రాత పరీక్షలో ప్రతిభకే ఉద్యోగమన్నారు

ABN , First Publish Date - 2022-01-28T05:45:33+05:30 IST

ఏడీసీసీ బ్యాంకులో పోస్టు భర్తీకి జిల్లా వ్యాప్తంగా ఈనెల 8వ తేదీన 100 మార్కులకు ఆనలైనలో పరీక్ష నిర్వహించారు.

రాత పరీక్షలో ప్రతిభకే ఉద్యోగమన్నారు
పోటీ పరీక్షకు హాజరైన అభ్యర్థులు (ఫైల్‌)

ఏదో ఉంది!

ఇప్పుడు ఇంటర్వ్యూ కూడా అంటున్నారు

నోటిఫికేషనకు భిన్నంగా భర్తీ ప్రక్రియ

ఏడీసీసీబీలో నియామకాలపై అనుమానాలు

కోర్టుకు వెళ్లే ఆలోచనలో అభ్యర్థులు


ఉద్యోగాల భర్తీ సమయంలో నోటిఫికేషన విడుదల చేస్తారు. అందులో నియమ నిబంధనలు పొందుపరుస్తారు. నియామక ప్రక్రియను వాటికి లోబడే చేయాలి. అభ్యర్థులు కూడా అందుకు అనుగుణంగానే పోటీకి సిద్ధమవుతారు. ఇది సహజం. కానీ ఏడీసీసీ బ్యాంకు వారు సొంత పంథాను ఎంచుకున్నారని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. ఏదో గూడుపుఠాణీ చేస్తున్నారని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రాత పరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తామని చెప్పి, అది పూర్తయ్యాక ఇప్పుడు ‘ఇంటర్వ్యూ కూడా’ అనడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. నోటిఫికేషనకు విరుద్ధంగా వ్యవహరిస్తే కోర్టుకు వెళతామని హెచ్చరిస్తున్నారు.


అనంతపురం క్లాక్‌టవర్‌, జనవరి 27: ఏడీసీసీ బ్యాంకులో పోస్టు భర్తీకి జిల్లా వ్యాప్తంగా ఈనెల 8వ తేదీన 100 మార్కులకు ఆనలైనలో పరీక్ష నిర్వహించారు. మొత్తం 20 అసిస్టెంట్‌ మేనేజర్లు, 66 స్టాఫ్‌ అసిస్టెంట్ల పోస్టులకు పరీక్ష నిర్వహించారు. జిల్లాలోని హిందూపురం బాలయేసు, పుట్టపర్తి సంస్కృతి ఇంజనీరింగ్‌ కాలేజీ, తాడిపత్రి సీవీఆర్‌ కాలేజీ, గుత్తి గేట్స్‌ కాలేజీ, ఎస్‌ఆర్‌ఐటీ, పీవీకేకే, అనంతలక్ష్మి ఇంజనీరింగ్‌, ఎస్‌వీఐటీ ఇంజనీరింగ్‌ కాలేజీ కేంద్రాలలో పరీక్ష నిర్వహించారు. 3,840మంది దరఖాస్తు చేయగా, 3,120మంది పరీక్షకు హాజరయ్యారు.  వీరికి నాలుగు బ్యాచలుగా పరీక్ష నిర్వహించారు. 


ఇంటర్వ్యూలు అందుకేనా..?

నోటిఫికేషనలో పేర్కొన్నవిధంగా కాకుండా ఇంటర్వ్యూలు ఉంటాయని ఏడీసీసీ బ్యాంకు యాజమాన్యం ప్రకటిం చడం తీవ్ర దుమారం రేపుతోంది. కష్టపడి చదివి పరీక్ష రాసి ప్రతిభ చూపితే దానితో సంబంధం లేకుండా రూ.లక్షలు చెల్లిస్తేనే ఇంటర్వ్యూలో 15 మార్కులు కలిపేలా రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఏ నియామక ప్రక్రియ అయినా ఎటువంటి దాపరికాలు లేకుండా నోటిఫికేషన సమయంలోనే పూర్తి వివరాలు ప్రకటించాలి. కానీ అందుకు విరుద్ధంగా ఏడీసీసీ బ్యాంకులో పోస్టుల భర్తీ చేపడుతున్నారు. ఇప్పటికే ఏడీసీసీ బ్యాంకులో కీలక అధికారి  వసూళ్లలో కీలకంగా వ్యవహరిస్తున్నారనే చర్చ ఆ బ్యాంకులోని ఉద్యోగుల మధ్యే సాగుతోంది.  


ఆప్కాబ్‌ అనుమతి లేకుండానే... 

ఏడీసీసీ బ్యాంకుకు నాబార్డు, ఆప్కాబ్‌ల నుంచే నిధులు, విధులు వస్తాయి. పారదర్శకంగా ఉద్యోగాల భర్తీ చే పట్టాలనే ఉద్దేశ్యంతోనే ఆప్కాబ్‌ ఇంటర్వ్యూలు లేకుండా  రాతపరీక్షలో ప్రతిభ కనబరిచిన అభ్యర్థులకు అవకాశం కల్పించాలని తీర్మానించారు. అయితే ఆప్కాబ్‌, నాబార్డు అనుమతి లేకుండా ఏడీసీసీ బ్యాంకు యాజమాన్యం ఉద్యోగాల భర్తీకి రాత పరీక్షతో పాటు ఇంటర్వ్యూలు నిర్వ హించాలని భావించటంపై అనేక ఆరోపణలు వినిపిస్తు న్నాయి. ముడుపులు కోసమే ఇంటర్వ్యూ ప్రక్రియను తీసుకువచ్చారనే విమర్శలు వినిపిస్తున్నాయి. 


తొలినుంచి గందరగోళమే...

 ఏడీసీసీ బ్యాంకు ఉద్యోగాల భర్తీకి సంబంధించి  నోటిఫికేషన నుంచి రాత పరీక్ష వరకు అన్ని రహస్యంగానే ఉంచుతూ వచ్చారు. అభ్యర్థుల సందేహాలను ఆనలైనలో మాత్రమే చూసుకోవాలని, ఏడీసీసీ బ్యాంకు అధికారులు, ఐబీపీఎస్‌ నిర్వాహకులు ఎటువంటి ప్రకటన ఇవ్వలేదు. తొలి నుంచి అనేక అనుమానాల నడుమ జరిగిన ఏడీసీసీ బ్యాంకు ఉద్యోగాల భర్తీపై అభ్యర్థులు ఆందోళన చెందుతు న్నారు. అభ్యర్థులకు తలెత్తే అనుమానాలు, సందేహాలను నివృత్తి చేయడంలోనూ ఏడీసీసీ బ్యాంకు, ఐబీపీఎస్‌ అధి కారులు సమన్వయలోపంతో ఒకరిపై ఒకరు నెట్టుకుంటూ వచ్చారు.  


కోర్టుకు వెళ్లే యోచన.. 

ఐబీపీఎస్‌ సహకారంతో నిర్వహించిన ఏడీసీసీ బ్యాంకు ఉద్యోగాల భర్తీ పరీక్ష మొదటి నుంచి గందరగోళంగానే ఉంది. నోటిఫికేషన సమయంలో ఇంటర్వ్యూ లేదని స్పష్టంగా బ్యాంకు ఉన్నతాధికారులే ప్రకటించారు. అయితే పరీక్ష అనంతరం ఇంటర్వ్యూలు నిర్వహించాలని నిర్ణయించినట్లు చెబుతున్నారు. దీంతో నిరుద్యోగ అభ్యర్థులు న్యాయస్థానాన్ని ఆశ్రయించే యోచనలో ఉన్నట్లు స మాచారం.



బాధితుల పక్షాన కోర్టుకెళ్తాం...

ఏడీసీసీ బ్యాంకులో ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించడంపై బాధిత నిరుద్యోగ అభ్యర్థుల పక్షాన కోర్టుకు వెళ్లేందుకు వెనుకాడబోం. నోటిఫికేషనకు ముందు ఒక మాట, రాత పరీక్ష తరువాత మరో మాట మార్చడం నిరుద్యోగులకు ద్రోహం చేయడమే. ఏడీసీసీ బ్యాంకు యాజమాన్యం, ఐబీపీఎస్‌ అధికారులు వెంటనే స్పందించి రాత పరీక్షలో ప్రతిభ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయాలి.  

- మనోహర్‌, ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు



నోటిఫికేషన ప్రకారం భర్తీ చేయాలి..

ఏడీసీసీ బ్యాంకులో ఉద్యోగాలను తొలుత ఇ చ్చిన నోటిఫికేషన ప్రకారం భర్తీ చేయాలి. అందు కు భిన్నంగా స్వార్థ ప్రయోజనాలు, జేబులు నింపు కోవడానికి రాత పరీక్ష అనంతరం ఇంటర్వ్యూలు నిర్వహిస్తామని చెప్పడం మంచిదికాదు. ఇది నిరుద్యోగ యువ తీయువకుల జీవితాలతో చెలగాటమాడటమే. వెంటనే ఇంటర్వ్యూ లేకుండా పరీక్షలో అభ్యర్థుల ప్రతిభ ఆధారంగా ఉద్యోగాలు భర్తీ చేయాలి.  

- పాపిరెడ్డిపల్లి ఫృథ్వీ, ఏఐఎస్‌బీ జిల్లా ప్రధాన కార్యదర్శి


సందేహాలు అవసరం లేదు

ఇంటర్వ్యూలపై ఎవరికీ ఎటువంటి అనుమానం అవసరం లేదు. ఏడీసీసీ బ్యాంకు ఉద్యోగాల భర్తీకి రాత పరీక్షతో పాటు ఇంటర్వ్యూ ఉంటుంది. బ్యాంకు, ఆప్కాబ్‌ ద్వారా ఇచ్చిన నోటిఫికేషనలో ఆనలైన పరీక్ష వివరాలను మాత్రమే పొందుపరిచాం. ఐబీపీఎస్‌ ఇచ్చిన నోటిఫికేషనలో ఇంటర్వ్యూ గురించి స్పష్టంగా ఇచ్చారు. మా బ్యాంకు పాలకవర్గ సభ్యులకు అప్పటి సమాచారం లేదు. అందుకే ఇంటర్వ్యూల గురించి పూర్తి స్పష్టంగా చెప్పలేకపోయారు. ఆనలైన పరీక్షలో, ఇంటర్వ్యూలలో మాది, మా పాలక వర్గసభ్యులది నామమాత్రపు పాత్రే. ప్రక్రియ మొత్తం ఐబీపీఎస్‌ ద్వారానే జరుగుతుంది. మాకు కూడా పూర్తి వివరాలు ఇవ్వలేదు. ఐబీపీఎస్‌ ద్వారా ఆనలైన పరీక్ష, ఇంటర్వ్యూ  మొత్తం ప్రక్రియ పారదర్శకంగా చేపడుతున్నారు. 

- ఏబీ రాంప్రసాద్‌,  సీఈఓ, ఏడీసీసీ బ్యాంకు

Updated Date - 2022-01-28T05:45:33+05:30 IST