పశు వైద్యం.. దైన్యం

ABN , First Publish Date - 2022-07-27T05:14:13+05:30 IST

జిల్లాలో పశు వైద్యాధికారుల కొరత తీవ్రంగా ఉంది. దీంతో అత్యవసర వేళల్లో మూగజీవాలకు పూర్తిస్థాయిలో వైద్యసేవలు అందడం లేదు.

పశు వైద్యం.. దైన్యం
చినమేరంగిలో శిథిలమైన పశు వైద్య చికిత్సాలయం

  వేధిస్తున్న పశు వైద్యాధికారుల కొరత

  శిథిలావస్థలో సగానికి పైగా పశు వైద్యశాలలు

  ఇబ్బందుల్లో పాడిరైతులు 

(జియ్యమ్మవలస)

జిల్లాలో పశు వైద్యాధికారుల కొరత తీవ్రంగా ఉంది. దీంతో అత్యవసర వేళల్లో మూగజీవాలకు పూర్తిస్థాయిలో వైద్యసేవలు అందడం లేదు. సంచార పశు వైద్యశాలల పేరుతో ప్రభుత్వం చేస్తున్న హడావుడిని పక్కన పడితే క్షేత్రస్థాయిలో పరిస్థితి దారుణంగా ఉంది. మన్యం జిల్లాలో సగానికి పైగా పశు వైద్యశాలలు శిథిలావస్థలో ఉన్నాయి. వాటిని పట్టించుకునే వారే కరువయ్యారు. సిబ్బంది బిక్కుబిక్కుమంటూ విధులు నిర్వహించాల్సి వస్తోంది. మరోవైపు అదనపు పనిభారంతో ఉన్న వైద్యాధికారులు తలలు పట్టుకుం టున్నారు. మొత్తంగా పాడి రైతులకు అవస్థలు తప్పడం లేదు. 

జిల్లాలో పార్వతీపురం, పాలకొండ డివిజన్ల పరిధిలో 15 మండలాలు ఉన్నాయి. వీటి పరిధిలో 2021-22   లెక్కల ప్రకారం  ఆవులు, ఎద్దులు 2.29 లక్షలు, గేదెలు 47 వేలు, గొర్రెలు 2.07 లక్షలు, మేకలు 1.73 లక్షలు, దేశీయ కోళ్లు 8.11 లక్షలు ఉన్నాయి. వాటికి సరైన వైద్య సేవలు అందించడానికి పశు వైద్యశాలలు (అసిస్టెంట్‌ డైరెక్టర్‌ స్థాయి) ఏడు, గ్రామీణ పశు వైద్య చికిత్సాలయాలు 38, సబ్‌ సెంటర్లు 35, రైతుభరోసా కేంద్రాలు 300 ఉన్నాయి. అవసరమైన మందులు ఉన్నాయి.  అటెండర్లు 70 మంది కావలసి ఉండగా, 22 మంది మాత్రమే ఉన్నారు. మరో 14 మంది ఔట్‌సోర్సింగ్‌లో పద్ధతిలో విధులు నిర్వహిస్తున్నారు.  51 మంది ఉన్న గోపాలమిత్రలను ఇప్పుడు ఆసుపత్రిలో తాత్కాలిక అటెండర్లుగా తీసుకున్నారు. అయితే వైద్యుల కొరత మాత్రం తీవ్రంగా వేధిస్తోంది. మెరుగైన వైద్య సేవలు అందించే పశు వైద్యశాలలు రెండు మండలాలకు ఒకటి చొప్పున ఉండగా, వాటికి కావలసిన ఏడుగురు పశు సంవర్థకశాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్లు ఉన్నారు. గ్రామీణ పశు వైద్య చికిత్సాలయాలు 38 ఉంటే 19 మంది పశు వైద్యాధికారులు ఉన్నారు. వీరిలో ఒక్కొక్కరు రెండేసీ గ్రామీణ పశు వైద్య చికిత్సాలయాల్లో వైద్య సేవలు అందించాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో వారు అదనపు పనిభారంతో  ఇబ్బందులు పడుతున్నారు. ఎవరైనా వైద్యాధికారి సెలవుపై వెళ్తే ఆ పరిధిలో ఉన్న ఆసుపత్రుల్లో వైద్య సేవలు ఇక అంతే. 

శిథిల భవనాల్లోనే...

గ్రామీణ పశు వైద్య చికిత్సాలయాలు, సబ్‌ సెంటర్ల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. చాలా ఏళ్ల కిందట నిర్మించిన భవనాలు  శిఽథిలావస్థకు చేరాయి.  ఎప్పుడు కూలుతాయో తెలియని పరిస్థితి.  దీంతో/ళౠ సిబ్బంది బిక్కుబిక్కుంటూ విధులు నిర్వహించాల్సి వస్తోంది.  జిల్లాలో 38 గ్రామీణ పశు వైద్య చికిత్సాలయాలు, 35 సబ్‌ సెంటర్ల భవనాల్లో సుమారు 80 శాతం భవనాలు పరిస్థితి ఇలాగే ఉంది. ప్రభుత్వం  స్పందించి   గ్రామీణ పశు వైద్య చికిత్సాలయాలు, సబ్‌ సెంటర్లు, నూతన భవన నిర్మాణాలు, పశు వైద్యుల నియామకంపై దృష్టి సారించాలని పాడి రైతులు కోరుతున్నారు.

ప్రభుత్వం దృష్టిలో ఉంది

 వైద్యుల కొరత విషయం ప్రభుత్వం దృష్టిలో ఉంది. నూతన భవనాల మంజూరు అంశం వచ్చే బడ్జెట్‌లో  పెట్టే అవకాశం ఉంది. సిబ్బంది కొరత ఉన్నా పూర్తిస్థాయిలో సేవలు అందిస్తున్నాం. 

- డాక్టర్‌ ఈశ్వరరావు, జేడీ, పశు సంవర్థకశాఖ, పార్వతీపురం

 

 

Updated Date - 2022-07-27T05:14:13+05:30 IST