అసలే కొరత.. ఆపై సర్దుబాటా?

ABN , First Publish Date - 2022-08-14T05:14:07+05:30 IST

‘ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తున్నాం.. వైద్యరంగానికి కోట్లాది రుపాయలు కేటాయిస్తున్నాం’ అని గొప్పలు చెప్పుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం ప్రకటనలకే పరిమిత మవుతోంది.

అసలే కొరత.. ఆపై సర్దుబాటా?
పార్వతీపురం మండలంలో పెదబొండపల్లి పీహెచ్‌సీ

   104 వాహనాలకు పీహెచ్‌సీ వైద్యులు 

  ‘ఫ్యామిలీ డాక్టర్‌’ పేరిట సర్కారు హడావుడి

  జిల్లాలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను వెంటాడుతున్న వైద్యుల కొరత

  రోగులకు అరకొరగానే సేవలు

    ప్రభుత్వ తీరుపై విమర్శల వెల్లువ

(పార్వతీపురం - ఆంధ్రజ్యోతి)

‘ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తున్నాం..  వైద్యరంగానికి కోట్లాది రుపాయలు కేటాయిస్తున్నాం’ అని గొప్పలు చెప్పుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం ప్రకటనలకే పరిమిత మవుతోంది. ఆచరణలో మాత్రం భిన్నంగా వ్యవహరి స్తోంది. పీహెచ్‌సీలను నిర్వీర్యం చేసే విధంగా  అడుగులు వేస్తుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.   ఈ నెల 15 నుంచి 104 మొబైల్‌ వాహనంలో ‘ఫ్యామిలీ డాక్టర్‌’ను ప్రభుత్వం అందుబాటులోకి తేనుంది. పీహెచ్‌సీల్లో ఒక వైద్యుడి సర్దుబాటు చేసి.. ఈ వాహనం ద్వారా నేరుగా ఇంటివద్దే రోగులకు వైద్యసేవలు అందజేయనున్నట్టు ప్రకటించింది. ఇప్పటికే  ఆదేశాలు జారీ చేసింది.    ప్రస్తుతం జిల్లాలో పీహెచ్‌సీలను వైద్యుల కొరత వెంటా డుతోంది. కొన్ని పీహెచ్‌సీలు డిప్యూటేషన్లపై నడుస్తు న్నాయి. ఈ సమయంలో కొత్తగా డాక్టర్లును నియమిం చాల్సింది పోయి.. ఉన్న డాక్టర్లను 104 వాహనంలో సర్దుబాటు చేయడమేమిటన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది.

ఇదీ పరిస్థితి.. 

 జిల్లాలో 37 పీహెచ్‌సీలు ఉన్నాయి. 33 పీహెచ్‌సీలు 24 గంటలు వైద్య సేవలందించే ఆసుపత్రులుగా అప్‌గ్రేడ్‌ అయ్యాయి. అయితే జిల్లాలోని ఏ ఒక్క పీహెచ్‌సీలోనూ ముగ్గురేసి వైద్యులు లేరు.  మొత్తంగా 37 పీహెచ్‌సీల్లో 101 మంది వైద్యులు ఉండాల్సి ఉండగా,   కేవలం 64 మందే ఉన్నారు. జిల్లాలోని భామిని మండలం బత్తిలి, గుమ్మలక్ష్మీపురం మండలం దుడ్డుఖల్లు, రేగిడి పీహెచ్‌సీ ల్లో వైద్యుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కనీసం ఒక్క వైద్యుడైనా పూర్తిస్థాయిలో లేరు. దీంతో ఇతర పీహెచ్‌సీల్లో పనిచేస్తున్న వైద్యులను ఆ మూడు పీహెచ్‌సీలకు ఒక్కొక్కరిని చొప్పున డిప్యూటేషన్‌పై    నియమించారంటే జిల్లాలో వైద్యుల కొరత ఎలా ఉందో  అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వ లెక్కల ప్రకారం  37 పీహెచ్‌సీలకు  74 మంది వైద్యులు ఉండాలి. అయితే  ఇందులో 14 మంది లేరు. ఈ పోస్టులను ఎప్పుడు భర్తీ చేస్తారో తెలియని పరిస్థితి.  మొత్తంగా రోగులకు పూర్తి స్థాయిలో  వైద్యసేవలు అందడం లేదు. ఏజెన్సీలో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఈ నేపథ్యంలో వైద్యుల కొరత తీర్చాల్సిన రాష్ట్ర సర్కారు  పీహెచ్‌సీల్లో ఉన్న వైద్యులనే వాహనాల్లో సర్దుబాటు చేస్తుండడంపై ప్రజలు మండిపడుతున్నారు. 

   రోజుకు 15 మంది..   

‘ఫ్యామిలీ డాక్టర్‌’ పేరిట జిల్లాలో ఉన్న పదిహేను 104 వాహనాలకు  పీహెచ్‌సీల నుంచి రోజుకు  15 మంది వైద్యులను కేటాయించనున్నారు.  వారు ఇంటింటికీ వెళ్లి వైద్య సేవలు అందించాల్సి ఉంది. కాగా పీహెచ్‌సీల్లో మిగిలిన వైద్యులే రోగులకు వైద్యసేవలు అందించాలని అధికారులు చెబుతున్నారు.  ఉదాహరణకు పార్వతీపురం మండలం పెదబొండపల్లిలో ఇద్దరు వైద్యులు ఉన్నారు. ఇద్దరిలో ఒకరు 104కు వెళ్తే, మరొకరు పీహెచ్‌సీ ద్వారా సేవలందించాలి. అత్యవసర సమయాల్లో అధికారులు నిర్వహించే సమావేశాలకు పీహెచ్‌సీలో ఉన్న ఒక్క డాక్టర్‌ కూడా వెళ్తే ఆసుపత్రిలో ఎవరు వైద్య సేవలందిస్తారో వైద్యశాఖ ఉన్నతాధికారులే చెప్పాలి.  ప్రభుత్వం తక్షణమే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని జిల్లావాసులు డిమాండ్‌ చేస్తున్నారు. పీహెచ్‌సీల్లో పూర్తిస్థాయిలో  వైద్యులు, సిబ్బంది భర్తీకి చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. 

 పూర్తిస్థాయిలో వైద్య సేవలందిస్తాం

పీహెచ్‌సీల ద్వారా  పూర్తిస్థాయిలో వైద్య సేవలు అందిస్తాం. రోగులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటాం. ఫ్యామిలీ డాక్టర్‌ కార్యక్రమంలో భాగంగా 104 వాహనాలకు రోజుకు 15 మంది వైద్యులను కేటాయిస్తాం. 

 -డాక్టర్‌ బి.జగన్నాథరావు, డీఎంహెచ్‌వో


 

Updated Date - 2022-08-14T05:14:07+05:30 IST