ట్రంప్‌, మోదీ మ‌ధ్య ఎలాంటి చ‌ర్చ‌లు జ‌ర‌గ‌లేదు: భార‌త్‌

ABN , First Publish Date - 2020-05-30T12:27:49+05:30 IST

ప్రధాని నరేంద్రమోదీతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇటీవల ఎప్పుడూ మాట్లాడనే లేదని భారత్‌ ప్రకటించింది.

ట్రంప్‌, మోదీ మ‌ధ్య ఎలాంటి చ‌ర్చ‌లు జ‌ర‌గ‌లేదు: భార‌త్‌

ఇరువురి మధ్య చర్చలే జరగలేదు: భారత్‌

ట్రంప్‌ మధ్యవర్తిత్వం అవసరం లేదు

వివాదాలను మేమే పరిష్కరించుకోగలం

ఆ సామర్థ్యం రెండు దేశాలకు ఉంది: చైనా

న్యూఢిల్లీ, మే 29: ప్రధాని నరేంద్రమోదీతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇటీవల ఎప్పుడూ మాట్లాడనే లేదని భారత్‌ ప్రకటించింది. చివరిగా ఏప్రిల్‌ 4న హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ మాత్రల కోసం మాత్రమే మోదీకి ట్రంప్‌ ఫోన్‌ చేశారని, ఆ తరువాత ఇద్దరి మధ్య ఎటువంటి  సంభాషణా జరగలేదని అధికార వర్గాలు వెల్లడించాయి. భారత్‌-చైనా సరిహద్దు వివాదాలపై తాను మోదీతో మాట్లాడానని, ఈ అంశంపై మోదీ ‘గుడ్‌ మూడ్‌’లో లేరని ట్రంప్‌ గురువారం వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అయితే చైనాతో సరిహద్దు వివాదాలను తాము నేరుగా పరిష్కరించుకోగలమని, అందుకు మిలిటరీ పరంగా, దౌత్యపరంగా అవసరమైన యంత్రాంగం తమ విదేశాంగ మంత్రిత్వశాఖ ఉందని భారత్‌ స్పష్టం చేసింది.


ఇంతకుముందు కూడా ట్రంప్‌.. భారత్‌-చైనా వివాదం పరిష్కారానికి తాను మధ్యవర్తిత్వం వహిస్తానని ప్రకటించడం, ఆ అవసరం తమకు లేదని భారత్‌ నిర్ద్వంద్వంగా తిరస్కరించడం తెలిసిందే. తాజాగా చైనా కూడా ట్రంప్‌ ప్రతిపాదనను తిరస్కరించింది. ఈ ప్రతిపాదనపై చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఝావో లిజియాన్‌ శుక్రవారం తొలిసారి స్పందించారు. వివాదాలను చర్చల ద్వారా సామరస్యంగా పరిష్కరించుకునే శక్తి తమ రెండు దేశాలకు ఉందని, మూడో వ్యక్తి ప్రమేయం తమకు అవసరం లేదని స్పష్టం చేశారు. ద్వైపాక్షిక ఒప్పందాలకు, సరిహద్దుల్లో శాంతిని, భద్రతను కాపాడేందుకు కట్టుబడి ఉన్నామని అన్నారు. కాగా, చైనాతో సరిహద్దు వివాదంపై ప్రభుత్వం స్పష్టతనివ్వాలని కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ డిమాండ్‌ చేశారు. ఈ పరిణామాలపై ప్రభుత్వం మౌనంగా ఉండటం అనిశ్చితికి దారితీస్తోందని ట్వీట్‌ చేశారు.


Updated Date - 2020-05-30T12:27:49+05:30 IST