ఆసిఫాబాద్‌ జిల్లాలో పశువైద్యుల కొరత

ABN , First Publish Date - 2022-09-30T04:07:11+05:30 IST

జిల్లాలోని పశువైద్యశాలల్లో వైద్యుల కొరత తీవ్రంగా ఉంది. వానాకాలం సీజన్‌లో పశువులు రోగాల బారినపడే అవకాశం ఎక్కువగా ఉంది. ఎప్పటిలాగే ప్రభుత్వం నుంచి అన్నిరకాల మందులు సరఫరా లేకపోతే పెంపకందారులపై ఆర్థిక భారం పడనుంది. జిల్లాలోని పశువైద్యశాలల్లో సరిపడా సిబ్బంది, సౌకర్యాలు లేకపోవడంతో పశువులకు సరైన వైద్యం అందడం లేదు. దీంతో పశువులు మృత్యువాత పడుతున్నాయి.

ఆసిఫాబాద్‌ జిల్లాలో పశువైద్యుల కొరత
బెజ్జూరులోని పశువైద్యశాల

- అందని మెరుగైన వైద్యం

- పశువులను పట్టణాలకు తీసుకెళ్తున్న రైతులు

- ఆర్థిక భారం, శ్రమ పడాల్సి వస్తోందంటూ ఆవేధన

- పశు వైద్యులను భర్తీ చేయాలని వేడుకోలు

బెజ్జూరు, సెప్టెంబరు 29: జిల్లాలోని పశువైద్యశాలల్లో వైద్యుల కొరత తీవ్రంగా ఉంది. వానాకాలం సీజన్‌లో పశువులు రోగాల బారినపడే అవకాశం ఎక్కువగా ఉంది. ఎప్పటిలాగే ప్రభుత్వం నుంచి అన్నిరకాల మందులు సరఫరా లేకపోతే పెంపకందారులపై ఆర్థిక భారం పడనుంది. జిల్లాలోని పశువైద్యశాలల్లో సరిపడా సిబ్బంది, సౌకర్యాలు లేకపోవడంతో పశువులకు సరైన వైద్యం అందడం లేదు. దీంతో పశువులు మృత్యువాత పడుతున్నాయి. పశువైద్యశాలల్లో వైద్యుల భర్తీ లేని కారణంగా రైతులు పశువులను పట్టణాలకు తీసుకవెళ్తున్నారు. ముఖ్యంగా వానా కాలంలో పశువులకు జబ్బవాపు, గుండెవాపు, గొంతువాపుతో పాటు ఇతర రకాల వ్యాధులు ఎక్కువగా వ్యాప్తి చెందుతాయి. వర్షాలు అధికంగా కురవడం, పరిసరాలు శుభ్రంగా లేని కారణంగా పశువుల్లో వ్యాధులు పెరుగుతున్నాయి. ఆస్పత్రుల్లో మందులున్నా అవి ఇచ్చే వారు లేని కారణంగా పశువులు మృత్యు వాత పడుతున్నాయని రైతులు, పెంపకందారులు ఆందోళన చెందుతున్నారు. 

జిల్లాలోని పరిస్థితి

జిల్లాలోని పదిహేను మండలాల పరిధిలో 19 పశువైద్యశాలలు ఉన్నాయి. ఇందులో 7సబ్‌సెంటర్లు ఉండగా ఇప్పటికే సిబ్బంది లేని కారణంగా ఐదు సబ్‌ సెంటర్లు మూతపడ్డాయి. 19పశువైద్యశాలల్లో కేవలం పదిమంది మాత్రమే పని చేస్తుండగా మిగితా 9మంది వైద్యుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటితోపాటు ఇతర పోస్టులు సైతం ఖాళీలే ఉన్నాయి. వెటర్నరీ అసిస్టెంట్లు 17ఉండాల్సి ఉండగా రెండు ఖాళీగా ఉన్నాయి. జేవీవోలు 4ఉండాల్సి ఉండగా ఒక్కటి ఖాళీగా ఉంది. అటెండర్లు 34మంది ఉండాల్సి ఉంది. అయితే 24మంది మాత్రమే పని చేస్తున్నారు. అలాగే జిల్లాలో తెల్లజాతి ఆవులు 293845, గేదెలు 46374, గొర్రెలు 159349, మేకలు 256854 మూగజీవాలు ఉన్నాయి. ప్రభుత్వం వైద్యుల భర్తీ లేని కారణంగా జిల్లాలో పశువులకు సరైనవైద్యం అందడం లేదు. గతంలో వైద్యశా లల్లో మందుల కొరత కూడా తీవ్రంగా ఉండేది. ప్రస్తుతం మందుల కొరత లేకున్నా డాక్టర్లు లేక ఆస్పత్రులు నిరుపయోగంగా మారాయన్న ఆరోపణలు న్నాయి. ప్రభుత్వం పశుపెంపకందారులకు అనేక పథకాలు ప్రవేశపెడుతు న్నామని చెబుతున్నా ఆచరణలో అమలు కావడం లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రైతులకు ఇబ్బందులు

వైద్య సిబ్బంది కొరతతో గ్రామాల్లో అనారోగ్యంగా ఉన్న పశువులకు వైద్యం అందించాలంటే రైతులకు తిప్పలు తప్పడం లేదు. మండల కేంద్రాల్లో ఉన్న పశు వైద్యశాలలకు తీసుకుపోదామంటే వైద్యులు లేని పరిస్థితి నెలకొంది. తప్పనిసరి పరిస్థితుల్లో పశువులను పట్టణప్రాంతాలకు తీసుక వెళ్లాల్సి వస్తోందని ఆవేదన చెందుతున్నారు. వైద్యం కోసం పట్టణాలకు పోదామంటే ప్రత్యేకంగా పశువులను వాహనంలో తీసుకెళ్లాల్సి వస్తోందని దీంతోఖర్చులు కూడా అధికమవుతున్నాయని వాపోతున్నారు. ఇప్పటికే గ్రామాల్లో వాణిజ్యపంటల సాగు కారణంగా పశువులకు మేత కూడా దొరకని పరిస్థితులు ఉన్నాయి. వాటిని సాకడం కష్టంగా మారుతున్న నేపథ్యంలో పశువులకు జబ్బులు సోకితే మరింత కష్టంగా ఉందని వాపోతు న్నారు. ఆస్పత్రుల్లో వైద్యులు లేని కారణంగా పశుపోషణ భారంగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పశువైద్యశాలల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని కోరుతున్నారు.

ప్రతిపాదనలు పంపాం

- సురేష్‌, జిల్లా పశువైద్యాధికారి, ఆసిఫాబాద్‌

జిల్లాలోని పశు వైద్యశాలల్లో వైద్యుల పోస్టుల భర్తీకి ఐదేళ్లుగా ప్రతిపాదనలు పంపిస్తూనే ఉన్నాం. జిల్లాలో మందుల కొరతలేదు. గ్రామాల్లో ఉన్న తమ సిబ్బందితో పశువైద్య శిబిరాలు నిర్వహించి పశువులకు టీకాలు వేస్తున్నాం. వైద్యుల కొరత ఉన్నమాట వాస్తవమే. భర్తీ ప్రక్రియ ప్రభుత్వం చేతుల్లో ఉంది. వీలైనంతగా పశువులకు వైద్యం అందేలా చర్యలు తీసుకుంటాం. పశువైద్యశాలల్లో వైద్యులు లేని కారణంగా పశువులకు వైద్యం కొంతమేర అందడం లేదన్నది వాస్తవమే.

ఇబ్బందులు పడుతున్నాం

- రామడుగు నారాయణ, ఎల్కపల్లి

గ్రామాల్లో పశువులకు సరైన వైద్యసేవలు అందని కారణంగా ఇబ్బందులు పడుతున్నాం. ఆస్పత్రుల్లో పశువులను తీసుకు వెళ్తే వైద్యం అదడం లేదు. దీంతో వైద్యం కోసం నాటు మందులను ఆశ్రయించాల్సి వస్తోంది. అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకొని పశుసంపదను రక్షించాలి. ఖాళీ పోస్టుల్లో డాక్టర్లను భర్తీ చేయాలి.

Updated Date - 2022-09-30T04:07:11+05:30 IST