అభినందన్ విషయంలో మాపై ఒత్తిడి లేదు : పాకిస్తాన్

ABN , First Publish Date - 2020-10-30T15:42:06+05:30 IST

కొద్ది గంటల్లోనే పాకిస్తాన్ నాలుకను మడతేసేసింది. అభినందన్ వర్ధమాన్ ను విడుదల చేసే విషయంలో తమపై ఎలాంటి ఒత్తిడీ లేదని ప్రకటించింది.

అభినందన్ విషయంలో మాపై ఒత్తిడి లేదు : పాకిస్తాన్

ఇస్లామాబాద్: కొద్ది గంటల్లోనే పాకిస్తాన్ నాలుకను మడతేసేసింది. అభినందన్ వర్ధమాన్ ను విడుదల చేసే విషయంలో తమపై ఎలాంటి ఒత్తిడీ లేదని ప్రకటించింది. వర్ధమాన్ విషయంలో ఆర్మీ చీఫ్ బాజ్వా కాళ్లలో వణుకు పుట్టిందని, ఆయనకు ముచ్చెమటలు పట్టాయని పీఎంఎల్ (నవాజ్) నేత అయాజ్ సాదిక్ వెల్లడించిన కొద్ది గంటలకే పాక్ ఈ ప్రకటన చేసింది. పాక్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జహీద్ హఫీజ్ చౌధురి మాట్లాడుతూ... ‘‘వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ విడుదల విషయంలో పాక్ పై ఎలాంటి ఒత్తిడీ లేదు. శాంతిని దృష్టిలో పెట్టుకునే మేం వర్ధమాన్ ను విడిచిపెట్టాం. మేము తీసుకున్న ఈ నిర్ణయాన్ని అంతర్జాతీయ సమాజం హర్షించింది. మాపై ఎలాంటి ఒత్తిడులూ లేవు.’’ అని జహీద్ హఫీజ్ ప్రకటించారు. 

ఆర్మీ చీఫ్ కాళ్లలో వణుకు... ముచ్చెమటలు...

అభినందన్ వర్ధమాన్ అప్పగింతకు కారణం మానవతా దృక్పథం కాదని, భారత్‌ దాడిచేస్తుందన్న భయమేనని పాకిస్థాన్‌ జాతీయ అసెంబ్లీ (పార్లమెంట్‌) మాజీ స్పీకరు, పీఎంఎల్‌(నవాజ్‌) నేత సర్దార్‌ అయాజ్‌ సాదిక్‌ తాజాగా బైటపెట్టారు. ఈ విషయాన్ని ఆయన బుధవారం పార్లమెంట్‌లోనే చెప్పారు.  ‘‘ఫిబ్రవరి 28న ఓ ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. దానికి ఇమ్రాన్‌ఖాన్‌ గైర్హాజరయ్యారు. ఆ సమావేశంలోనే ఆర్మీ ఛీఫ్‌ జనరల్‌ కమర్‌ జావేద్‌ బజ్వాతో సీనియర్‌ ప్రతిపక్ష నేతలు, కీలక మంత్రులు కూడా పాల్గొన్నారు.  బజ్వా కాళ్లలో వణుకు.. ఆయన నుదట ముచ్చెమటలు పోస్తున్నాయి. అభినందన్‌ను వెన్వెంటనే అప్పగించేద్దాం.. లేదంటే భారత్‌ ఈ రాత్రి 9 గంటలకు దాడి చేయబోతోంది’ అని విదేశాంగమంత్రి షా మొహమ్మద్‌ ఖురేషీ చెప్పారు. అందరిలోనూ చాలా టెన్షన్‌! బాలాకోట్‌ తరహాలోనే భారత్‌ గనక పూర్తిస్థాయి బాంబింగ్‌కు దిగితే పరిస్థితేంటన్న చర్చ సాగింది’’ అని సాదిక్‌ పేర్కొన్నారు.

Updated Date - 2020-10-30T15:42:06+05:30 IST