రాష్ట్రంలో 1400 ఐటీ కంపెనీలున్నా

ABN , First Publish Date - 2020-09-20T07:37:40+05:30 IST

హైదరాబాద్‌ సహా రాష్ట్రంలో 1,400కు పైగా ఐటీ కంపెనీలు ఉన్నా.. అందులో పనిచేస్తున్న తెలంగాణ విద్యార్థులు 10 శాతమేనని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల

రాష్ట్రంలో 1400 ఐటీ కంపెనీలున్నా

తెలంగాణ ఉద్యోగులు 10 శాతమే

నైపుణ్యాలు పెంచేందుకే టాస్క్‌: జయేశ్‌ రంజన్‌

రాష్ట్రానికి అంతర్జాతీయ వర్సిటీలు రావాలి: సంగీతారెడ్డి


హైదరాబాద్‌ సిటీ, సెప్టెంబరు 19(ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌ సహా రాష్ట్రంలో 1,400కు పైగా ఐటీ కంపెనీలు ఉన్నా.. అందులో పనిచేస్తున్న తెలంగాణ విద్యార్థులు 10 శాతమేనని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్‌ కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ ఆవేదన వ్యక్తం చేశారు. మిగిలిన ఉద్యోగులంతా ఇతర ప్రాంతాల వారే అన్నారు. దీనికి ఉద్యోగార్హమైన నైపుణ్యాలు లేకపోవడం, కంపెనీలు, విద్యాసంస్థల మధ్య గ్యాప్‌ కారణమని వివరించారు. విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంచేందుకే టాస్క్‌ను ఏర్పాటు చేశామని వెల్లడించారు.


‘నూతన విద్యావిధానం - తెలంగాణ కోసం ఓ గేమ్‌ ఛేంజర్‌’ అంశంపై ఫిక్కీ తెలంగాణ స్టేట్‌ కౌన్సిల్‌, రాష్ట్ర ఉన్నత విద్యామండలి(టీఎ్‌ససీహెచ్‌ఈ) సంయుక్తంగా శనివారం వెబినార్‌ నిర్వహించాయి. జయేశ్‌ రంజన్‌ మాట్లాడుతూ.. రాష్ట్ర విద్యావిధానంలో ప్రధానంగా 3 సంస్కరణలు తేవాల్సి ఉందన్నారు. మొదటిది టీచర్లకు శిక్షణ, రెండోది పరీక్ష ఆధారిత అభ్యాస వ్యవస్థకు దూరం, మూడోది విద్యావిధానంలో పరిశ్రమల భాగస్వామ్యాన్ని పెంచడం అన్నారు.


ఐఎ్‌సబీ హైదరాబాద్‌కే గర్వకారణమని, రాష్ట్రానికి మరో రెండు అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల అవసరం ఉందని ఫిక్కీ జాతీయ అధ్యక్షురాలు సంగీతారెడ్డి తెలిపారు. విద్యా రంగంలోకి ప్రైవేటు పెట్టుబడులు రావాల్సి ఉందన్నారు. పరిశ్రమలతో విద్యాసంస్థల అనుసంఽధానాన్ని పెంచేందుకు తెలంగాణ నేషనల్‌ సైన్స్‌ ఫౌండేషన్‌ పెడితే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. జాతీయ విద్యావిధానంతో విద్యారంగం భవిష్యత్తు ఆశాజనకంగా ఉంటుందని, యూనివర్సిటీల్లో ప్రైవేటు పెట్టుబడులు ప్రోత్సహించాలని, తెలంగాణ ప్రభుత్వ కాలేజీయేట్‌ ఎడ్యుకేషన్‌ కమిషనర్‌ నవీన్‌ మిట్టల్‌ అన్నారు.


ప్రభుత్వ విశ్వవిద్యాలయాల పరిశోధనలకు నిధులు సమకూరేలా చేయాలని సూచించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం రూ.100 కోట్ల రుసా ప్రాజెక్టును తీసుకుందన్నారు. సృజనాత్మక వ్యక్తులను తయారు చేసేలా తెలంగాణ ఉన్నత విద్య ఉండాలని వరంగల్‌ నిట్‌ డైరెక్టర్‌ రంగారావు తెలిపారు. కార్యక్రమంలో ఫిక్కీ తెలంగాణ చైర్మన్‌ టి.మురళీధరన్‌ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2020-09-20T07:37:40+05:30 IST