వారి దారి.. అడ్డదారి!

ABN , First Publish Date - 2022-07-27T05:07:37+05:30 IST

విజయనగరం జిల్లా గంజాయి వ్యాపారులకు అడ్డాగా మారుతోందా..? రవాణాకు అనువుగా ఉందని స్మగ్లర్లు భావిస్తున్నారా? వేల టన్నుల సరుకు గుట్టుగా తరలిపోతోందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జిల్లాలో ప్రతి నెలా కనీసం రెండు లేదా మూడు చోట్ల గంజాయి పట్టుబడుతోంది.

వారి దారి.. అడ్డదారి!



జిల్లా మీదుగా జోరుగా గంజాయి రవాణా
కేసులు నమోదవుతున్నా తగ్గని వైనం
పట్టుబడని సూత్రదారులు
విద్యార్థులు కేసుల్లో చిక్కుకుంటున్న వైనం

విజయనగరం (ఆంధ్రజ్యోతి)

విజయనగరం జిల్లా గంజాయి వ్యాపారులకు అడ్డాగా మారుతోందా..? రవాణాకు అనువుగా ఉందని స్మగ్లర్లు భావిస్తున్నారా? వేల టన్నుల సరుకు గుట్టుగా తరలిపోతోందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జిల్లాలో  ప్రతి నెలా కనీసం రెండు లేదా మూడు చోట్ల గంజాయి పట్టుబడుతోంది. కొత్తకొత్తమార్గాల్లో తరలుతుండగా పోలీసులు తనిఖీ చేసి పట్టుకుంటున్నారు. వారికి ముందస్తుగా సమాచారం అందితేనే ఆయా చెక్‌పోస్టుల వద్ద కాని,  దారి కాచి కానీ పట్టుకుంటున్నారు. ఇదే సమయంలో గుట్టుగా.. అర్ధరాత్రి వేళ భారీగా గంజాయి తరలుతోందన్న ఆరోపణలు విస్తృతంగా వినిపిస్తున్నాయి.
గత ఏడాది తెలంగాణాలో భారీగా గంజాయి గంజాయి పట్టుబడింది. అది మన జిల్లా మీదుగానే తరలించారని  వెలుగులోకి వచ్చింది. ఎనిమిది నెలలక్రితం ఓ స్ర్కాప్‌ వాహనంలో గంజాయీ తరలిస్తూ విజయనగరం రూరల్‌ మండలం చెల్లూరు సమీపానికి వచ్చేసరికి రవాణాదారులకు అనుమానం వచ్చింది. కొద్దిదూరంలో పోలీసులు తనిఖీలు చేస్తున్నట్లు తెలుసుకుని అక్కడికక్కడే రెండు వందల కిలోలకు పైగా గంజాయిని పడేసి వెళ్లిపోయారు. బయట పడని కేసులెన్నో ఉంటున్నాయి. రెండేళ్ల కిందట ఎప్పుడూ ఒకే దారిలో గంజాయి పట్టుబడేది. ఇప్పుడు పోలీసులు ఊహించని మార్గాల్లో కూడా గంజాయిని తరలిస్తున్నారు. సులువుగా డబ్బు సంపాదించేందుకు నిరుద్యోగ యువతతో పాటు విద్యార్థులూ గంజాయి రవాణాకు పావులుగా మారుతున్నారు. సూత్రదారులుగా ఉన్న వ్యాపారులు ఎక్కడా పట్టుబడటం లేదు. వారు దొరికితేనే దొంగ లేకుంటే దొర అన్నట్టుగా భావించి గంజాయి వ్యాపారాన్ని వీడడం లేదు. రవాణా చేస్తూ పట్టుబడిన వారిలో ఎక్కువ మంది పేదలే. తాజాగా సోమవారం రామభద్రపురం మండలం మీదుగా రెండు కార్లలో సుమారు 300 కేజీల గంజాయిని తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఇద్దరు డ్రైవర్లు, మరొకరిని అదుపులోకి తీసుకున్నారు.

 ఎస్‌.కోట, మెంటాడ, సాలూరు, పాచిపెంట, కొమరాడ, గుమ్మలక్ష్మీపురం బోర్డర్‌లకు ఆనుకుని ఏవోబీ ఉంది.   ఈ ప్రాంతాల మీదుగా తరలుతూనే గంజాయి పట్టుబడుతోంది. కొన్నిసార్లు సరిహద్దులు దాటుతూ విశాఖ, చెన్నయ్‌, ముంబయి, హైదరాబాద్‌ తదితర మెట్రో సిటీలకు చేరుతోంది. ఎక్కడికక్కడే వేర్వేరు మార్గాల్లో.. వేర్వేరు వాహనాల్లోకి సరుకును మార్చేస్తుంటారని సమాచారం.

ఈ నెల 22న ఎస్‌.కోట మండలం బొడ్డవర చెక్‌పోస్టు వద్ద 100 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ఇదే నెలలో ఎస్‌.కోట ఆర్టీసీ కాంప్లెక్స్‌లో సుమరు 50 కిలోల గంజాయిని బస్సులో తరలిస్తుండగా పోలీసులు అనుమానం వచ్చి తనిఖీ చెయ్యగా గంజాయి మూటలు పట్టుబడ్డాయి.

 ఈ నెల 8వ తేదీన దత్తిరాజేరు మండలం షికారుగంజి వద్ద 120 కిలోల గంజాయిని తరలిస్తూ భయంతో అతివేగంగా డ్రైవింగ్‌ చేస్తూ గోతిలో పడి ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు.
 

గత ఏడాది నవంబరు 11న ఆరకు నుంచి మెంటాడ మండలం ఆండ్ర మీదుగా రెండు కార్లలో 495 కేజీల గంజాయిని తరలిస్తుండగా పోలీసులు వెంబడించి పట్టుకున్నారు. ఏదైనాగాని ఏటా టన్నుల కొద్దీ గంజాయిని తరలించేందుకు ముఠాలు జిల్లాను అడ్డాగా ఎంచుకున్నాయి.

 గంజాయిలో శీలావతి అనే రకానికి ఎక్కువ డిమాండ్‌ ఉందని చెప్పుకుంటున్నారు. దీన్ని తులాలు, గ్రాములు లెక్కన విక్రయిస్తారు. గంజాయినీ ఒక్కసారి సక్రమంగా అనుకున్న గమ్యస్థానానికి చేరవేస్తే లక్షల రూపాయాల్లో మిగులుతుందట. సులువుగా డబ్బు సంపాదనకు అలవాటు పడ్డ కొంతమంది యువత పెడదారి పడుతున్నారు. కొందరు కేసుల్లో ఇరుక్కుంటున్నారు. గతంలో అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి తదితర ప్రాంతాల్లో గంజాయి సాగు అధికంగా ఉండేది.

నమోదైన కేసులు ఇలా..
సంవత్సరం    కేసులు అరెస్టులు  గంజాయి(కిలోలు)  
2020.          32       81      5234.79     
2021           32      68       9688.54     
2022           29        46     2362.23  

నిఘా పెట్టాం
గంజాయితో పాటు మద్యం అక్రమ రవాణాపై కూడా నిత్యం నిఘా పెట్టాం. ఆండ్ర, బొడ్డవర, కొత్తవలసతో పాటు జిల్లాలోని అన్ని పోలీసుస్టేషన్‌లకూ ఆదేశాలు ఇచ్చాం. అనుమానం ఉన్న ప్రాంతాల్లో ప్రతిరోజూ తనిఖీలు చేపడుతున్నాం. కొంతమందిని బైండోవర్‌ చేశాం.
                - శ్రీదేవిరావు, అడిషనల్‌ ఎస్పీ, ఎస్‌ఈబీ


Updated Date - 2022-07-27T05:07:37+05:30 IST