పద్నాలుగేళ్లయింది పరిశ్రమ లేదు.. ఉద్యోగమూ రాలేదు

ABN , First Publish Date - 2022-09-23T05:22:27+05:30 IST

శృంగవరపుకోట మండలం కిల్తంపాలెం జేఎస్‌డబ్ల్యూ అల్యూమినియం లిమిటెడ్‌ (జిందాల్‌)కు 2008లో శృంగవరపుకోట మండల పరిధిలోని కిల్తంపాలెం, చిడిపాలెం, చినఖండేపల్లి, మూలబొడ్డవర, ముషిడిపల్లి గ్రామాల పరిధిలోని 834.66 ఎకరాలు అసైన్డ్‌ భూమి, 151.04 ఎకరాల ప్రభుత్వ భూమిని ప్రభుత్వం కేటాయించింది.

పద్నాలుగేళ్లయింది పరిశ్రమ లేదు.. ఉద్యోగమూ రాలేదు
ఎస్‌.కోట మండలంలో జిందాల్‌కు కేటాయించిన భూములు




2008లో జిందాల్‌ కోసం 985 ఎకరాలు సేకరణ
ఉద్యోగాలు ఇస్తామని రైతుల నుంచి భూ సేకరణ
రిటర్మెంట్‌ వయస్సుకు వచ్చేస్తున్న ఆర్‌.కార్డుదారులు
ఇప్పటికీ కొంతమందికి అందని పరిహారం
అధికారుల చుట్టూ తిరుగుతున్న బాధితులు


శృంగవరపుకోట, సెప్టెంబరు 22:

-  శృంగవరపుకోట మండలం కిల్తంపాలెం జేఎస్‌డబ్ల్యూ అల్యూమినియం లిమిటెడ్‌ (జిందాల్‌)కు 2008లో శృంగవరపుకోట మండల పరిధిలోని కిల్తంపాలెం, చిడిపాలెం, చినఖండేపల్లి, మూలబొడ్డవర, ముషిడిపల్లి గ్రామాల పరిధిలోని 834.66 ఎకరాలు అసైన్డ్‌ భూమి, 151.04 ఎకరాల ప్రభుత్వ భూమిని ప్రభుత్వం కేటాయించింది. ఈ భూములను 375 మంది రైతుల నుంచి సేకరించింది. 320 మంది రైతులకు అప్పట్లోనే పరిహారం అందించింది. మిగిలిన 55మంది అర్హత విషయంతో అనుమానాలు ఉండడంతో పరిహారం ఇవ్వలేదు. అప్పటి నుంచి వారు పరిహారం కోసం అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నారు.

 - వారం రోజుల్లో గ్రామసభలు నిర్వహిస్తాం. జిందాల్‌ నుంచి పరిహారం పొందని రైతులు అర్హులా? అనర్హులా అని నిర్ధారిస్తాం. అర్హులైన వారికి పరిహారం అందిస్తాం. జిందాల్‌ పరిహారం సమస్య పరిష్కరించాలని కలెక్టర్‌ సూర్యకుమారి ఆదేశాలు ఇచ్చారు. పరిహారం అందని రైతులు పత్రాలతో కార్యాలయానికి రావచ్చు.
                - మే నెలలో తహసీల్దార్‌ శ్రీనివాసరావు ప్రటకన

 - భూసేకరణలో అవకతవకలు జరిగాయని లోక్‌సత్తా పార్టీ పదవీ విరమణ చేసిన ఆర్డీవో స్థాయి అధికారితో నిజనిర్ధారణ కమిటీ వేసింది. అవనీతి జరిగినట్లు ఈ కమిటీ నిర్ధారించింది. ఇదే విషయాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ శాసనసభలో లోక్‌సత్తా పార్టీ అధినేత, అప్పటి ఎమ్మెల్యే జయప్రకాష్‌ నారాయణ్‌ ప్రస్తావించారు. దీంతో అప్పటి ప్రభుత్వం ఈ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా అవనీతి నిరోధక శాఖ (ఏసీబీ) దర్యాప్తు చేయించింది. కొంతమంది బోగస్‌ రైతుల పేరుతో పరిహారం పొందినట్లు తేలింది.

ఇప్పటి పరిస్థితి ఏమిటంటే..
జిందాల్‌ యాజమాన్యానికి ప్రభుత్వం అప్పగించిన భూమిలో పరిశ్రమ లేదు. భూమిని కోల్పోయిన కొంతమంది రైతులకు ఇప్పటికీ పరిహారం అందలేదు. ఇది తేల్చేందుకు గ్రామసభలే నిర్వహించలేదు. భూ సేకరణలో జరిగిన అవకతవకలపై ఇంతవరకు చర్యలు లేవు. భూమిలిచ్చిన రైతులు మాత్రం నష్టపోయారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు సోమవారం శాసనమండలిలో ఈ పరిశ్రమ గురంచి ప్రస్తావించడం మరోసారి ఈ వ్యవహారం తెరపైకి వచ్చింది. 2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ పార్టీ ఇక్కడ పరిశ్రమ స్థాపనకు భూసేకరణ చేపట్టింది. మామిడి, జీడి, కొబ్బరి, అరటి వంటి తోటలతో కోనసీమను తలపించేలా ఉన్న ఈ భూములను గిరిజన రైతుల నుంచి తీసుకుని జిందాల్‌ యాజమాన్యానికి అప్పగించింది. పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ ద్వారా భూమిని సేకరించి పరిశ్రమ యాజమాన్యాలకు అందించడం అనవాయితీ. ఇక్కడ మాత్రం నేరుగా జిందాల్‌ పరిశ్రమ యాజమాన్యానికి భూములను కట్టబెట్టారు. ఉమ్మడి విశాఖ జిల్లా పరిధిలోని అరకు, అనంతగిరి కొండల్లో లభ్యమయ్యే బాక్సైట్‌ నిక్షేపాల తవ్వకం ద్వారా వచ్చే ముడిసరకుతో పరిశ్రమను నడపాలన్న ఉద్దేశంతో యాజమాన్యం ఈ భూములను తీసుకుంది. అప్పట్లో ఇక్కడి గిరిజనులు బాక్సైట్‌ తవ్వకాలను వ్యతిరేకిస్తున్నారు. దీంతో తవ్వకాలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. రాష్ట్ర విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం బాక్సైట్‌ నిక్షేపాల జోలికి వెళ్లమని తేల్చిచెప్పింది. ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం కూడా అదే పనిచేస్తోంది. ఈ నేపథ్యంలో జిందాల్‌ యాజమాన్యం పొందిన స్థలంలో పరిశ్రమ స్థాపనకు ఇటుకు కూడా పడలేదు. ఉద్యోగాలు వస్తాయని భూములు ఇచ్చి ఆర్‌.కార్డు పొందిన వారితో పాటు ఈ ప్రాంతంలో ఎంతోమందికి ఉపాధి లేకుండా పోయింది. ఇటు వ్యవసాయం లేక, ఆటు ఉద్యోగం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వీరి పరిస్థితి ఇలా ఉంటే పరిహారం అందని రైతులు కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అప్పట్లో పరిశ్రమకు భూములు అప్పగించేందుకు రైతుల చుట్టూ తిరిగిన నాయకుల నుంచి ఉలుకుపలుకు లేదు.

సేకరించిన భూమిలో ఏదో ఒక పరిశ్రమ స్థాపించాలి
రైతుల నుంచి సేకరించిన భూమిలో జిందాల్‌ యాజమాన్యం ఏదో ఒక పరిశ్రమను ఏర్పాటు చేయాలి. భూములు కోల్పోయిన రైతుల కుటుంబాల పిల్లలకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. నాభార్య కర్రి కృష్ణ వేణి పేరటి ఉన్న 3ఎకరాలు పరిశ్రమకు ఇచ్చాము. ఇలా 375 మంది రైతులు భూములను ఇచ్చారు. పరిశ్రమ ఏర్పాటుకు ఇంతవరకు పునాదిరాయి కూడా పడలేదు. ఈ 14 ఏళ్లలో భూముల ధరలు విపరీతంగా పెరిగాయి.
- కర్రి సత్యనారాయణ, సెక్రటరీ, శ్రీరామ జిందాల్‌ భూ నిర్వాసితుల సేవా సంఘం, శృంగవరపుకోట మండలం

ఇప్పటికి పరిహారం అందలేదు
మా తాత భీమరాజు పేరున ఉన్న 2.27 ఎకరాలు ఇచ్చేందుకు నిరాకరించాం. 50 సంవత్సరాలుగా తాతల కాలం నుంచి వ్యవసాయం చేస్తున్నాం. మామిడి, జీడి మామిడి మొక్కలు నాటాం. మంచి కాపునకు వచ్చే సమయంలో పరిశ్రమ యాజమాన్యం మూడేళ్ల క్రితం స్వాదీనం చేసుకుంది. తోటలను తొలగించింది. ఇప్పటికీ మాకు పరిహారం ఇవ్వలేదు. ఇందుకోసం కలెక్టర్‌ కార్యాలయం నుంచి తహసీల్దార్‌ వరకు ప్రదక్షిణలు చేస్తున్నాం.
- సుకూరి చిన్నారావు, చీడిపాలెం గ్రామం, ముషిడిపల్లి పంచాయతీ, శృంగవరపుకోట మండలం


                 
 

Updated Date - 2022-09-23T05:22:27+05:30 IST