డీ పట్టాల కొనుగోలుదారుల్లో గుబులు

ABN , First Publish Date - 2022-08-17T05:48:12+05:30 IST

మండలంలో డీ పట్టా భూములను లీజు రూపంలో కొనుగోలు చేసి అనుభవిస్తున్న వారిలో సమగ్ర భూములు రీ సర్వే గుబులు పుట్టిస్తున్నది.

డీ పట్టాల కొనుగోలుదారుల్లో గుబులు
సర్వే పనులను పరిశీలిస్తున్న తహసీల్దార్‌ (ఫైల్‌)

రికార్డుల ప్రకారం సమగ్ర రీ సర్వే 

కొనుగోలుదారుల్లో మొదలైన ఆందోళన 

మండలంలో 2,500 ఎకరాలకు డి పట్టాలు

కొన్నిచోట్ల కొనుగోలుదారులు, యజమానుల మధ్య అవగాహన 

మరికొన్నిచోట్ల కొనసాగుతున్న వివాదాలు


మాకవరపాలెం, ఆగస్టు 16: మండలంలో డీ పట్టా భూములను లీజు రూపంలో కొనుగోలు చేసి అనుభవిస్తున్న వారిలో సమగ్ర భూములు రీ సర్వే గుబులు పుట్టిస్తున్నది. ఈ భూములు రికార్డులపరంగా ఎవరి పేరున ఉన్నాయో వారి పేరున మళ్లీ రీ సర్వే చేస్తున్నారు. దీంతో ఆ భూములు కొనుగోలు చేసిన వారిలో ఆందోళన మొదలైంది. 

మండలంలో పది రోజులుగా 12 రెవెన్యూ గ్రామాల్లో 1,400 వేల ఎకరాల భూమిని సర్వే చేస్తున్నారు. ఇందుకోసం వీఆర్‌వోలు, సచివాలయ సర్వే సిబ్బంది బృందాలుగా ఏర్పడ్డారు. మండలంలో భూమి లేని పేదలకు ప్రభుత్వం 2,500 ఎకరాలను పంపిణీ చేసింది. ఆ భూములను కూడా సర్వే చేస్తున్నారు. వాస్తవంగా ప్రభుత్వం పంపిణీ చేసిన భూములు క్రయ,విక్రయాలు చేయకూడదనే నిబంధన ఉంది. వాటిపై వంశపారంపర్యంగా అనుభవదారులకు మాత్రమే హక్కులు సంక్రమిస్తాయి. అయితే ఇటువంటి భూములన్నీ గ్రామాల్లో చేతులు మారాయి. రికార్డుపరంగా ఎవరి పేరున ఉన్నాయో వారి పేరునే మళ్లీ రీ సర్వే చేస్తున్నారు. ఈ విషయం కొనుగోలు చేసిన వారిలో దడ పుట్టిస్తోంది. శెట్టిపాలెంలో 1,200 ఎకరాల భూమిని సర్వే చేస్తున్నారు. వాటిలో 300 ఎకరాల డీ పట్టా భూమి ఉంది. ఈ భూమి ఇప్పటికే కొందరు పెద్దలు లీజు రూపంలో కొనుగోలు చేశారు. రీసర్వేలో మాత్రం డీ పట్టాదారుడు పేరు మీద సర్వే చేస్తుండడం లీజుదారుల్లో ఆందోళన కలిగిస్తున్నది. అలాగే పైడిపాల గ్రామంలో వెయ్యి ఎకరాల భూమి సర్వే చేస్తున్నప్పటికి అధిక శాతం డీపట్టా భూములు కావడంతో ఇక్కడ కూడా ఈ సమస్య ఉంది. మండలంలోని 12 గ్రామాల్లో 2,500 ఎకరాల డీ పట్టా భూములున్నాయి. రెండు వేల ఎకరాల వరకూ భూములు లీజుదారుల చేతుల్లో ఉన్నాయి. కొన్నిచోట్ల డీ పట్టాదారులు, కొనుగోలుదారులు ఒప్పందం చేసుకోని సర్వే చేసుకుంటున్నారు. మరికొన్నిచోట్ల వివాదాస్పదమవుతోంది. ఈ విషయమై తహసీల్దార్‌ ప్రసాదరావును వివరణ కోరగా.. డీ పట్టా ఎవరి పేరు మీద ఉంటే వారి పేరు మీద సర్వే చేస్తామన్నారు. అంతేగాని కొనుగోలుదారుల పేరు మీద సర్వే చేయడం అసాధ్యమన్నారు. డీ పట్టా భూముల సర్వేలో గొడవలు సృష్టిస్తే పీవోటి కేసు నమోదు చేస్తామన్నారు.

Updated Date - 2022-08-17T05:48:12+05:30 IST