పనీ లేదు.. మనీ లేదు

ABN , First Publish Date - 2020-03-30T10:28:47+05:30 IST

కరోనా నేపథ్యంలో..

పనీ లేదు.. మనీ లేదు

ఉపాధి లేక సామాన్యుల ఇక్కట్లు

రుణాలపై పెరుగుతున్న వడ్డీ భారం 

రుణదాతల నుంచి వేధింపులు

చెల్లించాలంటూ ఫోన్‌లోనే ఒత్తిడి

కరోనాతో సంబంధం లేదంటున్న వైనం


(శ్రీకాకుళం, ఆంధ్రజ్యోతి): కరోనా నేపథ్యంలో పనులు లేక అన్ని వర్గాలు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నాయి. మరోవైపు ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌తో ఇళ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో కూలి పనులు లేక  చేతివృత్తిదారులు... చిన్న చిన్న షాపులు, పరిశ్రమల్లో పనిచేసే కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నాయి. ఇప్పటికే ఆదాయంలేని వీరిపై వడ్డీ వ్యాపారుల నుంచి వేధింపులు ఎక్కువవుతున్నాయి. దీంతో ఏం చేయాలో తెలియక పలు కుటుంబాలు సతమతమవుతున్నాయి. 


కరోనా కట్టడిలో భాగంగా ప్రభుత్వం లాక్‌డౌన్‌ ప్రకటించింది. దీంతో పనులు లేక సామాన్య, మధ్య తరగతి కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నాయి. రాష్ట్రంలో ప్రజల తలసరి ఆదాయం తక్కువగా ఉన్నజిల్లా కేవలం శ్రీకాకుళం మాత్రమే.  జిల్లా వ్యాప్తంగా అత్యధికమంది కూలి పనులపైనే ఆధారపడుతుంటారు. ఇక్కడి వారు కుటుంబాలతో సహా దేశం నలుమూలలకు వెళ్లి అక్కడ భవన నిర్మాణాలు, ఇతర పనులతో ఉపాధి పొందుతున్నారు. వీరంతా కరోనా ప్రభావంతో పనులు కోల్పోయి వీధినపడ్డారు. కరోనా వ్యాపించకుండా లాక్‌డౌన్‌లో జిల్లావాసులు సంపూర్ణంగా భాగస్వాములవుతున్నారు. రెక్కాడితే కానీ, డొక్కాడని ప్రజల జీవనంపై ఈ ప్రభావం తీవ్రంగా ఉంటోంది. ప్రజలంతా ఇళ్లకే పరిమితమవుతున్నారు.


జిల్లాలో అసలే అరకొర ఉపాధి. దీనికితోడు ఇప్పుడు లాక్‌డౌన్‌ నేపథ్యంలో పూర్తిగా పనులు లేక ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గతంలో వడ్డీ వ్యాపారులు, ఫైనాన్స్‌ వ్యాపారుల నుంచి కొందరు నగదు అప్పుగా తీసుకున్నారు. చిరు వ్యాపారులు రూ.వెయ్యి అప్పుగా తీసుకుంటే.. రోజుకి రూ.10, రూ.10వేలు తీసుకుంటే రూ.100 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. గరిష్ఠంగా వంద రోజుల్లో అప్పును తీర్చాల్సి ఉంటుంది. ఈ విధంగా వడ్డీ లెక్కేస్తే రూ.100కు నెలకు రూ.10 కంటే ఎక్కువగానే పడుతోంది.


అయినా, రోజువారీ వ్యాపారంలో సులభంగా తీరిపోతుందిలే అని భావించి అప్పులు చేసినవారు అత్యధికమంది జిల్లావ్యాప్తంగా ఉన్నారు. ఇటువంటి వారు ఇప్పుడు అప్పులు చెల్లించుకోలేక.. ఇల్లు గడవడానికి అప్పులు తేలేక తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. శ్రీకాకుళం నగరంలో వేలాదిమంది  ఇలా అప్పులు చేశారు. తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల నుంచి వచ్చిన వారపు వడ్డీ వ్యాపారులు జిల్లాలోని అత్యధిక మందికి అప్పులు ఇచ్చారు. ఇందుకుగాను ఖాళీ ప్రామిసరీనోట్ల మీద సంతకా లు తీసుకున్నారు.


ఇటువంటివి జిల్లాలో నిత్యకృత్యంగా మారాయి. ఇప్పుడు పనులు లేక సామాన్య, మధ్యతరగతి కుటుంబాలు రోజువారీ వడ్డీలు చెల్లించలేకపోతున్నాయి. కరోనాతో సంబంధం లేదని, రోజువారీ వడ్డీ  చెల్లించాల్సిందేనంటూ వ్యాపారులు వారిపై ఒత్తిడి తెస్తున్నారు. ఫోన్‌ చేసి మరీ డిమాండ్‌ చేస్తుండడంతో అప్పులు చేసినవారంతా అయోమయం చెందుతున్నారు. పనులు, వ్యాపారాలు లేక సతమతమవుతున్న తమపై వడ్డీవ్యాపారులు ఒత్తిడి తేవడం సరికాదని వాపోతున్నారు. ఈ నేపథ్యంలో చిరువ్యాపారులు, వారపువడ్డీకి నగదు వాడుకున్న సామాన్యులు సైతం నేరుగా కలెక్టర్‌, ఎస్పీని కలిసి తమ గోడును  తెలియజేయడానికి సన్నద్ధమవుతున్నారు. 


Updated Date - 2020-03-30T10:28:47+05:30 IST