మద్యం దుకాణంలో చోరీ

ABN , First Publish Date - 2020-05-30T10:37:57+05:30 IST

గుజరాతీపేట మెయిన్‌ రోడ్డులోని లక్ష్మీథియేటర్‌ ఎదు రుగా ఉన్న మద్యం దుకాణంలో చోరీ జరిగింది.

మద్యం దుకాణంలో చోరీ

రూ.1.61లక్షల విలువ చేసే సరుకు అపహరణ 

ఆలస్యంగా వెలుగులోకి..


శ్రీకాకుళం క్రైం: గుజరాతీపేట మెయిన్‌ రోడ్డులోని లక్ష్మీథియేటర్‌ ఎదు రుగా ఉన్న మద్యం దుకాణంలో చోరీ జరిగింది. రూ.1.61లక్షల విలువ చేసే మద్యం సీసాలు అపహరణకు గురయ్యాయి. ఈ ఘటన ఆలస్యంగా వెలుగుజూసింది. లాక్‌డౌన్‌ కారణంగా గత రెండు నెలలుగా మూతపడిన ఈ మద్యం దుకాణాన్ని శుక్రవారం తెరిచారు. అయితే ఐదు కేసుల మద్యం లెక్కకు దొరకకపోవడం, దుకాణం వెనుక భాగంలో ఇనుప గ్రిల్స్‌ విరగ్గొట్టి ఉండడంతో సిబ్బంది 1వ పట్టణ పోలీసులకు, ఎక్సైజ్‌ అఽధికారులకు సమాచారం అందించారు. దీంతో ఎస్‌ఐ. వై.సింహాచలం సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మార్చి 23 నుంచి మూతపడిన ఈ మద్యం దుకాణాన్ని తనిఖీ కోసం ఏప్రిల్‌ 15న అధికారులు తెరిచారు. అప్పటికి దుకాణంలో రూ.9,62,310 విలువ చేసిన మద్యం ఉన్నట్లు ఎక్సైజ్‌, రెవెన్యూ అధికారులు గుర్తించారు.


మళ్లీ ఈ దుకాణాన్ని శుక్రవారం తెరవగా  బీరు సీసాల కేసు ఒకటి, 100 పైపర్స్‌ కేసు ఒకటి, జానీవాకర్‌ 2 కేసులు, బ్లాక్‌అండ్‌వైట్‌ ఒక కేసు మొత్తం రూ.1,61,750 విలువ చేసే మద్యం చోరీకి గురైనట్లు పోలీసులు గుర్తించారు.  దుండగులు దుకాణం వెనుక నుంచి వచ్చి ఇనుప గ్రిల్స్‌ విరగ్గొట్టి లోపలకు ప్రవేశించినట్లు తెలుస్తోంది. డొక్కులు వదిలేసి అందులో ఉన్న సీసాలు పట్టుకుపోయారు. చోరీ జరిగి చాలా రోజులైనట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.  స్థానికుల పనై ఉంటుందని భావిస్తున్నారు.  మద్యం సరుకుల వివరాలను ఎక్సైజ్‌ సీఐ ఎన్‌.శ్రీనివాసరావు ఆన్‌లైన్‌లో పరిశీలించారు.  ఈ ఘటనపై వన్‌టౌన్‌ ఎస్‌ఐ కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు.

Updated Date - 2020-05-30T10:37:57+05:30 IST