Abn logo
Jul 28 2021 @ 01:27AM

పొంచి ఉన్న ముప్పు

వెలిగొండ వద్ద ఇంజనీరింగ్‌ అధికారులతో మాట్లాడుతున్న టీడీపీ నాయకుల బృందం

వెలిగొండలో  లీకేజీపై ఆందోళన

ఆ నీరు పొలాలపై పడే ప్రమాదం 

రెండో టన్నెల్‌ తవ్వకం పనులకూ ఆటంకం

సూటిగా స్పందించని పాలక పెద్దలు, అధికారులు

ప్రస్తుతానికి వెలిగొండ ప్రాజెక్టులో నీటి లీకేజీ వ్యవహారం సాదాసీదాగా కనిపిస్తున్నా భవిష్యత్తులో పొంచి ఉన్న ప్రమాదాన్ని తేటతెల్లం చేస్తోంది. అసలేం జరిగింది.. మున్ముందు  ఏమి జరగబోతోంది.. అన్న  అంశాన్ని పక్కనబెడితే ఈ లీకు విషయం  కలకలం సృష్టిస్తోంది. దీనిపై యావత్తు ప్రజానీకం ఆందోళన చెందుతుండగా, ప్రతిపక్ష టీడీపీ నాయకులు ప్రత్యక్ష పోరుకు సిద్ధమవుతున్నారు. అయితే పాలకపెద్దలు కానీ, అధికారులు కానీ ఆ వైపు చూసిన దాఖలాలు లేవు. లీకు విషయమై  కనీస సమాచారాన్ని తెలియజేసే ప్రకటన కూడా విడుదల చేయకపోవటం దురదృష్టకరం. దీంతో వెలిగొండ ప్రాజెక్టు టన్నెళ్ల నిర్మాణ ంలో ఏం జరుగుతోంది.. రెండు రాష్ర్టాల మధ్య నెలకొన్న జల వివాదం కూడా వెంటాడుతోందా.. అన్న అనుమానాలు ఆరంభమయ్యాయి. 

(ఆంధ్రజ్యోతి, ఒంగోలు) 

శ్రీశైలం రిజర్వాయర్‌లో నీటి నిల్వ 843 అడుగులకు వచ్చిన తర్వాత వెలిగొండ ప్రాజెక్టుకి నీరు విడుదల కావాల్సి ఉంది. ప్రస్తుతం 882 అడుగుల వరకు శ్రీశైలం ప్రాజెక్టుకి నీరు చేరింది. సహజంగా ఇలాంటి సందర్భాలలో శ్రీశైలం రిజర్వాయర్‌ నుంచి కుడి, ఎడమ విద్యుత్‌ కేంద్రాల ద్వారా నీరు వదలటం జరుగుతుంది. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ర్టాల మధ్య జరుగుతున్న వివాదం వలన కాబోలు నీటి విడుదల జరగలేదు. ఈ సమయంలో వెలిగొండ ప్రాజెక్టులోకి వరద నీరు ప్రవేశించింది. వెలిగొండ ప్రాజెక్టు టన్నెల్‌-1 పనులు పూర్తికాగా రెండో టన్నెల్‌ తవ్వకం కూడా చేపట్టి డిసెంబరు నాటికి నీటిని విడుదల చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. అందుకనుగుణంగా జరుగుతున్న రెండవ టన్నెల్‌ తవ్వకాల పనులకు అనువుగా ఉండేందుకుగాను మొదటి టన్నెల్‌ 16వ కిలోమీటరు వద్ద నుంచి రెండో టన్నెల్‌ తవ్వకాల పనుల్లోకి వెళ్లే విధంగా ఒక మార్గాన్ని ఏర్పాటుచేశారు. ఇది ప్రాజెక్టు సొరంగాల తవ్వకాల ప్రణాళికలో లేదు. ఇప్పుడు కారణం ఏమైనా మొదటి టన్నెల్‌లోకి ప్రవేశించిన నీరు ఈ సొరంగం ద్వారా రెండవ టన్నెల్‌వైపు వెళ్లటంతో అక్కడ తవ్వకాల పనులకు ఆటంకం కలిగే పరిస్థితి ఎదురైంది. అదే విధంగా తవ్వకాల కోసం అక్కడ నిల్వ ఉంచిన యంత్ర సామగ్రి కూడా దెబ్బతినవచ్చని ఇంజనీరింగ్‌ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 


గ్రామాలకు ముంపు భయం

మరోవైపు చూస్తే ప్రస్తుతానికి వచ్చిన ఈ నీటితో సొరంగం ప్రారంభమయ్యే దోర్నాల మండలం కొత్తూరు సమీప గ్రామాలకు ఇంకో రకమైన ప్రమాదం పొంచి ఉంది. ప్రస్తుతానికి వస్తున్న ఈ నీటిని గంటవానిపల్లి సాగునీటి చెరువుకి మళ్లించారు. మంగళవారం మధ్యాహ్నానికే ఆ సాగునీటి చెరువు నిండిపోయింది. తదనంతరం ఈ నీటిని ఎటు మళ్లించాలో కూడా అధికారులు ఆలోచించిన దాఖలాలు కనిపించటం లేదు. ఆ సాగునీటి చెరువు కట్టలకు గండ్లుపడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మరోవైపు ఈ నీటిని మళ్లించకపోతే పొంగిపొర్లటం ఖాయం. సమీప గ్రామాలను నీటి ముంపునకు గురిచేయకపోయినా సమీప పంట పొలాలను ఈ నీటి ముంపు దెబ్బతీసే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. కాగా రెండు రాష్ర్టాల మధ్య జరుగుతున్న వివాదంతో శ్రీశైలం డ్యామ్‌ నుంచి వరదనీటిని కిందకు వదలకపోతే వెలిగొండవైపు మరింత ఉధృతంగా నీటి ప్రవాహం వచ్చే అవకాశం ఉంది. దీంతో అన్నివైపులా ప్రమాదం పొంచి ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ కదలికలను పరిశీలిస్తే తీవ్ర నిర్లక్ష్యంగా ఉన్నాయి. అధికార పార్టీకి చెందిన ప్రముఖులెవ్వరూ ఈ రోజు ఆ వైౖపునకు వెళ్లిన దాఖలాలు లేవు. మామూలుగా అయితే ఇలాంటి పరిస్థితుల్లో సంబంధిత శాఖమంత్రే తరలిరావాలి. కాకున్నా జలవనరుల శాఖ ఉన్నతాధికారులు ఆ ప్రాంతాన్ని సందర్శించాలి. అవి రెండూ జరగలేదు. జిల్లాకు చెందిన పాలక ప్రభువులు కానీ, అధికారులు కానీ ఆ వైపు వెళ్లకపోగా కనీస సమాచార ప్రకటన కూడా ఇవ్వలేదు. 


మభ్యపెట్టేందుకే రెండు సొరంగాల మెలిక

ఆరోపించిన టీడీపీ నాయకుల బృందం

 మొదటి సొరంగం ద్వారా నీటిని ఇచ్చే అవకాశమున్నా ప్రభుత్వం ఇవ్వకుండా రెండో సొరంగం నిర్మాణం పనుల సాకుతో ప్రజలను మభ్యపెడుతోందని టీడీపీ బృందం ఆరోపించింది. శ్రీశైలం డ్యాంలోని కృష్ణా నది వరద నీరు ఆదివారం రాత్రి నుంచి హెడ్‌ రెగ్యులేటర్‌ లీకుల ద్వారా మండలంలోని కొత్తూరు వద్ద నిర్మిస్తున్న వెలిగొండ ప్రాజెక్టు మొదటి సొరంగం నుంచి బయటకు ప్రవహిస్తోన్న విషయం తెలిసిందే. ఈక్రమంలో ప్రాజెక్టు నిర్మాణంలో తలెత్తిన సమస్యలను పరిశీలించేందుకుతెలుగుదేశం పార్టీ నాయకుల బృందం వచ్చింది. ఒంగోలు పార్లమెంటు అధ్యక్షులు నూకసాని బాలాజీ, కొండపి ఎమ్మెల్యే డోలా వీరాంజనేయ స్వామి, మార్కాపురం, గిద్దలూరు మాజీ శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి, ముత్తుముల అశోక్‌రెడ్డి, దర్శి, వైపాలెం ఇన్‌చార్జిలు పమిడి రమేష్‌, గూడూరి ఎరిక్షన్‌ బాబు తదితర నాయకులు మంగళవారం టన్నెల్‌ వద్దకు చేరుకున్నారు. అక్కడ పరిస్థితులను పరిశీలిస్తే మూడు అడుగుల మేర నీరు నిల్వ ఉండటం, సొరంగం నిర్మాణం పనులకు సంబంధించిన వస్తు సామగ్రి మొత్తం నీటిలో మునిగిపోయి ఉండటం గమనించారు. అనంతరం ప్రాజెక్టు ఈఈ అబూతాలిమ్‌తో నూకసాని బాలాజీ మాట్లాడుతూ రెండు సొరంగాల మెలిక లేకుండా మొదటి సొరంగం ద్వారా నీటిని విడుదల చేసి ఉంటే రిజర్వాయర్లు నిండి భూగర్భజలాలు పెరిగేవని అన్నారు. మొదటి సొరంగం పనులు పూర్తయినా నీటిని ఎందుకు ఇవ్వలేకపోయారని, మొదటి, రెండో సొరంగాలను కలుపుతూ ఎందుకు అప్రోచ్‌ కాలువ తవ్వారని ప్రశ్నించారు. హెడ్‌ రెగ్యులేటర్‌ ఏర్పాటులో నాణ్యతా ప్రమాణాలు లోపించడం వల్లనే వరదనీరు టన్నెల్లోకి వస్తోంది కదా అంటూ కందుల, ముత్తుముల ప్రశ్నించారు. దీంతో ఈఈ అబూతాలిమ్‌ మాట్లాడుతూ రెండు టన్నెళ్లు త్వరితగతిన పూర్తిచేయాలని ప్రభుత్వం భావించిందని, ఈలోగా వరద నీరు వస్తోందని తెలిపారు. అయినా ప్రత్యేక నిపుణుల బృందంతో పటిష్ట చర్యలు చేపట్టి, పనులు వేగవంతం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ మండలాధ్యక్షులు అంబటి వీరారెడ్డి, నాయకులు షేక్‌ మాబు, బట్టు సుధాకర్‌రెడ్డి, షేక్‌ సమ్మద్‌భాష, ఈదర మల్లయ్య, దొడ్డా శేషాద్రి, ఏరువ మల్లికార్జునరెడ్డి, గొట్టం శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.