రాజధానిలో 4 సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులు

ABN , First Publish Date - 2021-06-20T08:50:46+05:30 IST

రాష్ట్ర ప్రజలకు సర్కారీ సూపర్‌ స్పెషాలిటీ వైద్య సేవలు మరింతగా అందుబాటులోకి రానున్నాయి.

రాజధానిలో 4 సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులు

  • టిమ్స్‌, చెస్ట్‌ ఆస్పత్రిలో, గడ్డి అన్నారం, 
  • పండ్ల మార్కెట్‌, అల్వాల్‌-ఔటర్‌ మధ్యలో ఏర్పాటు
  • ఒక్కో దానిలో 1500-2000 పడకలు
  • మంత్రి మండలి సమావేశంలో నిర్ణయం


హైదరాబాద్‌, జూన్‌ 19 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రజలకు సర్కారీ సూపర్‌ స్పెషాలిటీ వైద్య సేవలు మరింతగా అందుబాటులోకి రానున్నాయి. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిఽఽధిలో గచ్చిబౌలి టిమ్స్‌ సహా మరో మూడు సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులను నిర్మించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. వీటిలో ఒక దానిని చెస్ట్‌ ఆస్పత్రి ప్రాంగణంలో, రెండో దానిని గడ్డి అన్నారం నుంచి షిప్టు చేసిన పండ్లమార్కెట్‌ ప్రాంగణంలో, మూడో దానిని మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాలోని అల్వాల్‌ నుంచి ఔటర్‌ రింగ్‌ రోడ్డు మధ్యలో నిర్మించనున్నారు. ఈమేరకు శనివారం జరిగిన మంత్రిమండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.


అందుబాటులోకి మరో 6,000 పడకలు

ప్రస్తుతం హైదరాబాద్‌లో ప్రభుత్వ ఆధ్వర్యంలో నిమ్స్‌, గాంధీ, ఉస్మానియాల్లో సూపర్‌ స్పెషాలిటీ వైద్య సేవలు అందుతున్నాయి. సాధారణంగా సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిలో 30కిపైగా విభాగాలు ఉంటాయి. వాటిలో 20కిపైగా విభాగాలకు అత్యఽధిక ప్రాధాన్యం ఇస్తారు. వీటిలో ఒక్కో విభాగాన్ని సగటున 20-40 పడకలతో ఏర్పాటు చేస్తారని ప్రభుత్వ రంగ వైద్య నిపుణులు చెబుతున్నారు. అంటే, కనీసం 1200-1500 పడకలతో సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిని ఏర్పాటు చేయాల్సి ఉంటుందంటున్నారు. టిమ్స్‌లో ఇప్పటికే 1,500 పడకలున్నాయి. దాంతో, కొత్తగా నిర్మించే వాటిలో ఒక్కో సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిని కనీసం 1500-2000 వేల పడకలతో ఏర్పాటు చేసే అవకాశం ఉందని వైద్య వర్గాలు చెబుతున్నాయి. 


వాటిని 1,500 బెడ్స్‌ చొప్పున ఏర్పాటు చేస్తే మొత్తం 6 వేల పడకలు; 2 వేల బెడ్స్‌ చొప్పున ఏర్పాటు చేస్తే 8 వేల పడకలు అందుబాటులోకి వస్తాయని అంటున్నారు. ఒక్కో బెడ్‌కు సగటున రూ.60-70 లక్షల ఖర్చు అవుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. టిమ్స్‌ ఆస్పత్రిలో ఉన్న భవనాల్లోనే సూపర్‌ స్పెషాలిటీ విభాగాలను ఏర్పాటు చేస్తే సరిపోతుంది. ఇక కొత్తగా నిర్మించబోయే మూడు ఆస్పత్రులకు కనీసం రూ.4వేల కోట్లు అవుతుందని వైద్య అధికారులంటున్నారు. వీటి ఏర్పాటుతో అత్యాధునిక రోగ నిర్ధారణ పరీక్షలతోపాటు శస్త్ర చికిత్సలు అందుబాటులోకి వస్తాయి. సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులు ఏర్పాటైతే వాటికి అనుబంధంగా అండర్‌ గ్రాడ్యుయేట్‌, పోస్టు గ్రాడ్యుయేట్‌ సీట్లు కూడా వస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.


విప్లవాత్మక నిర్ణయం

హైదరాబాద్‌లో ఒకేసారి నాలుగు సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులను ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ప్రకటించడం విప్లవాత్మక నిర్ణయం. రాబోయే 50-100 సంవత్సరాల వైద్య సేవలను దృష్టిలో పెట్టుకొని వీటిని ఏర్పాటు చేస్తున్నారు. వీటితో ఆరోగ్య రంగంలోనూ హైదరాబాద్‌ దీటుగా నిలుస్తుందని చెప్పవచ్చు.

- డాక్టర్‌ పుట్ట శ్రీనివాస్‌, మాజీ వైద్య విద్య సంచాలకులు

Updated Date - 2021-06-20T08:50:46+05:30 IST