ధరణిలో చిక్కుముడులు ఎన్నో!

ABN , First Publish Date - 2021-06-24T06:18:09+05:30 IST

తెలంగాణలో భూమి రికార్డుల కోసం ప్రత్యేక పోర్టల్ ‘ధరణి’ రూపంలో ఒక పటిష్టమైన డేటాబేసును ఏర్పాటు చేయాలనుకోవడం అభినందించదగిన విషయం...

ధరణిలో చిక్కుముడులు ఎన్నో!

తెలంగాణలో భూమి రికార్డుల కోసం ప్రత్యేక పోర్టల్ ‘ధరణి’ రూపంలో ఒక పటిష్టమైన డేటాబేసును ఏర్పాటు చేయాలనుకోవడం అభినందించదగిన విషయం. కానీ చిక్కంతా ధరణి మొదలు కాకముందు జరిగిన రిజిస్ట్రేషన్లు లేదా అవకతవకలను సవరించుకోవడానికి ధరణిలో ఇచ్చిన ఆప్షన్ల విషయంలో మాత్రమే. 


ఉదాహరణకు ధరణి రాకముందు సబ్ రిజిస్టార్ ఆఫీసులో రిజిస్ట్రేషన్లు చేసుకున్న వాళ్లకు ధరణిలో ‘మ్యుటేషన్’ అనే ఆప్షన్ ఇచ్చారు, బాగానే ఉంది. కానీ ఈ మ్యుటేషన్ ఆప్షన్ ద్వారా సేల్ డీడ్, గిఫ్ట్ డీడ్‌లకు మాత్రమే అవకాశం ఉంది. సబ్ రిజిస్టార్ ఆఫీసులో ‘ఎక్స్‌‍చేంజ్ డీడ్’ అనే డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ కూడా జరిగేది. అలా రిజిస్ట్రేషన్ చేసుకున్న ఎక్స్‌చేంజ్ డీడ్‌కు మ్యుటేషన్ చేసుకునే సౌలభ్యం ప్రస్తుతం ధరణిలో లేదు. 


అలాగే ధరణి సిస్టమ్‌లో జాయింట్ రిజిస్ట్రేషన్లకు అవకాశం లేదు. జాయింట్ రిజిస్ట్రేషన్ వల్ల ఎన్నో లాభాలు ఉంటాయి. కొన్ని కుటుంబాల్లో ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా ఉండాలని ఉద్దేశపూర్వకంగానే జాయింట్ రిజిస్ట్రేషన్లు చేస్తారు. ఒకవేళ ఆస్తిని అమ్మాల్సిన పరిస్థితి వస్తే స్టేక్ హోల్డర్స్ అందరూ ఒప్పుకుంటే కానీ విక్రయం జరగదు. అందువల్ల ఆ కుటుంబంలో ఐకమత్యం వృద్ధి అవుతుంది. పైగా జాయింట్ రిజిస్ట్రేషన్ చట్టవిరుద్ధమేమీ కాదు. ఒకరకంగా అది ఒక హక్కు. ధరణిలో ఆ హక్కును దూరం చేయడం విచారకరం.


ధరణిలో చాలా విషయాలను సవరించుకోవడానికి తగిన ఆప్షన్లు ఇచ్చారు. ఇవన్నీ ధరణి సిస్టమ్ రాకముందు జరిగిన అవకతవకలను సరిచేయడానికి పనికివచ్చే ఆప్షన్లు మాత్రమే. ప్రస్తుత ధరణి సిస్టమ్‌లో జరిగే రిజిస్ట్రేషన్లలో ఎటువంటి అవకతవకలు, పొరపాట్లు, క్లెరికల్ మిస్టేకులు ఉండే అవకాశం లేదు. అలా ఇచ్చిన ఆప్షన్లలో ‘గ్రీవెన్సస్ ఆన్ స్పెసిఫిక్ ల్యాండ్ మ్యాటర్స్’ అనే ఆప్షన్‌‍లో ‘సర్వే నంబర్ మిస్సింగ్’ ఆప్షన్ లక్షలాది మందికి అవసరపడే ఆప్షన్. ఈ ఆప్షన్ ప్రారంభం నుంచి కూడా డిసేబుల్ చేయబడింది. దానిని ఉపయోగించుకునే అవకాశం కలగడం లేదు.


ధరణిలో పెద్ద, ప్రమాదకరమైన చిక్కుముడి ‘నోషనల్ ఖాతాల’లోని భూములు కనిపించకపోవడం. అది లక్షల ఎకరాలకు, లక్షలాదిమంది రైతుల అకౌంట్లకు సంబంధించినది. ఈ వ్యవహారం చూస్తే- రైతుల నోరు కొట్టి లక్షలాది ఎకరాల పట్టా భూమిని ప్రభుత్వ భూమిగా మార్చడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారేమో అన్న అనుమానం రాక మానదు. ఇది సవివరంగా తెలియ జేస్తాను. 


మామూలుగా రైతులకు సంబంధించి వ్యవసాయ భూముల వివరాలు రెవెన్యూ రికార్డుల్లో రెండు చోట్ల నమోదు చేయబడతాయి. అవి పట్టాదారు వ్యక్తిగత ఖాతాలు. వీటినే F1Bరికార్డులు, లేదా ముక్తసరిగా ల్యాండ్ రికార్డ్స్ అంటారు. క్రయ విక్రయాలు జరిపేటప్పుడు ఈ F1B రికార్డులను ప్రామాణికంగా తీసుకుంటారు. F1B రికార్డులలో రైతు పేరు లేకపోతే అతను అమ్మిన వారికి రిజిస్ట్రేషన్ చేయడానికి వీలు కాదు. వ్యవసాయ భూమి వివరాలు కలిగి ఉండే రెండవ దస్తావేజు ‘నిషేధిత భూముల జాబితా’. ఈ జాబితాలో గవర్నమెంట్ భూములు, పోరంబోకు భూములు, అసైన్మెంటు భూములు, అటవీశాఖకు చెందిన భూములు, దేవాలయ భూములు, వక్ఫ్ భూములు, ప్రతిఫలం చెల్లించి రైతుల నుంచి ‌ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న భూములు, విద్యా సంస్థలకు దాతలు దానం చేసిన భూములు వగైరా వివరాలు ఉంటాయి. ఈ జాబితాలో ఉన్న సర్వే నంబర్లను ఎట్టి పరిస్థితుల్లోనూ మార్పిడి చేయడానికి అవకాశం ఉండదు. దొంగ రిజిస్ట్రేషన్లు కాకుండా ఇది ఒక అడ్డుగోడగా ఉంటుంది. ఒకవేళ పొరపాటున ఏ పట్టాదారు భూమి అయినా ఈ నిషేధిత భూముల జాబితాలో ఉంటే తగిన ఆధారాలు చూపించి కలెక్టరు ద్వారా గాని కోర్టు ద్వారా గాని పట్టాదారు తన భూమిని తిరిగి పొందవచ్చు. ఇందుకోసం ధరణిలో ఆప్షన్ ఇచ్చారు. బాగుంది.


F1B రికార్డులలో పట్టాదారుల ఖాతాలే కాకుండా గతంలో ఇంకొక రకమైన ఖాతాలు ఉండేవి. వాటిని ‘నోషనల్ ఖాతాలు’ అంటారు. ఇందులో ఉండేవి పట్టా భూములే. ధరణి రాకముందు ఈ నోషనల్ ఖాతాలు నిర్వహించబడేవి. ఇవి కల్పిత పేర్లతో నిర్వహించబడేవి. ఆ పేర్లు కలవాళ్ళు సాధారణంగా ఆ ఊరిలో లేనివారు అయి ఉంటారు. ఆ ఖాతాల పేర్లు ఎలా ఉండేవంటే: పట్టాదారు పేరు ‘శ్రీ శ్రీ’, తండ్రి పేరు ‘శ్రీ’. ఇలాంటి విచిత్రమైన పేర్లతో నోషనల్ ఖాతాలు నిర్వహించబడేవి. లేదా పట్టాదారు వివరాలు అసంపూర్తిగా ఉండేవి లేదా తండ్రి పేరు ఉండేది కాదు. ఒక సర్వే నంబర్లలో ఉన్న భూమి అసలు వారసులు ఎవరు అనేది సందిగ్ధంలో ఉన్నప్పుడు, లేదా భాగస్తుల మధ్య వివాదం ఎంతకు తేలనప్పుడు, లేదా కొందరు పట్టాదారులు సర్వే నంబరు తనది కాదని పొరపాటున తన పాస్‍బుక్కులో వచ్చిందని స్వచ్ఛందంగా ప్రభుత్వానికి సరెండర్ చేసినప్పుడు... అలాంటి భూమిని ఈ నోషనల్ ఖాతాలలో వేసేవారు.


ఇలాంటి కారణాల వల్ల నోషనల్ ఖాతాలలో జమ అవుతూ వచ్చిన భూమి చాలా పెరిగింది. ఆ తర్వాత అసలు వారసులు తగిన సాక్ష్యాధారాలు చూపిన మీదట ఈ నోషనల్ ఖాతాల నుంచి భూమి ఆ యజమానికి బదిలీ చేయబడేది. ఈ ప్రక్రియ అంతా ఎమ్మార్వో గారి ప్రొసీడింగ్స్ ప్రకారం జరుగుతూ ఉండేది. ఇదీ నోషనల్ ఖాతాల నిర్వహణలో ముఖ్య ఉద్దేశ్యం. ఇలా ప్రతి ఊరిలో కొన్ని వందల ఎకరాలు ఈ నోషనల్ ఖాతాల్లో పోస్ట్ చేయబడినాయి. ఇవన్నీ రాష్ట్రవ్యాప్తంగా కలిపితే కొన్ని లక్షల ఎకరాలు ఉంటుందని, అది కొన్ని లక్షలమంది రైతుల ఖాతాలలో చేరవలసిన భూమి అన్నది అందరికీ తెలిసిన విషయమే. ప్రభుత్వం అనుమతించిన భూరికార్డుల ప్రక్షాళనలో చాలావరకు నోషనల్ ఖాతాల్లో ఉన్న భూములు అసలు హక్కుదారులకు మార్పిడి అయ్యాయి. అయినా కూడా ఇంకా కొన్ని లక్షల ఎకరాలు నోషనల్ ఖాతాల్లో మిగిలిపోయాయి. పాత సిస్టమ్‌లో నోషనల్ ఖాతాలను ఆన్‌లైన్‌లో చూసుకునే సౌకర్యం పట్టాదారులకు ఉండేది. కానీ ధరణి వచ్చిన తర్వాత నోషనల్ ఖాతాలను ధరణిలో కనిపించకుండా చేసారు. ఇది ఉద్దేశ్యపూర్వకంగా, కావాలని వేసిన చిక్కుముడి. ఇప్పుడు ఆ మొత్తం భూమిని ప్రభుత్వ భూమిగా మార్చడానికి ప్రణాళికలు రచించ బడుతున్నాయి అని రైతులు అనుమానిస్తున్నారు. సమగ్ర భూ సర్వే చేపిస్తాము అని అనడం ఇందులోని భాగమే. నోషనల్ ఖాతాల్లో ఉన్న భూమి పక్కాగా పట్టా భూమే. పట్టా భూములను నష్ట పరిహారం చెల్లించకుండా స్వాధీనం చేసుకునే హక్కు ప్రభుత్వానికి లేదని ఎన్నో కోర్టు కేసులలో తీర్పు ఇచ్చారు.


ఇప్పుడు ధరణిలో F1B రికార్డులు కనపడుతున్నాయి. కానీ నోషనల్ ఖాతాల్లో ఉన్న సర్వే నెంబర్లు కనబడటంలేదు. అంతేకాదు నోషనల్ ఖాతాలో ఉన్న భూములు నిషేధిత భూముల జాబితాలోనూ కనపడటం లేదు. కొన్ని లక్షల ఎకరాల పట్టా భూములను పట్టాదారులకు సొంతం కాకుండా చేయటానికి జరుగుతున్న ప్రయత్నంగా దీన్ని అనుమానించ వలసి వస్తున్నది. దీని సవరణకు ప్రస్తుతం ధరణిలో ఎటువంటి ఆప్షన్ లేదు. ధరణిలో ‘సర్వే నంబర్ మిస్సింగ్’ అన్న ఆప్షన్ గత రెండు నెలలుగా డిసేబుల్ అయి ఉంది. మిగతా అన్ని ఆప్షన్లను ఎనేబుల్ చేశారు కానీ దీన్ని చేయడం లేదు. దీన్ని ఎనేబుల్ చేస్తే ఈ నోషనల్ ఖాతాల్లో ఉన్న భూములన్నిటినీ సొంత పట్టాదారులకు బదిలీ చేయవలసి వస్తుందని ఉద్దేశపూర్వకంగా డిసేబుల్ చేసి వుంటారని చాలా మంది రైతులు భావిస్తున్నారు. భవిష్యత్తులో సమగ్ర భూ సర్వే చేపట్టి నోషనల్ ఖాతాల్లో ఉన్న లక్షలాది ఎకరాల పట్టా భూమిని మొత్తం ప్రభుత్వ భూమిగా మార్పు చేయాలన్న ఉద్దేశం దీని వెనక స్పష్టంగా కనిపిస్తున్నది.


ఒక అంచనా ప్రకారం నోషనల్ ఖాతాలోని పట్టా భూమి ఒక వంతు ఉంటే అది రెండు వంతుల మంది రైతుల ఖాతాలను ప్రభావితం చేస్తుందని భావిస్తున్నారు. నోషనల్ ఖాతాల్లో ఉన్న భూములు చాలా వరకూ చిన్న విస్తీర్ణం కలవి. అనగా 5, 10, 20 గుంటల భూమి విస్తీర్ణం గల సర్వే నంబర్లే ఎక్కువ. కాబట్టి చిన్న వైశాల్యంలో ఉన్న వ్యవసాయ భూమి కోసం రైతులు కలెక్టర్ల చుట్టూ కోర్టుల చుట్టూ తిరిగేలా చేయాలనుకోవడం అమానుషమైన చర్య. ఇలా రైతులు తమ హక్కుల కోసం కోర్టుకు పోవాల్సిన పరిస్థితి వస్తే, ఈ ఒక్క నోషనల్ ఖాతా భూముల విషయం మీదనే కోర్టులు అదనంగా కొన్ని లక్షల కేసులను విచారించాలి. ఇది కోర్టులకు కూడా భారమే. ధరణిలోని ఈ అసలు సిసలైన పెద్ద చిక్కుముడిని ప్రభుత్వంలోని పెద్దలు ఎలా విప్పుతారో వేచి చూడాల్సిందే.

గౌరి శ్యామ్

Updated Date - 2021-06-24T06:18:09+05:30 IST