ధోనిలో.. ఆ మ్యాచ్ గెలవాలనే పట్టుదల లేదు: ఇంగ్లండ్ ఆల్‌రౌండర్

ABN , First Publish Date - 2020-05-28T04:39:01+05:30 IST

నాలుగేళ్లకోసారి జరిగే ప్రపంచకప్ క్రికెట్ టోర్నీలో ప్రతిజట్టూ విజేతగానే నిలవాలని అనుకుంటుంది.

ధోనిలో.. ఆ మ్యాచ్ గెలవాలనే పట్టుదల లేదు: ఇంగ్లండ్ ఆల్‌రౌండర్

లండన్: నాలుగేళ్లకోసారి జరిగే ప్రపంచకప్ క్రికెట్ టోర్నీలో ప్రతిజట్టూ విజేతగానే నిలవాలని అనుకుంటుంది. పాయింట్ల పట్టికతో సంబంధం లేకుండా అన్ని మ్యాచులూ గెలవడానికే ప్రయత్నిస్తుంది. అయితే 2019 ప్రపంచకప్‌లో ఇండియా-ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ అలా జరగలేదని ఇంగ్లర్ స్టార్ ఆల్‌రౌండర్ బెన్‌స్టోక్స్ పేర్కొన్నాడు. త్వరలోనే విడుదల కాబోతున్న అతని పుస్తకం ‘ద ఫైర్‌’లో ఈ విషయాన్ని స్టోక్స్ ప్రస్తావించాడు. ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 337 పరుగులు చేసింది. మంచి ఫామ్‌‌లో ఉన్న టీమిండియా ఆ లక్ష్యాన్ని సులభంగా ఛేదిస్తుందని అందరూ భావించారు. అయితే అలా జరగలేదు. టీమిండియా ఓడిపోయింది. ఈ మ్యాచ్ గురించి తన పుస్తకంలో రాసిన స్టోక్స్.. ‘ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్ సమయంలో ధోనీ, అతని పార్టనర్ కేదార్ జాదవ్ ఆటతీరు నన్ను ఆశ్చర్యపరిచింది. 11 ఓవర్లలో 112 పరుగులు అవసరమైతే వాళ్లిద్దరూ ఎక్కువగా సింగిల్స్ తీయడానికే ఇష్టపడ్డారు’ అని స్టోక్స్ వెల్లడించాడు. ఎప్పుడు బ్యాటింగ్ చేసినా అవసరమైన రన్‌రేట్ పెరగకుండా జాగ్రతపడుతూ.. చివరి వరకూ మ్యాచ్ గెలవడానికే ధోనీ ప్రయత్నిస్తాడని, కానీ ఆ మ్యాచ్‌లో అతను అలా ఆడినట్లు తను భావించడంలేదని పుస్తకంలో రాసుకున్నాడు.


అలాగే వారికన్నా ముందు బ్యాటింగ్ చేసిన కోహ్లీ-రోహిత్ జోడీ నెలకొల్పిన 138 పరుగుల భాగస్వామ్యంపై కూడా విమర్శనాత్మక వ్యాఖ్యలు చేశాడు. ‘కోహ్లీ-రోహిత్ ఆటతీరు కూడా అద్భుతంగా లేదు. వాళ్లు మా బౌలర్లపై ఎటువంటి ఒత్తిడీ తీసుకురాలేదు. 27 ఓవర్లు బ్యాటింగ్ చేసి 138 పరుగులు మాత్రమే చేశారు’ అని స్టోక్స్ అభిప్రాయపడ్డాడు. తాము ఆ మ్యాచ్ గెలవడం సంతోషకరమే అయినా, భారత్ నుంచి గెలవాలనే పట్టుదల తనకు కనిపించలేదని పేర్కొన్నాడు.


ముఖ్యంగా ప్రపంచ అత్యుత్తమ ఫినిషర్లలో ఒకడైన ధోనీ ఆటతీరు తనకు అసలు అంతుచిక్కలేదన్నాడు. ధోనీ గనుక బ్యాట్ ఝుళిపించి ఉంటే మరో డజను బంతులు మిగిలుండగానే భారత్ విజయం సాధించేదని స్పష్టంచేశాడు. జాదవ్‌లోగానీ, ధోనీలోగానీ గెలవాలనే తపన కనిపించలేదని తన పుస్తకంలో తెలియజేశాడు.

Updated Date - 2020-05-28T04:39:01+05:30 IST