కరోనా ఉగ్రరూపం

ABN , First Publish Date - 2020-06-01T09:23:47+05:30 IST

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కరోనా వేగంగా విస్తరిస్తోంది. పాజిటివ్‌ కేసులు అనూహ్యంగా పెరిగిపోతున్నాయి. లాక్‌డౌన్‌ సడలింపుతో

కరోనా ఉగ్రరూపం

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 41 పాజిటివ్‌లు 


(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డిఅర్బన్‌) : ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కరోనా వేగంగా విస్తరిస్తోంది. పాజిటివ్‌ కేసులు అనూహ్యంగా పెరిగిపోతున్నాయి. లాక్‌డౌన్‌ సడలింపుతో వైరస్‌ తన పంజాను వేగంగా విసురుతోంది. ఉమ్మడి జిల్లాలో ఆదివారం ఒక్కరోజే 43కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలోనే 39 మందికి పాజిటివ్‌ వచ్చింది. అత్యధికంగా బాలాపూర్‌లో 23 కేసులు నమోదు కాగా.. సరూర్‌నగర్‌లో 6, మొయినాబాద్‌లో నాలుగు కేసులు నమోదయ్యాయి. అలాగే మైలార్‌దేవ్‌పల్లిలో రెండు, శేరి లింగంపల్లిలో మూడు, అబ్దుల్లాపూర్‌మెట్‌లో ఒక కేసు నమోదయ్యాయి. మొత్తం రంగారెడ్డి జిల్లాలో కరోనా కేసుల సంఖ్య 283కి చేరుకుంది. కాగా మొయినాబాద్‌ మండల పరిధిలోని అజీజ్‌నగర్‌ గ్రామంలో మరో నలుగురికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. వీరు ఇటీవల కరోనా పాజిటివ్‌ వచ్చిన వ్యక్తి కుటుంబ సభ్యులని అధికారులు చెప్పారు. కరోనా వచ్చిన వ్యక్తికి కూతురు, కుమారుడు, ఇద్దరు మనవరాళ్లు ఉన్నారని వైద్యులు స్పష్టం చేశారు. 


కంటైన్‌మెంట్‌లో కష్టాలు

అజీజ్‌నగర్‌ గ్రామంలో పాజిటివ్‌ వచ్చిన వ్యక్తికి సంబంధించిన వాడను పూర్తిగా కంటైన్‌మెంట్‌ జోన్‌గా ప్రకటించి కట్టుదిట్టం చేశారు. అయితే ఆ కాలనీ ప్రజలు బయట నుంచి లోపలికి.. లోపలి నుంచి బయటికి రావద్దని అధికారులు, పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. నాలుగు రోజుల నుంచి నిత్యావసర సరుకులు, తాగునీరు, కూరగాయలు లేక అవస్థలు పడుతున్నామని, తమను పట్టించుకునే వారే కరువయ్యారని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే స్థానిక ప్రజాప్రతినిధుల చొరవతో ఆదివారం నుంచి వారికి సరుకులు, ఇతర సదుపాయాలను కల్పిస్తున్నారు. 


దౌలాపూర్‌లో ముగ్గురికి..

వికారాబాద్‌ జిల్లా దౌలాపూర్‌ గ్రామానికి చెందిన తల్లి, కూతురు, కుమారుడు కొన్నేళ్ల క్రితం మహరాష్ట్రలోని ముంబైకి వలస వెళ్లారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో అక్కడి నుంచి స్వగ్రామానికి 25రోజుల క్రితం బయల్దేరారు. అయితే వీరిని కర్ణాటక రాష్ట్రం యాద్గీర్‌ జిల్లాలోని చెక్‌పోస్టు వద్ద అక్కడి సిబ్బంది ఆపి వైద్య పరీక్షలు నిర్వహించి 21 రోజులపాటు చెక్‌పోస్టు వద్దనే క్వారంటైన్‌లో ఉంచారు. శనివారం రాత్రి ముగ్గురికి కరోనా పాజిటివ్‌ ఉన్నట్లు నిర్ధారించారు. కాగా అక్కడి చెక్‌పోస్టు సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఈ ముగ్గురు రాత్రికిరాత్రే దౌలాపూర్‌ గ్రామానికి చేరుకున్నారు. దీంతో స్థానిక వైద్యాధికారులు అప్రమత్తమై వారిని హైదరాబాద్‌ కింగ్‌ కోఠి ఆస్పత్రికి తరలించారు. క్వారంటైన్‌ నుంచి ఈ ముగ్గురు ఏ విధంగా వచ్చారనే విషయం స్పష్టంగా చెప్పడం లేదని అధికారులు తెలిపారు. 


నాగారంలో..

మేడ్చల్‌జిల్లాలో నాగారం మున్సిపాలిటీ వెస్ట్‌ గాంధీ నగర్‌లో ఆదివారం కరోనా పాజిటివ్‌ నమోదైంది. క్యాబ్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్న యువ కుడికి వైరస్‌ సోకినట్లు వైద్యా ధికారులు తెలిపారు.  హైద రాబాద్‌ నుంచి సిద్దిపేట్‌కు ప్రయాణికులను దింపి తిరిగి ఇంటికి చేరుకున్న అనంతరం తీవ్ర జ్వరం రాగా నాగారంలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చేరి నాలుగు రోజుల పాటు చికిత్స పొందాడు. అప్పటికీ జ్వరం తగ్గుముఖం పట్టకపోవటంతో నగరంలోని ఫీవర్‌ ఆసుపత్రికి వెళ్లి పరీక్షలు చేయించారు. వైద్యపరీక్షల్లో అతనికి కరోనా పాజి టివ్‌ ఉన్నట్లు వైద్యాధికారులు గుర్తించారు. దీంతో అతన్ని గాంధీ అసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నట్లు కీసర మండల వైద్యాధికారులు వెల్లడించారు. యువకుడు చికిత్స పొందిన ప్రైవేట్‌ ఆసుపత్రిని 15రోజులపాటు మూసి వేయాలని నిర్వహకులను వైద్యాధికారులు ఆదేశించారు.

Updated Date - 2020-06-01T09:23:47+05:30 IST