరు డైలాగ్‌లు పడుకొని రాస్తారట కదా, మీరు సోఫాలో పడుకొని రాసుకోండి. మేం బయట కూర్చుంటాము’ అని ఆయన బయటకు వెళ్లి కుర్చీలో కూర్చున్నారు. బయట ఎవరో పెద్దగా మాట్లాడుతుంటే ‘ఎవడ్రా అక్కడ, లోపల గోపాలకృష్ణ గారు తపస్సులో రాసుకుంటున్నారు’ అని గదమాయించారు. నేను డైలాగ్‌లు రాయడం పూర్తి చేసి, చదివి వినిపించగానే  చెక్‌ రాసి ఇచ్చేశారు. ‘చాలా సంతోషం నాయనా, అద్భుతంగా ఉంది క్లైమాక్స్‌’ అని మెచ్చుకున్నారు. ఆయనలో ఉన్న మరో గొప్ప గుణం కూడా ఉంది. ‘చండశాసనుడు’  ఎడిటింగ్‌ చేసిన రోజున నేను హైదరాబాద్‌ వచ్చాను. ఆయన ఎదురొచ్చి ‘నీ స్ర్కిప్ట్‌కు నూటికి నూరు శాతం న్యాయం చేయలేకపోయాం’ అన్నారు.  అప్పుడే పార్టీ పెట్టడంతో ఆయన కొన్ని ఇబ్బందులకు గురయ్యారు. అంత గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషి ఎవరికైనా నచ్చలేదంటే వాళ్లను అమాయకులు అనుకోవాలి. మరోసారి ఆయన్ని కలసినప్పుడు  కాలికి కట్టు కట్టుకొని కనిపించారు. ఏంటి అన్నగారు అనడిగితే  ‘ఏం చేస్తాం బ్రదర్‌, అభిమాని. పాపం! నన్ను చూసిన ఆనందంలో వళ్లు మరిచి,  కాలిమీద కొబ్బరికాయ కొట్టాడు’ అన్నారు. ఇంకొకరయితే లాగి చెంప మీద కొట్టేవారు. కానీ అదేమీ పట్టించుకోకుండా  ‘ఇట్సాల్‌ రైట్‌ బ్రదర్‌’ అని ఆ అభిమాని  భుజం తట్టిన  మహానుభావుడు ఆయన. 

అందుకే... ఆయన కలియుగ దైవం

సాంకేతిక అంశాలపై ఎన్టీఆర్‌కు ఎలాంటి పట్టు ఉండేది? 

నేను ‘చండశాసనుడు’ స్ర్కిప్ట్‌ రాసి  ఆయన దగ్గరకు తీసుకెళితే,  కెమెరా ఎలా బిహేవ్‌ చేస్తుంది. ఏది క్లోజు, ఏది లాంగు, ఏది ట్రాలీ షాట్‌  అని స్ర్కిప్టుపైనే ఆయన స్వదస్తూరితో రాశారు. ఆయనలో మరో  కె.వి. రెడ్డి ఉన్నారు. నేను రాసిన ఆ  స్ర్కిప్ట్‌ని   భగవద్గీతలా భద్రంగా  దాచుకుందామనుకున్నాను. ఆయన ఉన్నప్పుడు ధైర్యం చేసి అడగలేకపోయాను. తర్వాత ఎంత వెతికినా దొరకలేదు. షాట్‌ డివిజన్‌, స్ర్కీన్‌ డివిజన్‌ అద్భుతంగా తెలిసిన మహానుభావుడు ఎన్టీఆర్‌. దాసరి గారిలాగా వంద సినిమాలకు దర్శకత్వం చేయగల మేధాసంపత్తి ఆయన సొంతం. ఎడిటింగ్‌లోనూ అంతే. ‘చండశాసనుడు’ సమయంలో ఆయన్ను ‘అన్నగారు  దుర్యోధనుడి మోనో యాక్షన్‌  సీన్‌ రాశాను. మీరు  చేశారు.  లెంగ్త్‌ ఎక్కువైనప్పుడు దాన్ని  తీసేయవచ్చు కదా’ అని అడిగాను. ‘దానికోసం మళ్లీ మళ్లీ వచ్చేవాళ్లుంటారు చూడండి’ అన్నారు. ఎడిటింగ్‌ అంటే ఆయనకు అంత శ్రద్ధ. హీరో కృష్ణగారి ‘ఈనాడు’ సినిమాకు మేమే డైలాగ్స్‌ రాశాం. ఆ సినిమా ఫస్ట్‌ కాపీ చూసి కంగారు పడిపోయి కృష్ణగారి దగ్గరకు పరిగెత్తా. ‘సార్‌ మిక్సింగ్‌లో డైలాగ్‌ మీదకు సౌండ్‌ ఎక్కింది’ అని చెబితే ఆయన ‘అలాగా’ అని వెంటనే సినిమా వేసుకుని చూసి మళ్లీ మిక్సింగ్‌ చేయించారు. కానీ ‘చండశాసనుడు’ చిత్రం చూస్తే ఎక్కడా డైలాగ్‌ మీదకు సౌండ్‌ ఎక్కదు. 24 క్రాఫ్ట్స్‌లోనూ అద్భుతమైన ప్రావీణ్యమున్న మహానుభావుడు నందమూరి తారకరామారావు గారు. తన గెటప్‌ ఎలా ఉండాలో, మీసం ఎలా ఉండాలో ఆయన చెప్పేవారు. 


 ఆయనకు విపరీతమైన కోపం ఉండేదని చెబుతారు?

ఆయనకు కోపం ఉండేది కానీ దానికి మించిన సంయమనం ఉండేది. దానికి ఒక ఉదాహరణ చెబుతాను. ‘చండశాసనుడు’ కథ చెప్పే ముందు రోజు  ‘రేపు ఉదయం నాలుగు గంటలకు కలుస్తాం మనం’ అని నాతో చెప్పి వెళ్లిపోయారు. నేను పక్కనే ఉన్న తాతినేని రామారావు గారితో ‘సర్‌... నేను పడుకునేదే అర్ధరాత్రి దాటాక.  అన్నగారు నాలుగు గంటలకు రమ్మంటున్నారు, ఎలా?’ అన్నాను. వెనుక నుంచి భుజం మీద ఒక టన్ను బరువు చేయి పడింది. అది అన్నగారి చేయి అని నాకు అర్థమైపోయింది. ‘సారీ అన్నగారు’ అన్నాను. ‘ఇట్సాల్‌ రైట్‌.. ఆరు గంటలకు రండి’ అని వెళ్లిపోయారు. ఆయన చెప్పిన టైమ్‌కన్నా ఒక్క నిమిషం ఆలస్యంగా వెళ్లాను. నన్ను చూసి ‘బ్రదర్‌ మీరు మా ఇంట్లో నుంచి లక్ష రూపాయలు దొంగతనం చేసి వెళ్లిపోయి, తర్వాత ఎప్పుడైనా కనిపిస్తే క్షమిస్తాను. కానీ నా సమయంలో  ఒక్క నిమిషం దొంగిలించినా జీవితంలో క్షమించను’ అన్నారు. ‘నాదేశం’ షూటింగ్‌లోనే  మరో సంఘటన. ఎన్టీఆర్‌ అనర్ఘళంగా డైలాగ్‌ చెబుతున్నారు. ఆయన చెప్పడం పూర్తి చేయగానే   స్టూడియోలో ఉన్న అందరూ చప్పట్లు కొట్టారు. దర్శకుడు బాపయ్య గారు ‘ఓకే’ అన్నారు. నేను మాత్రం తలవంచుకొని కూర్చొని ఉన్నాను. అది ఎన్టీఆర్‌ గమనించారు. ‘ఏమి ఓకే బాపయ్య గారు, రాసినవారు. తల వంచుకొని కూర్చున్నారు చూడండి’ అన్నారు. నేను వెంటనే ఏమీ లేదండీ అన్నాను.   ‘లేదు బ్రదర్‌...మీకు ఎందుకో ఇది నచ్చలేదు’ అని అన్నారు. అప్పుడు నేను ‘ఏమి లేదు అన్నగారు, దీని తర్వాత సాంగ్‌ ఉంటుంది. ఆ  తర్వాత మీరు ప్రతాపరావు ఇంటికి వెళ్లే సీన్‌. అది ఆల్రెడీ షూట్‌ చేశాం. అందులో చాలా లౌడ్‌గా డైలాగ్‌ చెప్పారు. మళ్లీ ఇందులోనూ లౌడ్‌గానే  చెప్పారు’ అన్నాను. ‘మీరు చెప్పవలసిన విషయం మా కుర్రవాడు చెబుతున్నారు. కట్‌’ అని మళ్లీ ఆ డైలాగ్‌ను మాడ్యులేషన్‌ మార్చి చెప్పారు. అన ్నగారి పుట్టిన రోజు సందర్భంగా ఆ మహానుభావుణ్ణి తలచుకుంటున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది.


సివిఎల్‌ఎన్‌ ప్రసాద్‌


‘నా దేశం’ షూటింగ్‌ సమయంలోనే పార్టీ కోసం మీటింగ్స్‌లో మాట్లాడి మాట్లాడి గొంతు బొంగురు పోయింది. మాట స్పష్టంగా రావడం లేదు. అది గమనించి బాపయ్య గారు షూటింగ్‌ రెండు మూడు రోజుల తర్వాత పెట్టుకుందామా అన్నారు. ‘అక్కర్లేదు బాపయ్య గారు మేము లిప్‌ ఇస్తాము వారు డైలాగ్‌లు పలుకుతారు’అని నావైపు చూపించారు. నా గుండె ఝల్లుమంది. పాటకు లిప్‌ ఇచ్చినట్లు మాటకు లిప్‌ ఇస్తానంటున్నారు. బాపయ్యగారు అనుమానంగా చూశారు. ‘వారిదీ, మాదీ ఒకటే డిక్షన్‌. నో ప్రాబ్లం.. బ్రదర్‌ కానివ్వండి’ అన్నారు ఎన్టీఆర్‌. తెల్లవార్లూ నేను చదువుతూనే ఉన్నాను. ఆయన డైలాగ్‌కు లిప్‌ ఇస్తూ ఎక్స్‌ప్రెషన్స్‌ ఇస్తూనే ఉన్నారు. డబ్బింగ్‌లో ఎక్కడా  ఇబ్బంది ఎదురుకాలేదు. 

అందుకే... ఆయన కలియుగ దైవం

మరిచిపోలేని పాత్రలు..

తెలుగు చిత్రపరిశ్రమలో ఎన్టీఆర్‌ సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. సాంఘిక, పౌరాణిక, చారిత్రక, జానపద చిత్రాల్లో ఆయన పోషించిన పాత్రలు ఎప్పటికీ మరిచిపోలేనివి. ‘అడవి రాముడు’, ‘యమగోల’, ‘సర్దార్‌ పాపారాయుడు’, ‘వేటగాడు’, ‘జస్టిస్‌ చౌదరి’, ‘బొబ్బిలి పులి’ వంటి సోషల్‌ హిట్స్‌, ‘లవకుశ’, ‘మాయాబజార్‌’, ‘శ్రీకృష్ణపాండవీయం’, ‘దానవీర శూరకర్ణ’ వంటి ఫోక్‌లోర్‌ హిట్స్‌, ‘మహామంత్రి తిమ్మరుసు’, ‘బొబ్బిలి యుద్ధం’ వంటి హిస్టారికల్‌ హిట్స్‌, ‘పాతాళభైరవి’. ‘చిక్కడు దొరకడు’, ‘అగ్గిపిడుగు’ వంటి ఫోక్‌లోర్‌ హిట్స్‌.. ఇలా అన్ని రకాల చిత్రాల్లో నటించి ఎదురులేని కథానాయకుడు అనిపించుకున్నారు ఎన్టీఆర్‌. ఆయన రాముడు వేషం వేశారు, రావణుడిగానూ నటించారు. శ్రీకృష్ణుడి వేషం వేశారు, దుర్యోధనుడిగానూ మెప్పించారు. ‘ప్రతినాయకుడు’ అనే పదం కనిపెట్టింది ఎన్టీఆరే. కాకపోతే పౌరాణిక పాత్రల మీద మక్కువతో ఎన్టీఆర్‌ పురాణాలకు కాస్త పక్కకు వెళ్లారనే విమర్శ కూడా లేకపోలేదు. అయితే, ఆయా పాత్రల మానసిక సంచలనాన్ని ఆవిష్కరించాలంటే ఆ మాత్రం చొరవ తీసుకోక తప్పదని అనేవారు ఎన్టీఆర్‌. 


పారితోషికం ఎంతంటే..

తొలి చిత్రం ‘మనదేశం’లో ఎన్టీఆర్‌ తీసుకున్న పారితోషికం రెండు వందల రూపాయలు. ఆ తర్వాత నటుడిగా డిమాండ్‌ పెరగడంతో పారితోషికం కూడా పెరిగింది. అగ్ర కథానాయకుడిగా ఎదిగినా కూడా 22 ఏళ్ల పాటు ఆయన పారితోషికం వేలల్లోనే ఉండేది. నిర్మాతలకు నిర్మాణ వ్యయం తగ్గించడానికి ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌ పారితోషికాలు పెంచేవారు కాదు. 1972 నుంచి సినిమాకు లక్ష రూపాయలు తీసుకోవడం ప్రారంభించారు ఎన్టీఆర్‌. ‘మేజర్‌ చంద్రకాంత్‌’ చిత్రంలో కోటి  రూపాయల పారితోషికం తీసుకుని అత్యధిక పారితోషికం తీసుకున్న హీరోగా రికార్డ్‌ నెలకొల్పారు. 300 చిత్రాల్లో దాదాపు 700 పాత్రలను పోషించారు ఎన్టీఆర్‌. ఆ పాత్రలన్నీ తనని ప్రజల దగ్గరకు తీసుకెళ్లడంతో  ప్రతి పాత్రా తనకు ప్రత్యేకం అనేవారు ఎన్టీఆర్‌. 


రజనీకాంత్‌ జీవితాన్ని మార్చిన సలహా..

తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌  ఆర్టిస్ట్‌ కావడానికి కారణం ఎన్టీఆరే! ఆయన కండక్టర్‌గా పనిచేసే రోజుల్లో ఒకసారి  పౌరాణిక నాటకం ప్రదర్శించారు. అందులో దుర్యోధనుడి వేషం రజనీది. ఇందుకోసం ఎన్టీఆర్‌ ‘శ్రీకృష్ణ పాండవీయం’ చిత్రం చూసి అందులో ఎన్టీఆర్‌ ఎలా నటించారో తను అలాగే చేయడానికి రజనీ ప్రయత్నించారు. ఆ నాటక ప్రదర్శన విజయవంతం కావడంతో సినిమాల్లో ప్రయత్నించమని అందరూ సలహా ఇచ్చారు. అలా హీరో అయిన రజనీ.. తన అభిమాన నటుడు ఎన్టీఆర్‌తో కలసి ‘టైగర్‌’ అనే చిత్రంలో నటించారు. ఆ సమయంలో ఆయన అటు సినిమాలు, ఇటు తన అలవాట్లు.. రెండింటినీ బ్యాలెన్స్‌ చేయలేక తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురయ్యేవారు. దీని వల్ల ప్రతి ఒక్కరితో తగదాలకు దిగేవారు. ఎన్టీఆర్‌ ఇది గమనించి, ఒక రోజు దగ్గరకు పిలిచి ‘బ్రదర్‌.. తెల్లారి మూడున్నర గంటల నుంచి నాలుగు గంటల మధ్య సమయాన్ని బ్రహ్మకాలం అంటారు. ఆ సమయంలో నువ్వు ప్రాణాయామం చేస్తే పూర్తిగా కోలుకుంటావు’ అని సలహా ఇచ్చారు. కొంతకాలం ఆయన చెప్పినట్లే చేయడంతో రజనీకాంత్‌ మామూలు మనిషి అయ్యారు. హైదరాబాద్‌లో జరిగిన ‘మేజర్‌ చంద్రకాంత్‌’ ఆడియో ఫంక్షన్‌కు హాజరైన రజనీకాంత్‌ ఎన్టీఆర్‌ సమక్షంలో ఈ విషయాన్ని వెల్లడించారు.

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.