ఆ గ్రామాల్లో భోగి మంటలు లేవు

ABN , First Publish Date - 2022-01-14T05:17:01+05:30 IST

భోగ భాగ్యాలనిచ్చే భోగి పండగకు జిల్లాలో కొన్ని గ్రామాలు దూరమయ్యాయి. వివిధ కారణాలతో భోగి మంటలు వేయకూడదని జిల్లాలో సుమారు పది గ్రామాల ప్రజలు కొన్నేళ్ల కిందట తీర్మానించుకున్నారు. గతంలో చోటుచేసుకున్న సంఘటనల దృష్ట్యా.. ఇప్పటికీ చాలామంది పాత ఆచారాలను కొనసాగిస్తూ భోగి వేడుకలు నిర్వహించడం లేదు.

ఆ గ్రామాల్లో భోగి మంటలు లేవు

(రాజాం రూరల్‌/రేగిడి/నరసన్నపేట/గార/జలుమూరు) 

భోగ భాగ్యాలనిచ్చే భోగి పండగకు జిల్లాలో కొన్ని గ్రామాలు దూరమయ్యాయి. వివిధ కారణాలతో భోగి మంటలు వేయకూడదని జిల్లాలో సుమారు పది గ్రామాల ప్రజలు  కొన్నేళ్ల కిందట తీర్మానించుకున్నారు. గతంలో చోటుచేసుకున్న సంఘటనల దృష్ట్యా.. ఇప్పటికీ చాలామంది పాత ఆచారాలను కొనసాగిస్తూ భోగి వేడుకలు నిర్వహించడం లేదు. రాజాం మండలం అంతకాపల్లి గ్రామస్థులు సుమారు వందేళ్లుగా భోగికి దూరంగా ఉంటున్నారు. వందేళ్ల కిందట గ్రామంలో వేసిన భోగీ మంటల్లో ఓ పిల్లి పడి మరణించింది. దీంతో తర్వాతి ఏడాది నుంచి ఆ గ్రామంలో భోగి వేడుకలు నిలిపివేశారు. కానీ భోగి రోజే వాకముళ్ల కుటుంబ సభ్యులు సంక్రాంతి సంబరాలు నిర్వహించడం ఇక్కడ విశిష్టత. ఆచారం ప్రకారం వాకముళ్ల కుటుంబ సభ్యులు దీనిని కొనసాగిస్తున్నారు.  గ్రామంలో ఉన్న 60 కుటుంబాలతో పాటు రాజాం, ఇతర ప్రాంతాల్లో స్థిరపడినవారు సైతం భోగి రోజు అంతకాపల్లి చేరుకుంటారు. బంధుమిత్రులతో సంక్రాంతి సంబరాలు చేసుకుంటారు. 

- రేగిడి మండలంలో ఆడవరం, గోపంపేట, పోరాం గ్రామస్థులు కూడా భోగి పండగకు  దూరంగా ఉంటున్నారు. పూర్వం ఎప్పుడో పిల్లి భోగి మంటల్లో పడి చనిపోవడంతో అప్పటి నుంచి ఈ పండగను ఈ మూడు గ్రామాల్లో నిర్వహించడం లేదు. ఆడవరం, గోపంపేటలో ఈ విశ్వాసం  బలంగా ఉంది. ఆడవరంలో ఆరేడేళ్ల కిందట గ్రామ యువత  ఆచారాన్ని పక్కనపెట్టి భోగి మంట వేయగా... అదేరోజు గ్రామానికి చెందిన ఒక వ్యక్తి మృతిచెందారు. దీంతో పూర్తిగా భోగి మంటను వేయడం మానేశారు. పోరాంలో కూడా ఒకరు భోగి మంటల్లో పడి చనిపోవడంతో తర్వాతి ఏడాది నుంచి ఈ గ్రామంలో కూడా భోగి మంటలు వేయడం నిలిపేశారు.  

- నరసన్నపేట మండలం బసివలస, చింతువానిపేట, కామేశ్వరిపేట, రెడ్డికపేట గ్రామాల్లో కొన్ని తరాల నుంచి భోగి పండగను నిర్వహించడం లేదు. సుమారు 150 ఏళ్ల కిందట ఈ గ్రామాల్లో భోగి పండగ రోజున కొట్లాట జరిగి, కొందరు మృతి చెందారు. దీంతో తర్వాత ఏడాది నుంచి భోగి పండగను జరుపుకోవడం లేదని గ్రామస్థులు చెబుతున్నారు. బసివలస గ్రామంలో సంక్రాంతి రోజు కూడా పెద్దలకు పూజలు చేయరు.  సంక్రాంతికి మందు వచ్చే శనివారం నాడే పెద్దలకు పూజించుకోవడం ఆ గ్రామంలో వస్తున్న సంప్రదాయం. మిగతా గ్రామాల్లో మాత్రం సంక్రాంతి నాడు పెద్దలకు పూజలు చేయరు.

- గార మండలం బూరవిల్లి గ్రామంలో కూడా భోగి మంటలు వేయరు. సంక్రాంతి, కనుమ, ముక్కనుమలను పాటించే ఈ గ్రామస్థులు భోగిమంటకు మాత్రం దూరంగా ఉంటారు. తమ పూర్వీకుల నుంచి గ్రామంలో భోగి మంటను వేయడం లేదని, తాము కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నామని స్థానిక పురోహితులు ఆరవెల్లి సీతారామస్వామి, గ్రామస్థులు ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. 

- జలుమూరు మండలం లింగాలవలస గ్రామస్థులు కూడా భోగి మంటకు దూరంగా ఉంటున్నారు. కొన్నేళ్ల కిందట భోగి మంట వేసిన వ్యక్తిని పులి చంపేసింది. దీంతో అప్పటి నుంచి భోగి మంట వేయరాదని పూర్వీకులు తీర్మానించారు. ఈ మేరకు పూర్వీకుల నిర్ణయానికి కట్టుబడి భోగి వేడుకలకు దూరంగా ఉంటున్నామని సర్పంచ్‌ దుంగ స్వామిబాబు తెలిపారు. 


 సంక్రాంతికి.. ఆ వీధంతా ఖాళీ 

(మెళియాపుట్టి)

సంక్రాంతి వస్తోందంటే చాలు.. దేశ విదేశాల్లో సైతం నివసిస్తున్న వారంతా స్వగ్రామాలకు చేరుకుని కుటుంబ సభ్యులతో సరదాగా పండుగ చేసుకుంటుంటారు. కానీ ఆ గ్రామంలో మాత్రం సంక్రాంతి వచ్చిందంటే ఓ వీధంతా ఖాళీగా కనిపిస్తుంది. అక్కడ గంగిరెద్దుల కులస్థులు నివసించడమే కారణం. వీరంతా పండుగకు నెలరోజుల ముందే ఒక్కో ప్రాంతానికి కుటుంబాలతో వలస వెళ్లి డూడూ బసవన్నలతో సందడి చేస్తారు. ఆ ప్రాంతాల్లో సంచార జీవనం సాగిస్తారు. దీంతో సంక్రాంతి వేళ ఆ వీధంతా బోసిపోతుంది. వివరాల్లోకి వెళితే.. మెళియాపుట్టి మండలం మురిఖిండిభద్రలో ఒక వీధిలో 14 కుటుంబాల గంగిరెద్దుల కులస్థులు 40 ఏళ్లుగా నివసిస్తున్నారు. నెలగంటు పెట్టినప్పటి నుంచీ ఊరూరా డూడూ బసవన్నలు సందడి  చేస్తాయి. నృత్యాలతో కనువిందు చేస్తాయి. ఈ నేపథ్యంలో అక్కడ నివసిస్తున్న గంగిరెద్దుల కులస్థులంతా కుటుంబాలతో వేర్వేరు ప్రాంతాలకు వలస వెళ్లిపోయారు. పండగ నెల రోజులూ గంగిరెద్దుల నృత్యాలతో అలరిస్తుంటారు. భిక్షాటన చేస్తూ సంచార జీవనం సాగిస్తున్నారు. దీంతో సంక్రాంతి వేళ మురిఖిండిభద్రలో వారు నివసించే వీధంతా ఖాళీగా దర్శనమిస్తోంది. ఇదిలా ఉండగా, ప్రస్తుతం ఆదరణ కరువైనా.. చాలా మంది గంగిరెద్దుల వారు తమ ఆచారాన్ని కొనసాగిస్తున్నారు. కరోనా ప్రభావంతో రెండేళ్లుగా మరింత ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. గతంలో కొంతమంది దేవుడికి మొక్కుబడి చేసి ఎద్దులు ఉచితంగా ఇచ్చేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. గంగిరెద్దులు అధిక ధరకు కొనుగోలు చేయాల్సి వస్తోంది. వాటితో ఊరూరా తిరిగినా.. తమకు పూట గడవడం లేదని పలువురు వాపోతున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని బాడ వెంకటరావు, బి.అప్పయ్య, బి.భాస్కరరావులు కోరుతున్నారు. 

Updated Date - 2022-01-14T05:17:01+05:30 IST