దేశంలో రెండు రకాల రాజకీయాలున్నాయి : మోదీ

ABN , First Publish Date - 2022-04-06T17:56:50+05:30 IST

దేశంలో రెండు రకాల రాజకీయాలు ఉన్నాయని ప్రధాన

దేశంలో రెండు రకాల రాజకీయాలున్నాయి : మోదీ

న్యూఢిల్లీ : దేశంలో రెండు రకాల రాజకీయాలు ఉన్నాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. బీజేపీ 42వ వ్యవస్థాపక దినోత్సవాల సందర్భంగా బుధవారం ఆయన వర్చువల్ విధానంలో మాట్లాడుతూ, కుటుంబ భక్తి రాజకీయాలు, దేశ భక్తి రాజకీయాలు మన దేశంలో ఉన్నాయని చెప్పారు. నాలుగు రాష్ట్రాల్లో అధికారాన్ని నిలుపుకోవడంతోపాటు రాజ్యసభలో బీజేపీ ఎంపీల సంఖ్య 100కు చేరిందని, ఈ తరుణంలో ఈ వేడుకలను జరుపుకుంటున్నామని చెప్పారు. 


బీజేపీ 42వ వ్యవస్థాపక దినోత్సవాల సందర్భంగా నేడు మనం జన సంఘ్ శకాన్ని గుర్తు చేసుకోవాలన్నారు. ఆ రోజుల్లో నూనె దీపాలను పట్టుకుని నడిచినవారిని, ఆ తర్వాత కమలంతో నడుస్తున్నవారిని  గుర్తు చేసుకోవాలన్నారు. పార్టీని వైభవోపేతంగా తీర్చిదిద్దడం కోసం మూడు, నాలుగు తరాలవారు తమ జీవితాలను అంకితం చేశారని చెప్పారు. 


ఏ పార్టీ ప్రభుత్వమైనా దేశం కోసం ఏదీ చేయరనే భావన ప్రజల్లో ఉండేదన్నారు. గతంలో ఈ నైరాశ్యం ఉండేదని చెప్పారు. నేడు దేశం మారుతోందని, వేగంగా ముందుకు వెళ్తోందని ప్రతి పౌరుడు గర్వంగా చెబుతారన్నారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో భారత దేశ వైఖరిని ప్రస్తావిస్తూ, నేడు భారత దేశం ప్రపంచం ముందు దృఢంగా నిలిచిందన్నారు. ఎటువంటి భయం, ఒత్తిడి లేకుండా తన ప్రయోజనాల కోసం భారత దేశం దృఢ వైఖరిని ప్రదర్శిస్తోందని చెప్పారు. ఉక్రెయిన్‌పై యుద్ధం నేపథ్యంలో కొందరు విదేశీ నేతలు న్యూఢిల్లీలో పర్యటించి, భారత దేశం జోక్యాన్ని కోరిన సంగతి తెలిసిందే. 


యావత్తు ప్రపంచం రెండు శత్రు వర్గాలుగా విడిపోయిన నేపథ్యంలో ప్రపంచం దృష్టిలో భారత దేశం మానవత్వం గురించి దృఢంగా మాట్లాడగలిగే దేశంగా ఉందని మోదీ చెప్పారు. 


న్యూఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో జరుగుతున్న వ్యవస్థాపక దినోత్సవాలకు వివిధ దేశాల దౌత్యవేత్తలను కూడా బీజేపీ ఆహ్వానించింది. దేశవ్యాప్తంగా రక్తదాన శిబిరాలను నిర్వహించింది. 


Updated Date - 2022-04-06T17:56:50+05:30 IST