‘మునుగోడు’తో మారేదేం ఉండదు

ABN , First Publish Date - 2022-08-06T08:17:52+05:30 IST

‘‘మునుగోడు ఒక అసెంబ్లీ స్థానానికి జరగబోయే ఉప ఎన్నిక మాత్రమే.. ఆ ఎన్నికతో మారేదేం ఉండదు.

‘మునుగోడు’తో మారేదేం ఉండదు

  • ఇది కేసీఆర్‌ తెలంగాణ
  • వచ్చే ఎన్నికల్లో హ్యాట్రిక్‌ గెలుపు ఖాయం
  • మందబలంతో కేంద్రంలోని బీజేపీ 
  • సర్కారు పన్నులు పెంచుతోంది
  • బీజేపీ నేతలు చిల్లర నాణేలు.. శబ్దమెక్కువ
  • ట్విటర్లో నెటిజన్ల ప్రశ్నలకు కేటీఆర్‌ జవాబు
  • డీపీని కాదు.. జీడీపీని మార్చాలి
  • విపక్షాలను కూల్చడం ఆపి రూపాయిని నిలబెట్టాలి
  • ప్రధాని మోదీకి మంత్రి కేటీఆర్‌ సలహా
  • హిందీ ‘రుద్దుడు’ నచ్చదని వ్యాఖ్య

హైదరాబాద్‌, ఆగస్టు 5(ఆంధ్రజ్యోతి): ‘‘మునుగోడు ఒక అసెంబ్లీ స్థానానికి జరగబోయే ఉప ఎన్నిక మాత్రమే.. ఆ ఎన్నికతో మారేదేం ఉండదు. అన్ని రంగాల్లో అగ్రస్థానంలో ఉన్న ఈ తెలంగాణ కేసీఆర్‌ది. ప్రజల ఆశీర్వాదంతో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్‌ నేతృత్వంలోని ప్రభుత్వం మూడోసారి విజయం సాధించి హ్యాట్రిక్‌ సాధిస్తుంది’’ అని మంత్రి కె.తారకరామారావు అన్నారు. శుక్రవారం ట్విటర్‌లో నెటిజన్లు అడిగిన వివిధ ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. ప్రధాని మోదీ పేదలకు సహాయం చేయడం మాని కార్పొరేట్‌ సంస్థలకు సుమారు రూ.12 లక్షల కోట్ల రుణాలను మాఫీ చేశారని.. అదీ ఆయన స్టైల్‌ అని ఎద్దేవా చేశారు. జీఎస్టీ కౌన్సిల్లో బీజేపీకి ఉన్న మందబలంతో కేంద్రం ప్రజలపై భారీగా పన్నులు పెంచుతోందని.. రాష్ట్రాలు వ్యతిరేకించినా, పలు అంశాలను కేంద్రం పట్టించుకోవడం లేదని కేటీఆర్‌ ఆగ్రహం వెలిబుచ్చారు. జీఎస్టీ కౌన్సిల్‌ కేవలం సలహా ఇచ్చే యంత్రాంగం మాత్రమే అని.. నిర్ణయం పూర్తిగా కేంద్ర ప్రభుత్వ పరిధిలోనే ఉంటుందని ఆయన గుర్తుచేశారు. దేశంలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలన్నీటిని ప్రైవేటీకరించడం ద్వారా రైతులు, ఇతర వర్గాల ప్రయోజనాలు దెబ్బతింటాయని ఆందోళన వ్యక్తం చేశారు.


 రాష్ట్రంలో వీఆర్‌ఏల జీతాలు, పదోన్నతుల అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానన్నారు.  ‘‘వచ్చే ఎన్నికలకు టీఆర్‌ఎస్‌ ప్రధాన ప్రత్యర్థి ఎవరు? ఒకేసారి రెండు జాతీయపార్టీలతో యుద్ధం సాధ్యమేనా?’’ అని ఒకరు ప్రశ్నించగా..  ‘‘జాతీయ పార్టీలతోనే ఎందుకు? బరిలో పార్టీలు ఇంకా చాలానే ఉన్నాయి’’ అని బదులిచ్చారు. ‘వచ్చే ఎన్నికల్లో టీడీపీ, కాంగ్రె్‌సలతో పొత్తు ఉండబోతోందా అంటే.. పొత్తు తెలంగాణ ప్రజలతోనే ఉంటుందన్నారు. ‘తెలంగాణలో బీజేపీ నాయకులు నోటితో రెచ్చిపోయి ప్రచారంలో దూసుకెళ్తుంటే టీఆర్‌ఎస్‌ పెద్దలు ఎందుకు నిశ్శబ్దంగా ఉన్నారు?’ అనే ప్రశ్నకు.. ‘చిల్లర చాలా శబ్దం చేస్తుంది. (స్మైల్‌ ఎమోజీ)’ అని సమాధానమిచ్చారు. బాసర ట్రిపుల్‌ ఐటీ విద్యార్థుల సమస్యల పరిష్కారానాకి వీసీ ప్రొఫెసర్‌ వెంకట రమణ, డైరెక్టర్‌ సతీశ్‌ అక్కడే ఉన్నారని.. ప్రభుత్వం తరఫున ఇంకా చేయాల్సింది ఏమైనా ఉంటే విద్యాశాఖ మంత్రిని సంప్రదించవచ్చని.. మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.  నగరం వేగంగా విస్తరిస్తున్నందున హైదరాబాద్‌ మెట్రో విస్తరణ కూడా ఉంటుందా అని ఒక నెటిజన్‌ అడగ్గా.. త్వరలో పూర్తి ప్రణాళిక ప్రకటిస్తామని చెప్పారు. అలాగే.. మెట్రోతో పాటు, ఈ-బీఆర్‌టీఎస్‌, పీఆర్పీ ప్రత్యామ్నాయాలపైనా దృష్టి పెడుతున్నామని మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. మూసీ వరదల నిరోధానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేమిటని ప్రశ్నించగా.. దీనిపై ఇప్పటికే పనిచేస్తున్నామని, త్వరలో ఫలితం కనిపిస్తుందని చెప్పారు. ఆర్టీసీ బస్సుల్లోనూ ఆన్‌లైన్‌ పేమెంట్‌ ఉంటే బాగుంటుందని మరొక నెటిజన్‌ అభిప్రాయపడగా..మంత్రి పువ్వాడ అజయ్‌కు సూచిస్తానని కేటీఆర్‌ చెప్పారు.


హిందీ ‘రుద్దుడు’ నచ్చదు

‘‘ప్రధాని మోదీ తెలంగాణకు వచ్చినప్పుడు సీఎం కేసీఆర్‌ ఎందుకు ఆహ్వానించలేదు?  తెలంగాణ ముఖ్యమంత్రి ప్రధాని కన్నా ఉన్నత వ్యక్తా? (హిందీలో బదులివ్వండి)’’ ..అంటూ వారాణసీకి చెందిన శని మిశ్రా అనే పాత్రికేయుడు కేటీఆర్‌ను ప్రశ్నించారు. దీనికి కేటీఆర్‌.. ‘‘ప్రొటోకాల్‌ను స్పష్టంగా పాటిస్తున్నాం. ప్రధాని వ్యక్తిగత పర్యటనకు వచ్చినప్పుడు సీఎం ఆయనకు స్వాగతం పలకనక్కర్లేదు’’ అని సమాధానమిచ్చారు. అక్కడితో ఆగకుండా.. ‘‘అన్నట్టు.. మాకు హిందీ ‘రుద్దుడు’ నచ్చదు’’ అంటూ ఇంగ్లిష్‌లో అడిగిన ప్రశ్నకు ఇంగ్లిష్‌లోనే సమాధానమిచ్చి, చివర్లో సున్నితంగా వాతపెట్టారు.


డీపీని కాదు.. జీడీపీని మార్చాలి ప్రధాని మోదీకి మంత్రి కేటీఆర్‌ సలహా

పంద్రాగస్టు నేపథ్యంలో దేశప్రజలంతా మూడు రంగుల జెండాను సామాజిక మాధ్యమాల్లో డిస్‌ప్లే పిక్చర్‌(డీపీ)గా పెట్టుకోవాలంటూ ప్రధాని పిలుపు ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై ఒక నెటిజన్‌.. ‘‘జాతీయ జెండాను వాట్సాప్‌ ప్రొఫైల్‌ పిక్‌గా పెడితే జీడీపీ మారుతుందా?’’ అని ప్రశ్నించగా.. ‘‘డీపీ మారిస్తే ఏమవుతుంది? జీడీపీ మారితేనే దేశం ముందుకెళ్తుంది’’ అని కేటీఆర్‌ బదులిచ్చారు. అలాగే.. ‘‘రూపాయి పతనానికి కారణమైన కేంద్రానికి మీ సూచన.?’’ అని మరోనెటిజన్‌ అడిగిన ప్రశ్నకు.. ‘‘విపక్ష ప్రభుత్వాలను పడగొట్టడంపై కాదు. పడుతున్న రూపాయిపై దృష్టి పెట్టండి మోదీజీ’’ అని సమాధానమిచ్చారు.

Updated Date - 2022-08-06T08:17:52+05:30 IST