ఎవరయ్యేను సరికొత్త చాంప్‌?

ABN , First Publish Date - 2020-09-13T09:11:14+05:30 IST

ఈ సంవత్సరం యూఎస్‌ ఓపెన్‌లో సరికొత్త చాంపియన్‌ రాబోతున్నాడు. రెండో సీడ్‌, 27ఏళ్ల డొమినిక్‌ థీమ్‌ (ఆస్ట్రియా)

ఎవరయ్యేను సరికొత్త చాంప్‌?

ఫైనల్లో థీమ్ వర్సెస్ ‌జ్వెరెవ్‌

సెమీ్‌సలో మెద్వెదేవ్‌, పాబ్లో ఓటమి

యూఎస్‌ ఓపెన్‌ 


ఫైనల్‌ నేడే

అర్ధరాత్రి 1.30 తర్వాత 

స్టార్‌స్పోర్ట్స్‌ సెలెక్ట్‌-1లో..


స్టార్‌ ఆటగాళ్ల గైర్హాజరీ.. జొకోవిచ్‌ అనర్హతతో టైటిల్‌  గెలుస్తారని  భావిస్తున్న డొమినిక్‌ థీమ్‌, అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌ అంచనాలు నిలబెట్టుకున్నారు. యూఎస్‌ ఓపెన్‌ సెమీఫైనల్స్‌లో తమ ప్రత్యర్థులపై పట్టు వదలని పోరాటాన్ని  ప్రదర్శించి ఫైనల్‌ ఫైట్‌కు సిద్ధమయ్యారు. ఇక ఈ సమరంలో ఎవరు గెలిచినా వారి ఖాతాలో ఇదే తొలి గ్రాండ్‌స్లామ్‌ కానుంది. అంతేకాదు.. ఆటగాళ్ల వయస్సు రీత్యా 2012 తర్వాత జరగబోయే యంగెస్ట్‌ గ్రాండ్‌స్లామ్‌ ఫైనల్‌ కూడా ఇదే.


న్యూయార్క్‌: ఈ సంవత్సరం యూఎస్‌ ఓపెన్‌లో సరికొత్త చాంపియన్‌ రాబోతున్నాడు. రెండో సీడ్‌, 27ఏళ్ల డొమినిక్‌ థీమ్‌ (ఆస్ట్రియా) వరుసగా ఈ ఏడాది రెండో గ్రాండ్‌స్లామ్‌ ఫైనల్లోకి అడుగుపెట్టాడు.  అటు భవిష్యత్‌ స్టార్‌గా పేరు తెచ్చుకున్న ఐదోసీడ్‌, 23 ఏళ్ల అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌ (జర్మనీ) సెమీఫైనల్లో అసమాన పోరాటాన్ని కనబరిచి ఆఖరి మ్యాచ్‌కు సిద్ధమయ్యాడు. సోమవారం తెల్లవారుజామున వీరిద్దరి మధ్య అంతిమ పోరు జరగనుంది. పురుషుల సింగిల్స్‌ సెమీఫైనల్లో థీమ్‌ 6-2, 7-6 (9-7), 7-6 (7-5)తో నిరుటి ఫైనలిస్ట్‌, మూడోసీడ్‌ మెద్వెదేవ్‌ (రష్యా)పై   నెగ్గాడు. తొలి సెట్‌లో ఇద్దరూ 2-2తో సమంగా నిలిచినా ఆ తర్వాత థీమ్‌.. ప్రత్యర్థి సర్వీ్‌సను బ్రేక్‌ చేస్తూ తన సర్వీస్‌ కాపాడుకుంటూ ఆ సెట్‌ను దక్కించుకున్నాడు. రెండో సెట్‌లో మెద్వెదేవ్‌ ఓ దశలో 5-3తో దూసుకెళ్లాడు. ఆ తర్వాత పదో గేమ్‌లో ఎక్కువగా నెట్‌ మీదకు ఆడడంతో థీమ్‌ 5-5తో పోటీలొకొచ్చాడు. ఇక టైబ్రేక్‌లోనూ మెద్వెదేవ్‌ గట్టిగా పోరాడినా చివరకు థీమ్‌ ఫోర్‌హ్యాండ్‌ విన్నర్‌తో సెట్‌ పాయింట్‌ సాధించాడు. అయితే  

        ఈ సెట్‌లో ర్యాలీలు ఎక్కువగా సాగడంతో పాటు థీమ్‌   షూస్‌ పదేపదే జారగా.. మోకాలికి చికిత్స చేయించుకున్నాడు. ఓ దశలో చిరాకు పట్టలేక ‘ఇవేం షూస్‌?’ అంటూ అసహనాన్ని ప్రదర్శించాడు. ఇక, చివరి సెట్‌లోనూ ఇద్దరూ నువ్వా నేనా అనేలా తలపడడంతో ఈ సెట్‌ కూడా టైబ్రేక్‌ వరకు వెళ్లినా.. అంతిమంగా థీమ్‌ పైచేయి సాధించాడు. 

జ్వెరెవ్‌ పోరాటం: మరో సెమీ్‌సలో జ్వెరెవ్‌ రెండు సెట్లు కోల్పోయినా చివరకు 3-6, 2-6, 6-3, 6-4, 6-3తో 20వ సీడ్‌ పాబ్లో కరెనో బుస్టా (స్పెయిన్‌)ను ఓడించి మొదటిసారి గ్రాండ్‌స్లామ్‌ ఫైనల్‌కు అర్హత సాధించాడు. దీంతో 1994లో మైకేల్‌ స్టిచ్‌ తర్వాత ఈ టోర్నీ తుది పోరుకు చేరిన జర్మన్‌ ఆటగాడయ్యాడు. 3 గంటల 22 నిమిషాలు సాగిన  పోరులో జ్వెరెవ్‌ తొలి రెండు సెట్‌లలోనే 36 అనవసర తప్పిదాలతో మూల్యం చెల్లించుకున్నాడు.  కానీ మూడో సెట్‌లో పొరపాట్లను సరిచేసుకుని పదునైన సర్వీ్‌సలతో, కచ్చితమైన గ్రౌండ్‌స్ట్రోక్‌తో మ్యాచ్‌ను 5 సెట్ల వరకు తీసుకెళ్లాడు. ఆ తర్వాత జ్వెరెవ్‌కు పెద్దగా పోటీ ఎదురుకాలేదు. 

Updated Date - 2020-09-13T09:11:14+05:30 IST