Advertisement
Advertisement
Abn logo
Advertisement

మధ్యవర్తిత్వంలో ఓటమి లేదు!

  • కోర్టుకు వెళ్లేముందు రాజీకి ప్రయత్నించాలి.. 
  • వ్యాపార వివాదాల పరిష్కార వ్యవస్థ కీలకం
  • లండన్‌ కేంద్రానికి దీటుగా హైదరాబాద్‌ సెంటర్‌.. 
  • సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రమణ 
  • భూమి కేటాయించినందుకు సీఎంకు కృతజ్ఞతలు.. 
  • ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌ పక్కనే ఇస్తాం: కేసీఆర్‌


హైదరాబాద్‌, డిసెంబరు 4 (ఆంధ్రజ్యోతి): ప్రత్యామ్నాయ వివాద పరిష్కార విధానాలైన ఆర్బిట్రేషన్‌, మీడియేషన్‌లో విజేతలు, పరాజితులు ఎవరూ ఉండరని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ వ్యాఖ్యానించారు. కోర్టుకు వెళ్లాలనుకునే ప్రతి ఒక్కరూ మధ్యవర్తిత్వ ప్రత్యామ్నాయాన్ని పరిశీలించాలని సూచించారు. దేశంలో పెట్టుబడులు పెట్టే విదేశీ సంస్థలు ఇక్కడ ఏమైనా వ్యాపార వివాదాలు ఏర్పడితే ఆ వివాదాలు పరిష్కారమయ్యే సమయాన్ని కూడా గమనిస్తాయని తెలిపారు. శనివారం హైదరాబాద్‌లో జరిగిన అంతర్జాతీయ ఆర్బిట్రేషన్‌ అండ్‌ మీడియేషన్‌ సెంటర్‌(ఐఏఎంసీ) హైదరాబాద్‌ పరిచయ సదస్సులో ఆయన పాల్గొన్నారు. నానక్‌రాంగూడలో ఏర్పాటు చేసిన ఐఏఎంసీను ఈ నెల 18న ప్రారంభిస్తామని తెలిపారు. ఐఏఎంసీ శాశ్వత భవనం కోసం భూమి కేటాయించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రధాన న్యాయమూర్తి  కృతజ్జతలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఐఏఎంసీ హైదరాబాద్‌ పరిచయ కార్యక్రమానికి వచ్చిన వారంతా తమ తమ రంగాల్లో విజయవంతమైన వ్యక్తులని, ఐఏఎంసీ విజయవంతం కావడంలో కూడా వారు తమ వంతు పాత్ర పోషిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. వేదకాలం నుంచే భారతదేశంలో మధ్యవర్తిత్వం ఉందని ప్రస్తావించారు. శ్రీకృష్ణుడి మధ్యవర్తిత్వం విఫలం కావడం వల్లే మహాభారతంలో భయంకరమైన యుద్ధం జరిగిందని చెప్పారు. న్యాయవాద పట్టాలు లేకపోయినా మధ్యవర్తిత్వం చేయవచ్చని చెప్పారు. వాణిజ్యంలో విస్తృతానుభవం ఉన్నవారు కూడా మధ్యవర్తిత్వానికి పూనుకోవచ్చని సూచించారు. కోర్టులకు వెళ్లడానికి ముందు ప్రత్యామ్నాయ వివాద పరిష్కార సాధనాలను పరిశీలించాలని ప్రజలను కోరారు. వ్యాపార, వాణిజ్యాల్లో విభేదాలు సహజమని, చిన్న చొరవతో పెద్ద పెద్ద వివాదాలను సైతం పరిష్కరించవచ్చని సూచించారు. కుటుంబం, వ్యాపారం, వ్యక్తిగత జీవితం ఏదీ వివాదం లేకుండా ఉండదని చెప్పారు. వాణిజ్యం అంశానికి వచ్చేసరికి డబ్బును కోల్పోవడానికి, తమ పరిశ్రమ ప్రయోజనాలు వదులుకోవడానికి ఎవరూ ఇష్టపడరని అన్నారు. 


ఎక్కువ ఖర్చు, సమయం అవసరం లేకుండా ప్రత్యామ్నాయ వివాద పరిష్కార మార్గాల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవచ్చని చెప్పారు. చర్చల ద్వారా వివాదాలు పరిష్కారం కానప్పుడు మూడో వ్యక్తుల సహాయం కోరతామని, అప్పటికీ పరిష్కారం కాకపోతే కోర్టుకు వెళతామని అన్నారు. అన్ని అవకాశాలు మూసుకు పోయాకే కోర్టుకు వెళ్లాలని సూచించారు. కోర్టుకు వెళ్లే ముందు మధ్యవర్తిత్వ ప్రత్యామ్నాయాన్ని పరిశీలించాలన్నారు. మధ్యవర్తిత్వం ద్వారా పాత స్నేహ సంబంధాలను పునరుద్ధరించుకోవచ్చని చెప్పారు. ‘‘సమస్యను పరిష్కరించుకోవాలంటే మనకు సరైన వైఖరి ఉండాలి. ఈగోలను వదిలిపెట్టాలి, భావోద్వేగాలను అదుపు చేసుకోవాలి. మధ్యవర్తిత్వం ప్రపంచ వ్యాప్తంగా ఉపయోగిస్తున్న విధానం. తక్కువ ఖర్చు, తక్కువ సమయంలో దీని ద్వారా ఫలితాలు వస్తాయి. మధ్యవర్తిత్వం ద్వారా అంతర్జాతీయ వివాదాలను సైతం పరిష్కరించుకోవచ్చు. మధ్యవర్తిత్వం ద్వారా ఇరుపక్షాల మధ్య సంబంధాలు పెరుగుతాయి. ఫలితం మీద ఇద్దరికీ పట్టు ఉంటుంది. నిపుణులైన మధ్యవర్తులు అందుబాటులో ఉంటారు. లండన్‌, ప్యారిస్‌, హాంకాంగ్‌, సింగపూర్‌, న్యూయార్క్‌, స్టాక్‌హోంలలో అత్యంత ఆదరణ పొందుతున్న మధ్యవర్తిత్వ కేంద్రాలు ఉన్నాయి. అయితే, దేశం దాటి మధ్యవర్తిత్వానికి వెళ్లడం చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. హైదరాబాద్‌లో అంతర్జాతీయ ఆర్బిట్రేషన్‌ కేంద్రం ఏర్పాటుతో భారత్‌లో మధ్యవర్తిత్వం స్వరూపమే మారిపోనుంది. ఉత్తమ మౌలిక సదుపాయాలు, అంతర్జాతీయంగా నిపుణులైన మధ్యవర్తులు ఇక్కడ అందుబాటులో ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన మధ్యవర్తి అయిన సింగపూర్‌ చీఫ్‌ జస్టిస్‌ మీనన్‌తో నేను మాట్లాడాను.. ఆయన సహాయం చేస్తామన్నారు. లండన్‌ మధ్యవర్తిత్వ కేంద్రం నిపుణులతో కూడా మాట్లాడాను. హైదరాబాద్‌ ఐఏఎంసీ ఉత్తమ ప్రమాణాలతో పని చేసేందుకు రిటైర్డ్‌ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ రవీంద్రన్‌ బృందం నియమ నిబంధనలు రూపొందించింది. 


నాణ్యత విషయంలో హైదరాబాద్‌ ఐఏఎంసీని సింగపూర్‌, హాంకాంగ్‌, లండన్‌ సెంటర్లతో పోల్చవచ్చు. హైదరాబాద్‌లో ఐఏఎంసీకి శాశ్వత భవనం ఏర్పాటు చేయడానికి తగిన చర్యలు తీసుకుంటామని సీఎం కేసీఆర్‌ హామీ ఇచ్చారు. ఇక్కడ చాలా ఫార్మా, ఐటీ కంపెనీలు, రియల్‌ ఎస్టేట్‌, ఏరోస్పేస్‌ కంపెనీలు ఉన్నాయి. దేశంలో ఆర్థికంగా వేగంగా ఎదుగుతున్న నగరాల్లో హైదరాబాద్‌ ఒకటి. అన్ని రకాల గణాంకాలు హైదరాబాద్‌ వాణిజ్య, వ్యాపారాలకు గొప్ప కేంద్రం అని తెలియజేస్తున్నాయి. అంతర్జాతీయ విమానాశ్రయం, రైలు రవాణా సౌకర్యాలు ఉన్నాయి, వరల్డ్‌ క్లాస్‌ హోటల్స్‌ ఉన్నాయి. అన్నిటికంటే గొప్పగా తెలంగాణ ప్రజలు ఆదరించే గుణంతో పాటు అన్ని రకాలుగా సహకరించే స్వభావాన్ని కలిగి ఉంటారు. హైదరాబాద్‌లో కేంద్రం ఉండటం వల్ల అంతర్జాతీయ స్థాయి మధ్యవర్తులు అందుబాటులోకి వస్తారు. వీడియో కాన్ఫరెన్సింగ్‌ వంటి అనేక సౌకర్యాలు ఉంటాయి. అందుకే అంతర్జాతీయ వాణిజ్య సంస్థలు వ్యవస్థాపరమైన మధ్యవర్తిత్వాన్ని కోరుకుంటున్నాయి. మొదట చిన్న మధ్యవర్తిత్వ కేంద్రాన్ని ఏర్పాటు చేద్దామనుకున్నాం. జస్టిస్‌ ఎల్‌.నాగేశ్వరరావు భారీ స్థాయిలో అంతర్జాతీయ ఆర్బిట్రేషన్‌ సెంటర్‌ ఏర్పాటు చేయాలని సూచించారు. తద్వారా భారత్‌ అంతర్జాతీయ ఆర్బిట్రేషన్‌, మీడియేషన్‌ హబ్‌గా ఉంటుందని సూచించారు. 

ఈ ఏడాది జూన్‌లో ఐఏఎంసీ గురించి హైదరాబాద్‌లో మొదటిసారి మాట్లాడాను. సీఎం కేసీఆర్‌ సహాయం వల్ల ప్రస్తుతం ఆ కల సాకారమైంది. ఈ ఏడాది ఆగస్టు 28న అప్పటి తెలంగాణ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ హిమాకోహ్లి నివాసంలో జరిగిన సమావేశంలో మొదటిసారి ఐఏఎంసీ ట్రస్టు డీడ్‌ను ప్రతిపాదించాను. ఈ రోజున ఐఏఎంసీ పరిచయ కార్యక్రమంలో మనం మాట్లాడుతున్నాం. ఈ నెల 18న నానక్‌రాం గూడలో ఐఏఎంసీ కేంద్రాన్ని ప్రారంభించుకోబోతున్నాం. ఎంత వేగంగా ప్రాజెక్టు సాకారం అయిందో చూడండి. భూమి కేటాయించినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మరోసారి కృతజ్ఞతలు. ఈ ప్రాజెక్టు కోసం శ్రమించిన జస్టిస్‌ రవీంద్రన్‌, సలహాలు అందించిన జస్టిస్‌ కురియన్‌ జోసెఫ్‌, తెలంగాణ బిడ్డ జస్టిస్‌ ఆర్‌.సుభా్‌షరెడ్డి, జస్టిస్‌ హిమా కోహ్లి, తెలంగాణ హైకోర్టు సీజే సతీశ్‌చంద్ర శర్మ, రిజిస్ర్టార్‌ జనరనల్‌ నాగార్జున్‌, మంత్రి కేటీఆర్‌, మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డిలకు కృతజ్జతలు. ఐఏఎంసీ విజయవంతం అవుతుంది. భారత్‌ ఆర్బిట్రేషన్‌, మీడియేషన్‌ కేంద్రంగా ఎదుగుతుంది’ అని సీజేఐ ఎన్వీ రమణ తెలిపారు.


పుప్పాలగూడలో భూమి కేటాయిస్తాం

హైదరాబాద్‌లో ఐఏఎంసీ కేంద్రం ఏర్పాటు చేయాలన్న నిర్ణయం తీసుకున్నందుకు తెలంగాణ ప్రజల తరఫున సీజేఐ ఎన్వీ రమణకు సీఎం కేసీఆర్‌ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, దేశం ఆర్థికంగా ఎదగాలంటే తేలిగ్గా వ్యాపారం చేసుకొనే అవకాశాలు, నిక్కచ్చిగా ఒప్పందాల అమలు కీలకమని చెప్పారు. ఒప్పందాల అమలు విషయంలో భారత్‌ చాలా వెనుకబడి ఉందని అన్నారు. దీన్ని అధిగమించేందుకు దేశంలో ఐఏఎంసీ వంటి కేంద్రాలు మరిన్ని రావాలన్నారు. ప్రపంచ స్థాయి నగరంగా హైదరాబాద్‌ ఎదిగిందని, ఫార్చ్యూన్‌ 500 కంపెనీలు హైదరాబాద్‌లో తమ కార్యాలయాలను ప్రారంభించాయని ప్రస్తావించారు. కొన్నిసార్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా లిటిగెంట్లుగా ఉంటాయని, జడ్జిలు, కోర్టుల కొరత వల్ల కేసుల పరిష్కారం ఆలస్యమవుతోందని చెప్పారు. మధ్యవర్తిత్వ కేంద్రం భారత్‌లో పరిశ్రమలకు, వ్యాపారాలకు గొప్ప విలువను జోడిస్తుందని వ్యాఖ్యానించారు. ఐఏఎంసీ ప్రారంభానికి తెలంగాణ ప్రభుత్వం నానక్‌రాం గూడలో 25 వేల చదరపు అడుగుల కార్యాలయాలను ఏర్పాటు చేసినందుకు చాలా సంతోషంగా ఉన్నామని చెప్పారు. ఐఏఎంసీ శాశ్వత భవనాల కోసం ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌కు దగ్గర్లో పుప్పాలగూడలో తగిన భూమి కేటాయిస్తామని చెప్పారు. సీజేఐ ఎన్వీ రమణ, జస్టిస్‌ ఎల్‌.నాగేశ్వర్‌రావు జస్టిస్‌ రవీంద్రన్‌ల మార్గదర్శనంలో ఆసియాలోనే గొప్ప మధ్యవర్తిత్వ కేంద్రంగా గుర్తింపు పొందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మరో 15 రోజుల్లో ఐఏఎంసీ సెంటర్‌ను ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. 


అందుబాటులో నిపుణులు: జస్టిస్‌ రవీంద్రన్‌

సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి, ఐఏఎంసీ జీవితకాల ట్రస్టీ ఆర్‌వీ రవీంద్రన్‌ మాట్లాడుతూ, ఐఏఎంసీ ద్వారా సమస్యలు పరిష్కరించేటప్పుడు నాణ్యత, ఖర్చు, సమయం వంటి విషయాల్లో సమన్వయం తప్పకుండా చేసుకుంటామని తెలిపారు. మధ్యవర్తిత్వానికి ఫీజులు పెట్టకుంటే అవసరం లేని వివాదాలు ఎక్కువ అవుతాయన్నారు. ఐఏఎంసీలో అంతర్జాతీయంగా నిపుణులైన మధ్యవర్తులను అందుబాటులో ఉంచుతామని ప్రకటించారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ లావు నాగేశ్వరరావు మాట్లాడుతూ అంతర్జాతీయ ఆర్బిట్రేషన్‌ కేంద్రం ఏర్పాటు చేయలనే ఆలోచన 20 ఏళ్ల కిందటిదని చెప్పారు. 


రెండు అంశాలపై ప్యానెల్‌ చర్చలు

ఐఏఎంసీ పరిచయ సదస్సు అనంతరం రెండు ప్యానెల్‌ చర్చలు జరిగాయి. ప్రత్యామ్నాయ వివాద పరిష్కారం అమలు విధానం, వినియోగదారుల అంచనాలు అనే అంశంపై జరిగిన  చర్చకు సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌.సుభా్‌షరెడ్డి ఛైర్‌పర్సన్‌గా వ్యవహరిచారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ పీఎస్‌ నర్సింహ, ప్రమోద్‌ నాయర్‌, కోమటిరెడ్డి శైలేంద్ర, వివేక్‌ మిట్టల్‌ పాల్గొన్నారు. మధ్యవర్తిత్వం అవసరం మీద చర్చకు సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ హిమా కోహ్లి చైర్‌పర్సన్‌గా వ్యవహరించారు. హైకోర్టు జడ్జి జస్టిస్‌ ఏ రాజశేఖర్‌రెడ్డి, నకల్‌ దివాన్‌, చిత్రానారాయణ్‌, అభినవ్‌ భూషణ్‌ పాల్గొన్నారు. 


తెలుగులో మాట్లాడకపోతే అసంతృప్తి

ప్రసంగం చివరలో సీజేఐ ఎన్వీ రమణ కొద్దిసేపు తెలుగులో మాట్లాడారు. ‘‘నేను తెలుగువాడిని. ఒక్క నిమిషం తెలుగులో మాట్లాడితే సంతోషంగా ఉంటుంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ కూడా తెలుగు భాషాభిమాని. భోజనంలో పెరుగన్నం తినకపోతే ఎలా అసంతృప్తి ఉంటుందో.. రెండు మాటలు తెలుగులో చెప్పకపోతే నాకు సంతోషంగా ఉండదు. తెలంగాణ బిడ్డ పీవీ నరసింహారావు ప్రధానిగా ఆర్థిక సంస్కరణలు తెచ్చారు. దానివల్లే చట్టాల్లో అనేక మార్పులు వచ్చాయి. మరో తెలుగు బిడ్డ పీసీ రావు ఆర్బిట్రేషన్‌ అండ్‌ కన్సీలియేషన్‌ యాక్ట్‌-1996 రాశారు. ఆ చట్టం రూపకల్పనలో మేం కొద్దో గొప్పో పాల్గొన్నాం. పెట్టుబడులు పెట్టమని అడగటానికి భారతీయ కంపెనీలు వెళ్లినపుడు లిటిగేషన్‌ వస్తే పరిష్కారం కావడానికి ఎన్ని ఏళ్లు పడుతుంది మీ దేశంలో? అని అడుగుతున్నారు. తీర్పులు చెప్పడానికి కోర్టులు, హంగామా, ఆర్బాటం అక్కర్లేదు. నేను మొన్న రాష్ట్రపతి, ప్రధానమంత్రి ముందు ఒక మాట చెప్పాను. ఈ దేశంలో కేవలం కోర్టులే కాదు. ప్రభుత్వాలు, అధికారులు కూడా న్యాయం చేయవచ్చు అన్నాను. సమాజంలో గౌరవ మర్యాదలు ఉన్న ప్రతి వ్యక్తి తీర్పు చెప్పడానికి అర్హుడే. దానికి లా డిగ్రీ అవసరం లేదు. కోటు వేసుకోవాల్సిన అవసరం లేదు. మీడియేషన్‌ సెంటర్‌లో తెలుగు వాళ్లు ముందుండాలి. సామాన్య మానవులకు సహాయం చేసే మధ్యవర్తిత్వ అంశాలు కూడా ఉంటాయి. సీఎం కేసీఆర్‌ది పెద్ద చెయ్యి. ఆయన ఏది చేసినా ఆర్భాటంగా.. భారీగా చేస్తారు. ఆది ఆయనను తీర్చిదిద్దిన గురువులు, పెద్దలు ఆయనకిచ్చిన వరం అనుకుంటాను. కృతజ్జతలు’ అని సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ తన ప్రసంగాన్ని ముగించారు.

ఎంఎస్‌ఎంఈలకు ఎంతో మేలు: కేటీఆర్‌ 

ముగింపు సమావేశంలో పాల్గొన్న మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ, టీఎ్‌సఐపాస్‌ ద్వారా పారిశ్రామిక వేత్తలు స్వీయ ధ్రువీకరణ ద్వారా నిర్మాణాలు ప్రారంభించుకోవచ్చని, దరఖాస్తు చేసిన 15 రోజుల్లో పరిశ్రమలకు అనుమతి ఇస్తామని తెలిపారు. ఆలస్యమైన ప్రతి రోజూ రోజుకు రూ. వెయ్యి చొప్పన సంబంధిత అధికారులకు జరిమానా విధించే విధంగా గొప్ప పాలసీని ప్రభుత్వం తీసుకొచ్చిందని తెలిపారు. 17500 పరిశ్రమలకు ఇప్పటి వరకు అనుమతులు ఇచ్చామని, 2.30 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని చెప్పారు. పరిశ్రమలు పెట్టడంతో పాటు వివాదాలు ఏర్పడినప్పుడు వేగంగా పరిష్కారం లభించాలని కేటీఆర్‌ అన్నారు. వ్యాపారంలో ప్రవేశించడమే కాకుండా వదిలించుకోవడం కూడా అంతే తేలిగ్గా ఉండాలని సూచించారు. వివాద పరిష్కారాలకు సంబంధించి రాష్ట్రంలోని సీఐఐ. ఫిక్కీ, నాస్కాం వంటి సంస్థతో ఐఏఎంసీ ప్రతినిధులు చర్చించాలని సూచించారు. ఎంఎ్‌సఎంఈలకు సమస్యలకు ఐఏఎంసీ ద్వారా పరిష్కారం లభిస్తుందని తెలిపారు. ఐఏఎంసీకి ఎలాంటి సహాయం అవసరం అయినా పరిష్కరించడానికి తాము సిద్ధంగా ఉంటామన్నారు. 

Advertisement
Advertisement