Sep 28 2021 @ 19:04PM

26 ఏళ్ల క్రితం రికార్డ్ చేసిన లతా మంగేష్కర్‌ పాట విడుదలైంది..

ముంబై: ప్రముఖ లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్‌ పాట అంటే చాలు ప్రేక్షకులందరూ ఆమె పాటను వింటూ మనసారా ఆస్వాదిస్తారు. లతా మంగేష్కర్‌ పాడిన పాటలు ఎప్పుడు విడుదలైనా ఆ పాట కోసం ప్రేక్షకులు చేవి కోసుకుంటారు. చలనచిత్ర నిర్మాత, స్వరకర్త విశాల్ భరద్వాజ్ మరియు ప్రముఖ గీత రచయిత గుల్జార్ రెండున్నర దశాబ్దాల క్రితం లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్‌తో కలిసి రికార్డ్ చేసిన పాటను ఆమె పుట్టినరోజైన సెప్టెంబర్ 28, 2021, మంగళవారం రోజున విడుదలైంది.


లత గానం చేసిన "ఠీక్ నహి లగ్తా" పాటను 26 సంవత్సరాల క్రితం ఒక సినిమా కోసం రికార్డ్ చేయబడిందని చెప్పారు. అయితే అనుకోని కారణాల వల్ల ఆ సినిమా ఆగిపోవడంతో ఆ సినిమా కోసం రికార్డు చేసిన ఈ పాట కూడా వెలుగు చూడలేదని గుల్జార్ తెలిపారు. ఈ పాట ఇప్పుడు మంగేష్కర్ 92వ పుట్టినరోజు సందర్భంగా భరద్వాజ్ లేబుల్ వీబీ మ్యూజిక్ మరియు షార్ట్ వీడియో యాప్ ప్లాట్‌ఫామ్ మోజ్ సహకారంతో విడుదల చేశారు. 


అప్పట్లో లత గానం చేసిన ఈ పాట రికార్డ్ అయి ఉన్న టేప్ కూడా చాలా ఏళ్ళ పాటు కనిపించలేదని, రికార్డింగ్ జరిగిన స్టూడియో కూడా మూతపడిందని వారు చెప్పారు. అయితే, రెండేళ్ల కిందట ఈ టేప్ దొరికినట్లు మరొక స్టూడియో నుంచి కాల్ రావడంతో దానిని మళ్లీ రీ-ఆర్కెస్ట్రయిజ్ చేసి ప్రాణం పోశారు. ఈ విషయం తెలుసుకున్న లత ఒక ఆడియో సందేశం ద్వారా భరద్వాజ్, గుల్జార్‌ల ప్రయత్నాలను అభినందించారు. ఈ పాట 26 ఏళ్ళ క్రితం రికార్డ్ అయినప్పటికీ, అందులోని సాహిత్యం మానవ సంబంధాల్లోని పలు కోణాలను ఆవిష్కరిస్తున్నందు వల్ల అది నేటి సమాజానికి కూడా సరిపోతుందని గుల్జార్ పేర్కొన్నారు.