మంత్రులు కోర్టుల్లో చోరీలు చేయించడమేంటి?

ABN , First Publish Date - 2022-04-17T09:20:33+05:30 IST

‘‘మంత్రులు కోర్టుల్లో చోరీలు చేయించడం ఏమిటి? దేశం ఎటు పోతోంది? దీనిని ఆదర్శంగా తీసుకొని ప్రతివాళ్లూ తమ కేసులు ఉన్న న్యాయస్థానాల తలుపులు బద్దలు కొడితే దేశంలో న్యాయ వ్యవస్థ బతుకుతుందా?’’ అని తెలుగుదేశం పార్టీ ప్రశ్నించింది. ఆ పార్టీ

మంత్రులు కోర్టుల్లో చోరీలు చేయించడమేంటి?

దీనిని అందరూ ఆదర్శంగా తీసుకుంటే న్యాయ వ్యవస్థ బతుకుతుందా..!

కాకాణి, సీఎం స్పందించరేం?

ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంటే ఆయనను బర్త్‌రఫ్‌ చేసేవారు

వైసీపీ 150 మంది ఎమ్మెల్యేల్లో 80 మందిపై కేసులున్నాయి: జీవీ రెడ్డి


అమరావతి, ఏప్రిల్‌ 16(ఆంధ్రజ్యోతి): ‘‘మంత్రులు కోర్టుల్లో చోరీలు చేయించడం ఏమిటి? దేశం ఎటు పోతోంది? దీనిని ఆదర్శంగా తీసుకొని ప్రతివాళ్లూ తమ కేసులు ఉన్న న్యాయస్థానాల తలుపులు బద్దలు కొడితే దేశంలో న్యాయ వ్యవస్థ బతుకుతుందా?’’ అని తెలుగుదేశం పార్టీ ప్రశ్నించింది. ఆ పార్టీ అధికార ప్రతినిధి జీవీ రెడ్డి విలేకరులతో శనివారం మాట్లాడారు. ‘‘కోర్టులో సాక్ష్యాల చోరీ వ్యవహారంలో మంత్రి కాకాణి గోవర్థనరెడ్డిపై ఆరోపణలవర్షం కురుస్తుంటే ఆయనగాని, ఆయనకు మంత్రి పదవి ఇచ్చిన సీఎంగాని ఎందుకు మౌన వ్రతం పాటిస్తున్నారు? నెల్లూరు కోర్టులో పడిన దొంగలు ఇంకేం ముట్టుకోకుండా కేవలం కాకాణి కేసుకు సంబంధించిన సాక్ష్యాలు మాత్రమే ఎత్తుకుపోవడం ఏమిటి?’’ అని ప్రశ్నించారు. మాజీ మంత్రి సోమిరెడ్డి పెట్టిన కేసులో మొదటి నిందితునిగా కాకాణి ఉన్నారంటూ పూర్వాపరాలను వివరించారు. సాక్ష్యాలు లేకపోతే తనపై పెట్టిన కేసు కొట్టివేస్తారన్న అభిప్రాయంతో మంత్రి ఈ పని చేయించిట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. ‘‘ఎన్నికల్లో పోటీ చేసే సమయంలో కాకాణి దాఖలు చేసిన అఫిడవిట్‌ ప్రకారం ఆయనపై మొత్తం 25 కేసులు ఉన్నాయి. సోమిరెడ్డి పెట్టిన కేసు విచారణ రెండు నెలల్లో నెల్లూరు కోర్టులో ప్రారంభం కాబోతోంది. తాను దోషిగా తేలితే పదవి పోతుందనే భయంతోనే మంత్రి ఈ పని చేయించాడని నెల్లూరు ప్రజలు విశ్వసిస్తున్నారు. జగన్‌రెడ్డి మంత్రివర్గంలో మంత్రులు ఎలా ఉన్నారో దీనిని బట్టే తెలుస్తోంది’’ అని వ్యాఖ్యానించారు. చట్టం తనపని తాను చేస్తుందని సీఎం గతంలో సినిమా డైలాగులు చెప్పారని, కోర్టులో చోరీ ఘటనపై రాష్ట్రం అంతా ముక్కున వేలు వేసుకొంటే చట్టం ఇంతవరకూ మంత్రి జోలికి ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు.


‘‘ఈ సంఘటనపై మంత్రి ఇంతవరకూ నోరు మెదపలేదు. తేలు కుట్టిన దొంగ మాదిరిగా కిక్కురుమనకుండా ఉంటున్నారు. ముఖ్యమంత్రికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ సరికి మంత్రిని బర్తరఫ్‌ చేసి ఉండేవారు. రెండేళ్లు కళ్లు మూసుకొంటే ఈలోపు ప్రభుత్వం కాల పరిమితి అయిపోతుందని ఆయన అనుకొంటున్నట్లున్నారు. ఈ రోజు కాకాణి కేసు కోసం నెల్లూరు కోర్టు తలుపులు పగలగొట్టిన వారు రేపు జగన్‌ కేసుల కోసం ఇతర కోర్టుల తలుపులు పగలగొట్టకుండా ఉంటారా?’’ అని ప్రశ్నించారు. రాష్ట్రంలో వైసీపీకి ఉన్న 150 మంది ఎమ్మెల్యేల్లో 80 మందిపై కేసులు ఉన్నాయన్నారు. అందరూ ఇదే మాదిరిగా వ్యవహరిస్తే దేశంలో న్యాయ వ్యవస్థ మిగలదని వ్యాఖ్యానించారు. ఈ కేసు విచారణ నిష్పక్షపాతంగా జరగడం కోసం కాకాణి మంత్రి పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్‌ చేశారు. లేని పక్షంలో ఆయనను ఆ పదవి నుంచి ముఖ్యమంత్రి తప్పించాలని కోరారు. హైకోర్టు కూడా దీనిని తనకుతానుగా విచారణకు స్వీకరించాలని జీవీ రెడ్డి విజ్ఞప్తి చేశారు. 


జగన్‌ అసమర్థతకు పోలవరం నిలువెత్తు అద్దం: పంచుమర్తి

అమరావతి, ఏప్రిల్‌ 16(ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి అసమర్థతకు పోలవరం ప్రాజెక్టు నిలువెత్తు అద్దమని టీడీపీ ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనురాధ వ్యాఖ్యానించారు. శనివారం ఆమె ఒక ప్రకటన చేశారు. టీడీపీ ఐదేళ్ల హయాంలో 70 శాతం పనులు జరిగితే జగన్‌ రెడ్డి మూడేళ్ల పాలనలో అందులో పదో వంతు కూడా కాలేదన్నారు. ఇంత చేతగాని ముఖ్యమంత్రిని ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో కూడా చూడలేదని విమర్శించారు. పోలవరం పవర్‌ ప్రాజెక్టు కొట్టేయాలన్న దుర్భుద్దితో మొత్తం పోలవరం ప్రాజెక్టును జగన్‌రెడ్డి నాశనం చేశారని ఆరోపించారు. చివరకు ఏదీ పూర్తి చేయలేక చతికిలబడ్డారని, కనీసం పవర్‌ ప్రాజెక్టు పూర్తయి ఉన్నా ఇప్పుడు ఈ విద్యుత్‌ కోతలు ఉండేవి కావని చెప్పారు. చంద్రబాబు హయాంలో రూ.11,000 కోట్ల విలువైన పనులు జరిగితే వాటి కింద రూ.4,000 కోట్లను తెచ్చుకొన్న జగన్‌ ప్రభుత్వం ఆ డబ్బులను మద్యం తయారీ కంపెనీలకు ఇచ్చి  చేతులు దులుపుకొందన్నారు. ఆ డబ్బును ప్రాజెక్టు నిర్మాణానికిగాని... నిర్వాసితులకుగాని ఇవ్వలేదని పంచుమర్తి విమర్శించారు. 


యూనివర్సిటీల్లో వైసీపీ కార్యకర్తలకు ఉద్యోగ మేళాలా?: టీడీపీ

అమరావతి, ఏప్రిల్‌ 16(ఆంధ్రజ్యోతి): వైసీపీ కార్యకర్తలకు ప్రభుత్వ యూనివర్సిటీల్లో ఉద్యోగ మేళాలు నిర్వహించడంపై తెలుగుదేశం పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆ పార్టీ ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణరాజు శనివారం ఒక ప్రకటన చేశారు. ‘‘రాష్ట్రంలో 60 లక్షల మంది నిరుద్యోగులు ఉంటే వారిని గాలికి వదిలి కేవలం వైసీపీ కార్యకర్తలకు మాత్రమే ఉద్యోగ మేళాలు పెట్టడం ఏమిటి? మీ కార్యకర్తలకు ఉద్యోగాలు ఇప్పించుకోవాలని అనుకొంటే తాడేపల్లి ప్యాలె్‌స లో పెట్టుకోండి. ఇప్పటికే వలంటీర్‌ పేరుతో ప్రతి 50 ఇళ్లకో వైసీపీ కార్యకర్తను పెట్టారు. ఇప్పుడు మళ్లీ వాళ్లకు ఉద్యోగాల పేరుతో మేళాలు పెడుతున్నారు. ఒకపక్క ఉద్యోగాలు రాక 400 మంది నిరుద్యోగులు రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకొన్నారు. ఖాళీగా ఉన్న రెండున్నర లక్షల ఉద్యోగాల భర్తీ లేదు. ప్రైవేటు ఉద్యోగాలు అసలు రావడం లేదు’’ అని విమర్శించారు. ఇప్పటికైనా ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ చేపట్టాలని, నిరుద్యోగ యువతను ఆదుకోవడానికి చర్యలు చేపట్టాలని మంతెన డిమాండ్‌ చేశారు. 

Updated Date - 2022-04-17T09:20:33+05:30 IST