పీవోపీ విగ్రహాలపై నిషేధం లేదు

ABN , First Publish Date - 2022-07-22T16:24:40+05:30 IST

వినాయక చతుర్థి ఉత్సవాలు సమీపిస్తున్న నేపథ్యంలో విగ్రహాల తయారీ, నిమజ్జనంపై హైకోర్టు గురువారం కీలక నిర్ణయాలను వెలువరించింది

పీవోపీ విగ్రహాలపై నిషేధం లేదు

అమ్మకం, ఎత్తుపై ఆంక్షలు లేవు

ప్రధాన జలాశయాల్లో మాత్రం  నిమజ్జనం వద్దు

గణేశ్‌ విగ్రహాలపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు


హైదరాబాద్‌: వినాయక చతుర్థి ఉత్సవాలు సమీపిస్తున్న నేపథ్యంలో విగ్రహాల తయారీ, నిమజ్జనంపై హైకోర్టు గురువారం కీలక నిర్ణయాలను వెలువరించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌, జస్టిస్‌ సూరేపల్లి నందాతో కూడిన ధర్మాసనం పలు విషయాలపై స్పష్టత ఇచ్చింది. ప్రస్తుతానికి ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌(పీవోపీ)తో గణేశ్‌ విగ్రహాల తయారీపై ఎటువంటి నిషేధం లేదని తెలిపింది. పీవోపీ విగ్రహాలను తయారు చేసుకోవచ్చని, అమ్ముకోవచ్చని స్పష్టం చేసింది. ఆ తరహా విగ్రహాలను హుస్సేన్‌సాగర్‌ సహా ఇతర ప్రధాన జలాశయాల్లో మాత్రం నిమజ్జనం చేయరాదని తెలిపింది. జీహెచ్‌ఎంసీ నిర్మించినట్లు చెబుతున్న బేబీ పాండ్స్‌లో మాత్రమే నిమజ్జనం చేయాలని పేర్కొంది. విగ్రహాల ఎత్తుపైనా ఎలాంటి ఆంక్షలు లేవని తెలిపింది.  

పీవోపీ విగ్రహాలను నిషేధించాలని, వాటిని ప్రధాన జలాశయాల్లో నిమజ్జనం చేయరాదని పేర్కొంటూ కేంద్ర కాలుష్య నివారణ బోర్డు(సెంట్రల్‌ పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు- సీపీసీబీ) సవరించిన మార్గదర్శకాలను జారీ చేసింది. దీనిని సవాల్‌ చేస్తూ తెలంగాణ గణేశ్‌ మూర్తి కళాకారుల సంఘం, లోథ్‌ క్షత్రియ సదార్‌ పంచాయత్‌, ఇతర తయారీదారులు హైకోర్టులో పిటిషన్‌లు దాఖలు చేశారు. పిటిషనర్ల తరఫున న్యాయవాది ఎం.వి. దుర్గాప్రసాద్‌ వాదనలు వినిపిస్తూ.. పీవోపీ విగ్రహాల తయారీని అడ్డుకుంటే కళాకారుల ఉపాధి దెబ్బతింటుందని తెలిపారు. ఈ మార్గదర్శకాలను అడ్డం పెట్టుకొని వీటిని తయారు చేయకూడదని పోలీసులు ఒత్తిడి చేయడం రాజ్యాంగ హక్కులకు భంగకరమని చెప్పారు. హైకోర్టు కూడా గతంలో ఇచ్చిన ఉత్తర్వుల్లో పీవోపీ విగ్రహాలను నిషేధించాలని చెప్పలేదని, నిమజ్జనానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని మాత్రమే సూచించిందని వాదనలు నమోదు చేసుకున్న ధర్మాసనం.. ఈ వివాదంలో చట్టబద్ధంగా తేల్చాల్సిన న్యాయపరమైన అంశాలు చాలా ఉన్నాయని తెలిపింది. అయితే గణేశ్‌ చతుర్థి ఆగస్టు 31వ తేదీనే ఉన్నందున మధ్యంతర ఆదేశాలు జారీచేస్తున్నామని పేర్కొంది. సీపీసీబీ ఇచ్చిన మార్గదర్శకాల అమలుపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి జీవోలు జారీ చేయనందున విగ్రహాల తయారీ, విక్రయాలు, నిమజ్జనంపై ఎలాంటి నిషేధాలు విధించలేదని తెలుస్తోందని పేర్కొంది. హైకోర్టు సూచనల ప్రకారం ఈ మార్గదర్శకాలపై మార్చి 31లోగానే ప్రభుత్వం జీవోలు ఇవ్వాల్సి ఉన్నా దాన్ని ఆచరించలేదని తెలిపింది. సీపీసీబీ మార్గదర్శకాల చట్టబద్ధత, అమలు చేయాల్సిన బాధ్యత (బైండింగ్‌ ఎఫెక్ట్‌) వంటి అంశాలను సమీక్షించాల్సి ఉంటుందని తెలిపింది. గతంలో హైకోర్టు ఆదేశించిన విధంగా విగ్రహాలను మాత్రం ప్రధాన జలాశయాల్లో కాకుండా బేబీ పాండ్స్‌లోనే నిమజ్జనం చేయాలని సూచించింది. తదుపరి విచారణను సెప్టెంబర్‌ 15కు వాయిదా వేసింది. 

Updated Date - 2022-07-22T16:24:40+05:30 IST