ఆక్సిజన్‌ కొరత రానీయొద్దు

ABN , First Publish Date - 2021-05-11T05:09:15+05:30 IST

ప్రజల ప్రాణాలు కాపాడటమే మనందరి లక్ష్యమని, ఆక్సిజన్‌ కొరత రానీయొద్దని, కొవిడ్‌ బాధితులపై మరింత శ్రద్ధ చూపాలని మంత్రి బొత్స సత్యనారాయణ, జిల్లా ఇన్‌చార్జి మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఆదేశించారు. జిల్లాలో కొవిడ్‌ నియంత్రణకు తీసుకుంటున్న చర్యలు, అందిస్తున్న వైద్యంపై జిల్లా అధికారులతో సోమవారం సాయంత్రం జూమ్‌ కాన్ఫరెన్స్‌ ద్వారా వారు సమీక్ష నిర్వహించారు.

ఆక్సిజన్‌ కొరత రానీయొద్దు
మాట్లాడుతున్న మంత్రులు బొత్స, వెల్లంపల్లి

ప్రజల ప్రాణాలు కాపాడాలి

కొవిడ్‌ ఆసుపత్రులపై పర్యవేక్షణ పెరగాలి

 అందుబాటులో రెమిడెసివర్‌ 

కరోనాపై సమీక్షలో మంత్రులు బొత్స, వెల్లంపల్లి 

కలెక్టరేట్‌, మే 10:

ప్రజల ప్రాణాలు కాపాడటమే మనందరి లక్ష్యమని, ఆక్సిజన్‌ కొరత రానీయొద్దని, కొవిడ్‌ బాధితులపై మరింత శ్రద్ధ చూపాలని మంత్రి బొత్స సత్యనారాయణ, జిల్లా ఇన్‌చార్జి మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఆదేశించారు. జిల్లాలో కొవిడ్‌ నియంత్రణకు తీసుకుంటున్న చర్యలు, అందిస్తున్న వైద్యంపై జిల్లా అధికారులతో సోమవారం సాయంత్రం జూమ్‌ కాన్ఫరెన్స్‌ ద్వారా వారు సమీక్ష నిర్వహించారు. తొలుత కలెక్టర్‌ హరిజవహర్‌లాల్‌ మాట్లాడుతూ కొవిడ్‌ మొదటి దశతో పోలిస్తే ప్రసుత్తం ఇన్‌ఫెక్షన్‌ రేటు ఎక్కువగా ఉందని, రికవరీ రేటు కాస్త తగ్గిందని చెప్పారు. జిల్లాలో 28 ఆసుపత్రుల్లో కొవిడ్‌ చికిత్స అందిస్తున్నామని వివరించారు. ఏడు కేర్‌ సెంటర్ల ద్వారా మూడు వేల పడకలు సిద్ధం చేశామన్నారు. బొబ్బిలిలో కొవిడ్‌ పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి ప్రతిపాదన పెట్టినట్లు చెప్పారు. జేసీ మహేష్‌కుమార్‌ మాట్లాడుతూ జిల్లాలో ఆక్సిజన్‌ కొరత లేదని, రెండు మూడు రోజులకు ఒకసారి జిల్లా కేంద్ర ఆసుపత్రికి 10 కిలోలీటర్ల ట్యాంకు అందుబాటులోకి వస్తోందని వివరించారు. అనంతరం ఇన్‌చార్జి మంత్రి మాట్లాడుతూ జిల్లా అధికారులంతా సమష్టి కృషితో పనిచేస్తున్నారని, చిన్నచిన్న లోపాలను సరిదిద్ది మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ప్రభుత్వ స్థాయిలో చేయాల్సిన వాటిని తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కరించడానికి కృషి చేస్తామన్నారు. మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ రాత్రి సమయంలో పర్యవేక్షణ మరింత పెంచాలని ఆదేశించారు. ఎట్టి పరిస్థితిలోనూ వైద్యంలో లోపం ఉండకూడదని చెప్పారు. ప్రతి రెండు గంటలకు ఒకసారి బాధితుడి ఆరోగ్య పరిస్థితిని నమోదు చేయాలన్నారు. అవసరమైతే ట్రైనీ నర్సులను విధుల్లోకి తీసుకోవాలని సూచించారు. ఆక్సిజన్‌ కొరత రాకుండా చూడాలని చెప్పారు. రాష్ట్రంలో రెమిడెసివిర్‌ కొరత లేదని, బ్లాక్‌ మార్కెట్‌ను పూర్తిగా నిరోధించామని చెప్పారు. అంతకుముందు 

పర్యవేక్షణ పెరగాలి

జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు.. మంత్రుల దృష్టికి  వివిధ సమస్యలను తీసుకువెళ్లారు. బాధితులపై పర్యవేక్షణ పెంచడం వల్ల మరణాల రేటు తగ్గించవచ్చని ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌ సూచించారు. బొబ్బిలి ఎంఎల్‌ఏ శంబంగి చినఅప్పలనాయుడు మాట్లాడుతూ బొబ్బిలి ఆసుపత్రి పరిధిలో పది బెడ్లు ఉన్నాయని, వాటిలో కేవలం నాలుగింటికే ఆక్సిజన్‌ సదుపాయం ఉందని, మిగిలిన వాటికి కూడా సదుపాయం కల్పించాలని కోరారు. పార్వతీపురం ఎంఎల్‌ఏ జోగారావు మాట్లాడుతూ ఏరియా ఆసుపత్రిలో 41 బెడ్లకు మాత్రమే ఆక్సిజన్‌ సదుపాయం ఉందని, పూర్తిస్థాయిలో 100 పడకలకు కూడా సదుపాయం కల్పించాలని కోరారు. గజపతినగరం శాసన సభ్యులు అప్పలనర్సయ్య మాట్లాడుతూ వ్యాక్సినేషన్‌ కేంద్రాలు మండలానికి రెండు చొప్పున ఏర్పాటు చేయాలన్నారు. ఎంఎల్‌సి సురేష్‌బాబు మాట్లాడుతూ రాత్రి సమయంలో కొవిడ్‌ బాధితులను పట్టించుకోవడం లేదన్నారు. సమావేశంలో కొవిడ్‌ ప్రత్యేకాధికారి సత్యనారాయణ, అరుకు ఎంపీ జి.మాధవి, ఎస్‌.కోట ఎంఎల్‌ఏ కె.శ్రీనివాసరావు, జేసీ జె.వెంకటరావు, సబ్‌ కలెక్టరు విదేహ్‌ఖరే, ఐటీడీఏ పీవో కూర్మనాథ్‌, ఏఎస్‌పీ సత్యనారాయణ, జిల్లా వైద్యాధికారి రమణకుమారి, తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-05-11T05:09:15+05:30 IST