మాటహక్కు కరువైనప్పుడు మనుగడకు అర్థంలేదు!

ABN , First Publish Date - 2022-07-29T06:07:39+05:30 IST

ఐదుదశాబ్దాల క్రితం ఉగాండా ఎటువంటి కల్లోల స్థితిలో ఉన్నదో, భారతదేశం ఇప్పుడు అదేవిధంగా ఉందని నేనేమీ అనడం లేదు. కానీ, పాలకులు వారూవీరూ అన్నతేడాలేకుండా దేశవ్యాప్తంగా...

మాటహక్కు కరువైనప్పుడు మనుగడకు అర్థంలేదు!

‘మాట్లాడే స్వేచ్ఛ ఉంది. మాట్లాడిన తరువాత 

స్వేచ్ఛ ఉంటుందన్న గ్యారంటీయే లేదు’. 

ఉగాండా నియంత ఇదీ అమీన్.


ఐదుదశాబ్దాల క్రితం ఉగాండా ఎటువంటి కల్లోల స్థితిలో ఉన్నదో, భారతదేశం ఇప్పుడు అదేవిధంగా ఉందని నేనేమీ అనడం లేదు. కానీ, పాలకులు వారూవీరూ అన్నతేడాలేకుండా దేశవ్యాప్తంగా ప్రజాస్వామిక నియంతృత్వ పోకడలు మాత్రం వేగంగా పెరుగుతున్నాయి. ప్రజాజీవనంపై ఇది తీవ్ర ప్రభావం వేస్తున్నది. ‘సెంటిమెంట్లు’ నిరంతరం దెబ్బతింటున్న ఈ ప్రజాస్వామ్యదేశంలో ప్రప్రథమంగా బలైపోతున్నది వాక్ స్వాతంత్ర్యమే. ప్రతీకారంతో రగిలిపోతున్న నాయకత్వాలు, పక్షపాతంతో వ్యవహరించే పోలీసులు, బలహీనమైన న్యాయవ్యవస్థ కలసి మాట్లాడే స్వేచ్ఛను హరించివేస్తున్నాయి.


మహారాష్ట్రలో ఈ మధ్యనే ఒక యువనటి నలభైరోజులపాటు జైల్లో ఉండివచ్చింది. నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ మీద సామాజిక మాధ్యమాల్లో ఆమె ఒక ‘అభ్యంతరకర’ పోస్టు చేసింది. ఇక, అవినీతిలో కూరుకుపోయిన ఒక ఐఎఎస్ అధికారి కేంద్రహోంమంత్రి అమిత్ షాతో ఉన్న గతకాలపు చిత్రాన్ని ట్వీట్ చేసినందుకు గుజరాత్ పోలీసులు ఒక సినీప్రముఖుడిని అరెస్టుచేశారు. పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని విమర్శించాడన్న అభియోగం మీద ఒక యూట్యూబర్‌ని ఆ రాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు. ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఫోటోను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసిన నేరంపై ఓ స్కూలు పిల్లవాడిని పోలీసులు అరెస్టు చేశారు.


ఇవి ఉదాహరణలు మాత్రమే. ఈ సంఘటనలన్నీ ఏకరీతిగా ఉండటంలో ఆశ్చర్యమేమీ లేదు. కక్షసాధింపు ధోరణితో వ్యవహరించే అమిత శక్తివంతమైన పాలకులు, వారు కేంద్రంలోనూ కావచ్చు, రాష్ట్రాల్లోనూ కావచ్చు, ఏ మాత్రం విమర్శను, ప్రశ్నను భరించలేని స్థితిలో ఉన్నప్పుడు వారిని అనుక్షణం మెప్పించే ప్రయత్నం దిగువస్థాయిలో విస్తృతంగా జరుగుతూంటుంది. వారిసేవలో తరించేవారు ఏవో ఫిర్యాదులు చేయడం, స్థానిక పోలీసులు అనూహ్యమైన వేగంతో స్పందించి కేసులు పెట్టడం గొలుసుకట్టులాగా సాగుతూంటుంది. ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 153కు విస్తృతితో పాటు శక్తికూడా ఎక్కువే. ‘సామాజిక ప్రశాంతతను విచ్ఛిన్నం చేసే చర్యలు’ దీని పరిధిలోకే వస్తాయి. పోలీసులు ఈ సెక్షన్ ప్రకారం కేసుపెట్టి సదరు నిందితులను మేజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టగానే, న్యాయమూర్తి బెయిల్‌కు ససేమిరా అంటారు. వ్యవహారం ఇక్కడితో ఆగదు. కొద్దిరోజుల్లోనే మరిన్ని ఎఫ్ఐఆర్‌లు తయారవుతాయి, కస్టడీలో ఉండగానే కొత్తకేసులు పుట్టుకొచ్చి, పీకకు చుట్టుకుంటాయి. మన సుప్రీం పాలకుల మౌనం మధ్య, కంటికి కనిపించని ఆశీస్సులతో ఇదంతా జరిగిపోతూంటుంది. అత్యధిక కేసుల్లో ఇదంతా అక్రమమనీ, బూటకమనీ అందరికీ తెలుసు. ‘ప్రక్రియే ఓ పెద్ద శిక్ష’ అని సుప్రీంకోర్టు ఇటీవల అందుకే వ్యాఖ్యానించింది.


ఈ భయానకమైన విధానానికి మతాన్ని చేర్చితే ఆ మిశ్రమం మరింత విషపూరితంగా తయారవుతుంది. అప్పుడు ఏకంగా సెక్షన్ 295 రంగ ప్రవేశం చేసి, మతవిశ్వాసాలను దెబ్బతీయడం అనే మహానేరం తోడవుతుంది. మహమ్మద్ జుబైర్ వ్యవహారం ఇందుకు ఓ ఉదాహరణ. సామాజిక మాధ్యమాల్లో ప్రచారమవుతున్న కట్టుకథలనుంచి నిజాన్ని నిగ్గుతేల్చి చూపే ఈ జుబైర్ తొలిగా ఏ ఆరోపణ మీద అరెస్టయిందీ తెలిసిందే. మహమ్మద్ ప్రవక్తమీద బీజేపీ ప్రతినిధి నూపుర్ శర్మ ఒక టీవీ చర్చలో భాగంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన క్లింప్పింగులను ఆయన షేర్ చేయగానే, నాలుగేళ్ళక్రితం ఆయన చేసిన ట్వీట్ ఒకటి బయటకు వచ్చి, ఒక అపరిచిత వ్యక్తి ఫిర్యాదుతో కేసు నమోదైంది. ఆ తరువాత జుబైర్ మీద యూపీలో వరుస కేసులు పుట్టుకొచ్చాయి. ఆ రాష్ట్రంలోనే ఒక జిల్లానుంచి మరొకజిల్లాకు ఆయనను తిప్పుతూ ఊపిరితీసుకోనివ్వలేదు. చివరకు సుప్రీంకోర్టు రంగంలోకి దిగి, ఆయనను జైల్లోనుంచి బయటపడేసింది. అరెస్టు అధికారాన్ని పరిమితంగా వినియోగించాలని హితవుచెబుతూ పోలీసులకు చీవాట్లు పెట్టింది.


రాజ్యం నిరంకుశత్వాన్ని నిలువరిస్తూ, అనేకానేక ఎఫ్ఐఆర్‌లకు స్వస్తిచెబుతూ, ‘జెయిలు కాదు, బెయిల్’ అన్న న్యాయాన్ని సుప్రీంకోర్టు ఇలా అమలు చేసిందో లేదో, మరో విమర్శ రేగింది. అదే సుప్రీంకోర్టులో, మరొక ధర్మాసనం నూపుర్ శర్మకు ఇదేరకమైన ఉపశమనాన్ని ఎందుకు ప్రసాదించలేదంటూ సామాజిక మాధ్యమాల్లోనూ, టీవీ చానెళ్ళలోనూ దుష్ప్రచారం మొదలైంది. అన్ని ఎఫ్ఐఆర్‌లనూ కలిపివేయాలన్న వినతిని నూపుర్ శర్మ కేసులో సదరు బెంచ్ తిరస్కరించిన విషయం ప్రశ్నార్థకమైనదే అయినప్పటికీ, ఈ రెండు కేసుల్లోనూ తేడా విస్పష్టం. జుబైర్ అప్పటికే పాతికరోజులు జైల్లో ఉన్నాడు. అతడి భవిష్యత్తు, స్వేచ్ఛ కూడా ఊగిసలాటలో ఉంది. మరోపక్క అంతటి వివాదంలోనూ నూపుర్ శర్మ అరెస్టు కాలేదు. ఆమెకు రాజ్యం అండగా ఉంది, పాలకుల రక్షణ దక్కుతున్నది. నిజానికి, నూపుర్‌ను కానీ, జుబైర్‌ను కానీ అరెస్టు చేయాల్సిన అవసరమేమీ లేదు. జుబైర్ ట్వీట్ కొందరికి ప్రమాదకరంగా కనిపించి ఉండవచ్చునేమో కానీ, దానికి సమాజంలో మతవిద్వేషాలను పెంచి, అశాంతిని రగిలించేంతటి శక్తిలేదు. ఇంకా చెప్పుకోవాలంటే, పాలకుల పడగనీడన నిబ్బరంగా ఉంటూ అశాంతికోసం అమితంగా కృషిచేస్తున్నవారిని ఈ ట్వీట్ నిలదీస్తున్నది, ఎగతాళి చేస్తున్నది. నూపుర్ శర్మ విషయానికివస్తే, ఆవేశకావేశాలు రెచ్చగొడుతూ, చెవులు బద్దలయ్యేట్టుగా నిర్వహించిన ఓ చర్చాకార్యక్రమంలో ఆమె నోరుజారి, హద్దులుదాటి కొన్ని వ్యాఖ్యలు చేసి ఉండవచ్చు. కానీ, సెక్షన్ 295 ప్రయోగించి, మతదూషణకు పాల్పడిన నేరంపై ఆమెను అరెస్టు చేయాలని డిమాండ్ చేయడం సరికాదు. వ్యక్తులను వేధించడానికీ, వేటాడటానికి ఉపకరించే వలసపాలనాకాలం నాటి ఈ సెక్షన్‌లో నిజానికి మతదూషణ అనే మాట నేరుగా ఉండదు కూడా. పైగా, ఆమె ఒకసారి క్షమాపణ కోరిన తరువాత వ్యవహారం అంతటితో ముగిసినట్టు భావించాలి. టెలివిజన్ చానెళ్ళు ఎంతో జాగ్రత్తగా, బాధ్యతగా వ్యవహరించాలన్న విషయాన్ని ఈ ఘటన తెలియచెబుతోంది.


సుప్రీంకోర్టులో జుబైర్ బెయిల్ మీద వాదనలు కొనసాగుతున్నప్పుడు బజరంగ్ ముని అనే ఒక మహంత్ ప్రస్తావన తీసుకువచ్చారు అదనపు అటార్నీ జనరల్. ముస్లిం మహిళలను రేప్ చేయాలంటూ బహిరంగ హెచ్చరికలు చేసిన ముని ఇతడు. ఒక మతపెద్దను పట్టుకొని విద్వేషకారుడని అంటే చాలా సమస్యలు వస్తాయన్నారు అటార్నీ. ఒక విచ్ఛిన్నకారుడిని ఈ రకంగా సమర్థించుకురావడం విషాదం. ఏమాత్రం సహనశీలతలేని, అసమ్మతిని అణచివేసే రాజకీయం ఒకవైపు, ఒకరిపై ఒకరు మత విద్వేషంతో రగిలిపోయే గ్రూపులు మరొకవైపు ఉన్నప్పుడు మాట్లాడే స్వేచ్ఛ ఒక రాజకీయ సాధనంగా మారిపోవడంలో ఆశ్చర్యమేముంది? ఎటువంటి నియంత్రణలూ నియమాలూ లేని సామాజిక మాధ్యమాల విస్తృతి ఈ వాతావరణాన్ని దిగజార్చుతున్నదే తప్ప, మెరుగుపరచడం లేదు. ప్రతీ వ్యక్తీ ఒక సిటిజన్ జర్నలిస్టుగా రూపొంది, విస్తృత ప్రజాభిప్రాయంతో ప్రజాస్వామ్యం మరింత మెరుగుపడాల్సి ఉండగా, అందుకు భిన్నంగా చర్చ, హేతువు కుంచించుకుపోతున్నాయి. పరస్పరం రెచ్చగొట్టుకొనే విద్వేషం, విషం, ఆరోపణలు, నిందలూ నానాటికీ పెరిగిపోవడం తప్ప ఏమి కనిపిస్తున్నది? ఇటువంటి పరిస్థితుల మధ్య నోరువిప్పడానికీ, నిజం చెప్పడానికీ భయపడిపోయే వాతావరణం అలుముకుంటున్నది. ఒక మాట, ఒక వ్యాఖ్య, ఓ విమర్శ, ఓ ప్రశ్నతో రాజకీయ పెద్దల మనసులు గాయపడిపోతూంటే, వారి చీర్ లీడర్లంతా చిందులు వేసి కేసులు పెడుతూంటే, పోలీసులు ఎఫ్ఐఆర్‌లను ఆయుధాలుగా ప్రయోగిస్తుంటే, న్యాయస్థానాలు అరుదుగా మాత్రమే స్పందిస్తుంటే, పాలకులను ఎవరు నిలదీయగలరు, వారి చర్యలనూ చేష్టలనూ ఎవరు ప్రశ్నించగలరు?


1988లో రాజీవ్ గాంధీ పరువునష్టం బిల్లును తెచ్చినప్పటి పరిస్థితులను ఓసారి గుర్తుచేసుకుందాం. ఆయన ప్రయత్నానికి వ్యతిరేకంగా విద్యార్థులు, న్యాయవాదులు, ట్రేడ్ యూనియన్లు, మేథావులు వీధుల్లోకి వచ్చారు. మీడియా తీవ్రమైన విమర్శలు చేసింది. రాజీవ్ వెనక్కుతగ్గి బిల్లు ఉపసంహరించుకున్నారు. ఇప్పుడు వాక్ స్వాతంత్ర్యం అత్యంత ప్రమాదంలో పడినప్పుడు కూడా ఎంతమంది ఎడిటర్లు, ఎంతమంది పౌరసమాజ పెద్దలు గొంతు విప్పుతున్నారు?


ప్రభుత్వం తీసుకొనే వివాదాస్పద నిర్ణయాలమీద కూడా ట్వీట్ చేయడానికి తాను వెనక్కుతగ్గుతున్నాననీ, ఎవరో ఫిర్యాదు చేస్తే తనపై క్రిమినల్ కేసు మోపుతారన్న భయం తనను ఎప్పటికప్పుడు నిలువరిస్తున్నదని సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి ఇటీవల ఓ మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు. ఆయన పరిస్థితే ఇలా ఉంటే, ఇక సామాన్యుల గతేమిటి?


రాజ్‌దీప్‌ సర్దేశాయి 

(వ్యాసకర్త సీనియర్‌ జర్నలిస్‌్ట)

Updated Date - 2022-07-29T06:07:39+05:30 IST