వామపక్ష, లౌకికవాద ఐక్య కూటమి అవసరం

ABN , First Publish Date - 2022-08-19T05:45:54+05:30 IST

దేశంలో రాజ్యాంగ, ప్రజాస్వామ్య లౌకికవాద పరిరక్షణ కోసం వామపక్ష, లౌకికవాద ఐక్య కూటమి అవసరమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి అన్నారు.

వామపక్ష, లౌకికవాద ఐక్య కూటమి అవసరం
అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పిస్తున్న చాడ

- సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి

భగత్‌నగర్‌, ఆగస్టు 18: దేశంలో రాజ్యాంగ, ప్రజాస్వామ్య లౌకికవాద పరిరక్షణ కోసం వామపక్ష, లౌకికవాద ఐక్య కూటమి అవసరమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. గురువారం నగరంలోని కోతిరాంపూర్‌లో అన్నమనేని గార్డెన్స్‌లో భారత కమ్యూనిస్టు పార్టీ  22వ జిల్లా  మహాసభ నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ జెండాను ఆవిష్కరించి, అమరవీరులకు నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశంలో లౌకికవాదం లేకుండా బీజేపీ కుట్రలు పన్నుతుందన్నారు.  సీపీఐ శ్రేణులు బీజేపీ కుట్రలను తిప్పికొట్టేందుకు  ప్రజా ఉద్యమాలకు సిద్ధం కావాలన్నారు. కేంద్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ పాలన తీవ్ర ఆందోళనకరంగా ఉందన్నారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ రాసిన రాజ్యాంగాన్ని, అందులో చట్టాలను సవరిస్తు కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేక పాలన కొనసాగిస్తోందన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేసి, ప్రైవేట్‌ పరం చేయడం దుర్మార్గమైన చర్య అన్నారు. రాష్ట్రంలోముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కాలయాపన చేస్తున్నారన్నారు.    సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు కలవేని శంకర్‌ మాట్లాడుతూ పార్టీని బలోపేతం చేయడానికి గ్రామస్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు మహాసభలు నిర్వహిస్తున్నామన్నారు. సెప్టెంబరులో రాష్ట్ర మహాసభలు హైదరాబాద్‌లో, అక్టోబర్‌లో జాతీయ మహాసభలు విజయవాడలో జరుగుతాయన్నారు. రాష్ట్ర, జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ మహాసభలకు అధ్యక్షత వర్గంగా మర్రి వెంకటస్వామి, గూడెం లక్ష్మి, కసిరెడ్డి మణికంఠరెడ్డి వ్యవహరించారు. సమావేశంలో  సీపీఐ జిల్లా కార్యదర్శి పొనగంటి కేదారి,  సహాయ కార్యదర్శి కొయ్యడ సృజన్‌కుమార్‌, కూన శోభారాణి, బోయిని అశోక్‌, అందె స్వామి, గూడెం లక్ష్మి, టేకుమల్ల సమ్మయ్య, న్యాలపట్ల రాజు, బత్తుల బాబు, కసిరెడ్డి సురేందర్‌రెడ్డి పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-19T05:45:54+05:30 IST