దేశంలో ఋతుప్రేమ ఎక్కడా లేదు.. మన జిల్లాలోనే షురూ

ABN , First Publish Date - 2022-06-30T05:29:28+05:30 IST

ఋతుప్రేమ దేశంలో ఎక్కడా లేదని, మహిళల ఆరోగ్యం కోసం మంత్రి హరీశ్‌రావు తీసుకొచ్చిన గొప్ప కార్యక్రమం మనజిల్లాలోనే ప్రారంభమైందని జడ్పీ చైర్‌పర్సన్‌ రోజాశర్మ అన్నారు.

దేశంలో ఋతుప్రేమ ఎక్కడా లేదు.. మన జిల్లాలోనే షురూ
సిద్దిపేటలో మెనుస్ట్రువల్‌ కప్‌ను చూపిస్తున్న జడ్పీ చైర్‌పర్సన్‌ రోజాశర్మ, అదనపు కలెక్టర్‌ ముజామిల్‌ఖాన్‌, అంగన్‌వాడీ టీచర్లు

ఆరోగ్య, స్వచ్ఛ్‌ సిద్దిపేట జిల్లాగా మారుద్దాం

ప్యాడ్స్‌ రహిత జిల్లాగా మారేందుకు మీ వంతు కృషిచేయాలి

జడ్పీ చైర్‌పర్సన్‌ రోజాశర్మ

సిద్దిపేట అగ్రికల్చర్‌, జూన్‌ 29: ఋతుప్రేమ దేశంలో ఎక్కడా లేదని, మహిళల ఆరోగ్యం కోసం మంత్రి హరీశ్‌రావు తీసుకొచ్చిన గొప్ప కార్యక్రమం మనజిల్లాలోనే ప్రారంభమైందని జడ్పీ చైర్‌పర్సన్‌ రోజాశర్మ అన్నారు. బుధవారం విపంచి కళా నిలయంలో ఋతుప్రేమ కార్యక్రమంపై అంగన్‌వాడీ టీచర్లకు అవగాహనా సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఆరోగ్య, స్వచ్ఛ్‌, ప్యాడ్స్‌ రహిత జిల్లాగా మారేందుకు మీవంతు కృషి చేయాలన్నారు. ఫ్రంట్‌ లైన్‌ వర్కర్స్‌ ద్వారా ఇది ప్రారంభమైందని, జిల్లాలోని మహిళా ఉద్యోగులందరూ మెనుస్ట్రువల్‌ కప్‌ను వాడుతున్నారని ఆమె తెలిపారు. దీన్ని కొనడం ముఖ్యం కాదు.. వాడడం ముఖ్యమని, ప్రతి మహిళ మరో ఐదుగురికి చైతన్యం చేయాలని సూచించారు. పట్టణంలోని 5వ వార్డులో మహిళలు, యువతులు వందశాతం వినియోగిస్తున్నారని ఆమె తెలిపారు. ఋతుప్రేమ కార్యక్రమం అనేది రాష్ట్రానికి ఆదర్శం కావాలని పేర్కొన్నారు. జిల్లా అదనపు కలెక్టర్‌ ముజామిల్‌ఖాన్‌ మాట్లాడుతూ పర్యావరణం, ఆరోగ్యం రెండు సమానం ఋతుప్రేమ యొక్క ఉద్దేశం అన్నారు. జిల్లాలో 10 వేలమందికి ఉచితంగా మెనుస్ట్రువల్‌ కప్‌ను అందజేశామన్నారు. జిల్లాలో 4 లక్షల మంది మహిళలు ఉన్నారని, ఋతుప్రేమ ప్రచార బాధ్యత మీపైన ఉన్నదని, గ్రామాల్లో అంగన్‌వాడీ టీచర్లు, ఆశావర్కర్లు, గ్రామపంచాయతీ కార్యదర్శి, ఏఎన్‌ఎం నలుగురితో బృందం ఏర్పడి మహిళలకు అవగాహన కల్పించాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా అంగన్‌వాడీ టీచర్లకు డాక్టర్‌ శాంతి మెనుస్ట్రువల్‌ కప్‌ వాడకాన్ని తెలియజేశారు. అనంతరం వారికి మెనుస్ట్రువల్‌ కప్‌ను అందజేశారు. ఈ కార్యక్రమంలో సీపీ శ్వేత, జిల్లా పంచాయతీరాజ్‌శాఖ అధికారి దేవకీదేవి, జిల్లా బీసీ సంక్షేమశాఖ అధికారి సరోజాదేవి, జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారి రాంగోపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మహిళల ఆరోగ్యంతోనే సమాజ అభివృద్ధి : ఎమ్మెల్యే

హుస్నాబాద్‌, జూన్‌ 29: మహిళల ఆరోగ్యంతోనే సమాజ అభివృద్ధి అని ఎమ్మెల్యే వొడితెల సతీ్‌షకుమార్‌ అన్నారు. బుధవారం రాత్రి హుస్నాబాద్‌ పట్టణంలోని మండల పరిషత్‌ సమావేశ మందిరంలో జరిగిన ఋతుప్రేమ అవగాహనా సదస్సులో ఆయన మాట్లాడారు. సామాజిక, స్వచ్ఛంద సేవా కార్యకర్త శాంతి ఋతుప్రేమ కార్యక్రమంతో మహిళలు ఆరోగ్యంగా ఉండేందుకు విశేషంగా కృషి చేస్తున్నారన్నారు. అనంతరం సీపీ శ్వేత మాట్లాడుతూ మార్కెట్‌లో ప్యాడ్‌లకు యాడ్స్‌తో ప్రచారం చేస్తున్నారని, కానీ ఈ ప్యాడ్‌లకు ఆదాయం రాదని ప్రచారం చేయడం లేదన్నారు. తక్కువ ధరకు ఈ ప్యాడ్స్‌ లభించడమే కాకుండా ఆరోగ్యంగా ఉండేందుకు దోహదపడుతాయన్నారు. జడ్పీ చైర్‌పర్సన్‌ రోజా శర్మ మాట్లాడుతూ ఋతుప్రేమ కార్యక్రమం ప్రపంచంలో ఎక్కడా లేదన్నారు. దీనిపై జిల్లాలో ఇప్పటివరకు 8వేల మందికి అవగాహన కల్పించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ ముజామిల్‌ఖాన్‌, సామాజిక, స్వచ్ఛంద సేవా కార్యకర్త శాంతి, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ఆకుల రజిత, ఎంపీపీలు మానస, లక్ష్మి, వైస్‌ చైర్‌పర్సన్‌ అయిలేని అనిత, కౌన్సిలర్లు కొంకటి నళినీదేవి, రమాదేవి, చిత్తారి పద్మ, కోమటి స్వర్ణలత, వైద్యాధికారి సౌమ్యతో పాటు మహిళలు పాల్గొన్నారు.

త్వరలో వజ్రోత్సవాలు 

హుస్నాబాద్‌ పట్టణంలోని ప్రభుత్వ బాలుర పాఠశాలలో రాజశేఖర్‌రెడ్డి అనే దాత ఇచ్చిన రూ.5 లక్షల విలువైన ఫర్నిచర్‌ను ఎమ్మెల్యే వొడితెల సతీ్‌షకుమార్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పాఠశాల వజ్రోత్సవాలు త్వరలో ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. ఇందులో హెచ్‌ఎం మనీల తదితరులు పాల్గొన్నారు. 



Updated Date - 2022-06-30T05:29:28+05:30 IST