ఉపాధి ఉంది.. కూలి లేదు...

ABN , First Publish Date - 2022-05-06T05:18:14+05:30 IST

ఉపాధి పనులు ఐదు వారాలుగా చేస్తున్నా.. వారికి సంబంధించిన కూలి డబ్బులు మాత్రం ఖాతాలో పడటం లేదు.

ఉపాధి ఉంది.. కూలి లేదు...
పెద్దపాళ్యం పంచాయతీ గోళ్ళపల్లె సమీపంలో ఫారంపాండ్‌ పనులు చేస్తున్న కూలీలు

ఐదు వారాలుగా అందని బిల్లులు...

డబ్బులు ఎప్పుడు పడతాయోనని ఎదురు చూపులు

తంబళ్లపల్లె నియోజకవర్గంలో రూ.2.40 కోట్ల బకాయిలు 

అన్నమయ్య జిల్లా అంతా ఇదే పరిస్థితి


ఉపాధి పనులు ఐదు వారాలుగా చేస్తున్నా.. వారికి సంబంధించిన కూలి డబ్బులు మాత్రం ఖాతాలో పడటం లేదు. కూలిపైనే ఆధారపడి జీవిస్తున్న వారు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. బయట అప్పులు చేసి ఇల్లు గడుపుకోవాల్సి వస్తోందని ఆవేదన చెందుతున్నారు. మార్చి 27వ తేదీ నుంచి ఇప్పటివరకు చేసిన పనులకు డబ్బులు రాలేదు. నియోజకవర్గ వ్యాప్తంగా రూ.2.40 కోట్ల రూపాయలు డబ్బులు రావాల్సి ఉందని అధికారులు తెలిపారు.


ములకలచెరువు, మే 5: గ్రామీణ ఉపాధి హామీ పథకం కూలీలకు తిప్పలు తప్పడం లేదు. ఐదు వారాలుగా పనులు చేస్తున్నా.. ఖాతాల్లోకి కూలీ డబ్బులు జమ కావడం లేదు. దీంతో బిల్లులు ఎప్పుడు పడతాయోనని కూలీలు ఎదురు చూస్తున్నారు. తంబళ్లపల్లె నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో రూ.2.40 కోట్లు కూలీలకు అందాల్సి ఉంది. మండుటెండలో కష్టపడి పనిచేస్తున్నా కూలీలకు సకాలంలో డబ్బులు రావడం లేదు. రాష్ట్రంలోనే వెనకబడిన నియోజకవర్గంగా పేరొందిన తంబళ్లపల్లెలో గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. నియోజవర్గంలోని ములకలచెరువు, కురబలకోట, బి.కొత్తకోట, పెద్దమండ్యం, పెద్దతిప్పసముద్రం, తంబళ్లపల్లె మండలాల్లో ప్రతిరోజూ 18 వేల మంది వరకు ఉపాధి హామీ పనులు చేస్తున్నారు. ఉపాధి పనులు చేస్తున్న కూలీలకు ఐదు వారాలుగా వేతనాలు అందడం లేదు. ఈ ఏడాది మార్చి 27వ తేదీ చివరిగా పనులు చేసిన కూలీల ఖాతాల్లోకి బిల్లులు పడ్డాయి. అప్పటి నుంచి ఇప్పటివరకు వరకు 39 రోజులుగా కూలీలకు బిల్లులు రాలేదు. ప్రతిరోజూ పనులు చేస్తున్నా డబ్బులు ఖాతాల్లోకి పడకపోవడంతో కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కూలీకెళితే గానీ పూట గడవని వారు పడుతున్న అవస్థలు వర్ణణాతీతంగా మారాయి. ఇంట్లో జరక్క బయట అప్పులు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. బిల్లుల కోసం ఉపాధి హామీ కార్యాలయాల చుట్టూ కాళ్ళరిగేలా తిరుగుతున్నారు. అన్నమయ్య జిల్లా అంతటా ఉపాధి కూలీలకు వేతనాలు అందక ఇబ్బందులు పడుతున్నారు. 


1,15,416 పనిదినాలకు...రూ.2.40 కోట్లు బకాయిలు

తంబళ్లపల్లె నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో 1,15,416 పనిదినాలకు రూ.2.40 కోట్లు కూలీలకు వేతనం అందాల్సి ఉంది. బి.కొత్తకోట మండలంలో 11,660 పని దినాలకు రూ.26.91 లక్షలు, కురబలకోటలో 11,922 పనిదినాలకు రూ.25.81 లక్షలు, ములకలచెరువులో 29,428 పనిదినాలకు రూ.70.26 లక్షలు, పెద్దమండ్యంలో 29,323 పనిదినాలకు రూ.50.76 లక్షలు, పెద్దతిప్పసముద్రంలో 12,385 పనిదినాలకు రూ.25.03 లక్షలు, తంబళ్లపల్లెలో 20,698 పనిదినాలకు రూ.40.09 లక్షలు బిల్లులు నిలిచిపోయాయి. 


నీడ లేదు...ప్రథమ చికిత్స కిట్లు కానరావు

ఉపాధి హామీ పనులు చేసేచోట కూలీలకు నీడ కరువైంది. అలాగే కూలీలు ప్రమాదాలకు గురైతే ప్రథమ చికిత్స కిట్లు అందుబాటులో లేవు. కేంద్రం ప్రతిరోజూ పనులు చేసే కూలీలకు తాగునీటికి రూ.5, పార, గడ్డపార ఉన్న వారికి రూ.10, గంపకు రూ.4 ఇచ్చేది. ఈ నగదును గత ఏడాది నవంబరు నుంచి నిలిపివేసింది. ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు, మజ్జిగ సదుపాయాలు పని ప్రదేశాల్లో కనిపించడం లేదని పలువురు కూలీలు చెబుతున్నారు. 


అదనపు భత్యం మరిచారు

ఏటా కూలీలకు వేసవిలో ఇచ్చే అదనపు భత్యం ఈసారి ఇవ్వలేదు. ఫిబ్రవరిలో 20 శాతం, మార్చిలో 25 శాతం, ఏప్రిల్‌లో 30 శాతం అదనంగా ఇచ్చేవారు. ఈ ఏడాది అదనపు వేతనాన్ని నిలిపివేయడంతో మండుటెండలో చేస్తున్న పనులకు తగిన ప్రతిఫలం అందడం లేదని పలువురు కూలీలు అంటున్నారు.   


ఆరు రోజుల్లోపు కూలీల ఖాతాల్లోకి నగదు జమ

- మధుబాబు, డ్వామా ఏపీడీ, ములకలచెరువు క్లస్టర్‌ 

ఉపాధి కూలీలకు వేతనాలు మంజూరయ్యాయి. నాలుగు నుంచి ఆరు రోజుల్లోగా పనిచేసిన కూలీల ఖాతాల్లోకి నగదు జమ అవుతుంది. ఆర్థిక సంవత్సరం ప్రారంభం కావడంతో ఉపాధి కూలీలకు ఐదు వారాలుగా వేతనం అందలేదు. పని అడిగిన చోట కూలీలకు పనులు కల్పిస్తాము. నియోజకవర్గంలో 30 వేల మందికి పని కల్పించేలా ప్రణాళికలు సిద్ధం చేశాం. 

Read more