రంగస్థల ‘గాంధీ’

ABN , First Publish Date - 2020-11-18T05:39:37+05:30 IST

ఏడిద గోపాలరావు పేరు వినగానే ఆకాశవాణిలో మంద్ర గంభీర స్వరంలో వార్తలు వినిపించే వ్యక్తి సాక్షాత్కరిస్తాడు. అంతేకాకుండా, అతడు రంగస్థల నటుడు, దర్శకుడు, నిర్వాహకుడు, పరోపకారి, అంతకుమించి...

రంగస్థల ‘గాంధీ’

ఏడిద గోపాలరావు పేరు వినగానే ఆకాశవాణిలో మంద్ర గంభీర స్వరంలో వార్తలు వినిపించే వ్యక్తి సాక్షాత్కరిస్తాడు. అంతేకాకుండా, అతడు రంగస్థల నటుడు, దర్శకుడు, నిర్వాహకుడు, పరోపకారి, అంతకుమించి స్నేహశీలి. కోనసీమలో పుట్టిన గోపాలరావు పుట్టుకతోనే కళల పట్ల, ముఖ్యంగా నాటకాల పట్ల ఆసక్తితో పెరిగాడు. చిన్ననాడే ప్రారంభమయిన నటజీవితం, తుది శ్వాస వరకు అవిరామంగా కొనసాగింది.


వాళ్ళ నాన్నగారు ఏడిద సత్తిరాజుగారు ఉద్యోగ రీత్యా విజయనగరంలో వున్నప్పుడు, చిన్నప్పుడే ‘రాఘవ నాటకోత్సవాల’లో నిష్ణాతులయిన నటీనటులు ప్రదర్శించిన నాటకాలు చూసి స్ఫూర్తి పొందాడు. ఆ నాటకాల వల్ల తను కూడా నటించాలని, కళామతల్లికి సేవ చేయాలనే దృఢ నిశ్చయానికి వచ్చాడు. ఆ నిశ్చయంతో తనకున్న పరిధిలో ఒక నాటకం ప్రదర్శించాడు. కానీ అది విజయవంతం కాలేదు. మనస్తాపం చెందాడు. అనుభవనీయులైన దర్శకుల సలహాలను పాటించి ముందుకు నడవాలని తీర్మానించుకున్నాడు. అతనికి మొదటి గురువు వాళ్ళ అన్నయ్య సినీ నిర్మాత ఏడిద నాగేశ్వరరావు;  రెండవ గురువు తెలుగు నాటకానికి ఊపిరి పోసిన పద్మభూషణ్‌ ఎ.ఆర్. కృష్ణ;  మూడవ గురువు అనేకమంది నటులను తీర్చిదిద్దిన కె. వెంకటేశ్వరరావు. ఆ తర్వాత కాకినాడలో వాళ్ళ అన్నయ్య ప్రారంభించిన ‘రాఘవ కళాసమితి’లో సభ్యుడిగా చేరి, అనేక నాటకాల్లో చేరి వైవిధ్యభరితమయిన పాత్రలు పోషించాడు. ‘ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌’,  ‘కప్పలు’,  ‘నాటకం’, ‘పంజరం’ మొదలయిన నాటకాల్లో పాల్గొని దర్శకత్వపు మెళకువలు నేర్చుకున్నాడు.


తరువాత హైదరాబాద్‌లో ఒక పక్క ఉద్యోగం చేస్తూ, మరో పక్క పద్మభూషణ్‌  ఎ. ఆర్.  కృష్ణ ఆధ్వర్యంలో నటవిద్యాలయంలో థియేటర్‌ ఆర్ట్స్‌లో డిప్లొమా కోసం చేరి నాటకానికి సంబంధించిన  అనేక విషయాలు నేర్చుకుని తోటి విద్యార్థులతో కలిసి థియరీతో బాటు ప్రాక్టికల్స్‌లోనూ పాల్గొన్నారు. ఆకాశవాణిలో న్యూస్‌రీడర్‌గా ఎన్నిక కావడం  గోపాలరావు  జీవితంలో పెద్ద మలుపు. ఢిల్లీలో అతని జీవితం చాలా ఆనందంగా గడిచింది. ఎంతోమంది ప్రముఖులతో పరిచయం ఏర్పడింది. స్వతహాగా చొరవ వున్నవాడు కావడం వల్ల అన్ని రంగాల్లోని గొప్ప వ్యక్తులతో కలసి పోయేవాడు. ఆఖరికి అప్పటి  రాష్ట్రపతి  నీలం సంజీవరెడ్డి గారి అభిమానాన్ని కూడా చూరగొన్న ఘనత గోపాలరావుది. ఆకాశవాణిలో వార్తలు బాగా చదవడం వల్ల, అతని శక్తి, సామర్థ్యాలు గుర్తించి  ఆయన్ని   మాస్కో రేడియో  కేంద్రానికి  డిప్యుటేషన్‌ మీద బదిలీ చేసారు. మాస్కోలో  కూడా తెలుగు కార్యక్రమాలు అనేకం నిర్వహించి మంచిపేరు సంపాదించాడు.


ఉద్యోగ  విరమణ అనంతరం ‘సరస నవరస’ సాంస్కృతిక సంస్థను నెలకొల్పి వైవిధ్య భరితకార్యక్రమాలను నిర్వహించాడు. 1998లో జాతీయ నాటకోత్సవాలు నిర్వహించి ఎనలేని కీర్తిని సంపాదించాడు. గాంధీ పాత్ర వెయ్యాలనే కోరిక గోపాలరావుకు ప్రగాఢంగా ఉండేది. ప్రఖ్యాత నాటక రచయిత డాక్టర్  డి. విజయభాస్కర్‌కి తన కోరికని తెలిపి, తనకోసం ఒక నాటిక రాయమని కోరాడు. విజయభాస్కర్‌ ‘బాపు చెప్పిన మాట’ అనే నాటికను రాసిచ్చారు. దీంట్లో గోపాలరావు గాంధీ పాత్ర పోషించి చిరకాల కోరిక నెరవేర్చుకున్నాడు. ఈ నాటిక ప్రదర్శనల ద్వారా ‘రంగస్థల గాంధీ’గా గోపాలరావు  పేరు స్థిరపడిపోయింది. ఆత్మీయమిత్రుడు దూర తీరాలకి వెళ్ళిపోయాడన్న వార్త నాకు గుండెల్లో గునపాలు గుచ్చుకున్నట్లుగా వుంది. ఆయనకి అశ్రునివాళి.   

పి. పాండురంగ 

మాజీ సంచాలకులు, ఆకాశవాణి

Updated Date - 2020-11-18T05:39:37+05:30 IST