‘బొమ్మ’ వేయలేం!

ABN , First Publish Date - 2021-04-16T10:15:41+05:30 IST

సినిమా టికెట్‌ ధరలను నిర్ణయిస్తూ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు ఎగ్జిబిటర్ల ఆందోళనకు కారణమవుతోంది. ఈ ధరలకు టికెట్లు విక్రయించి థియేటర్లు

‘బొమ్మ’ వేయలేం!

సర్కార్‌ ధరలపై సినీ ఎగ్జిబిటర్ల అసంతృప్తి

థియేటర్లు మూసుకోవడమే మేలనే అభిప్రాయం

20న విజయవాడలో సమావేశం


విజయవాడ, ఏప్రిల్‌ 15(ఆంధ్రజ్యోతి): సినిమా టికెట్‌ ధరలను నిర్ణయిస్తూ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు ఎగ్జిబిటర్ల ఆందోళనకు కారణమవుతోంది. ఈ ధరలకు టికెట్లు విక్రయించి థియేటర్లు నిర్వహించాలంటే ఎదురు పెట్టుబడులు పెట్టాలని వాపోతున్నారు. ఇప్పటికే కుదేలైన ఈ రంగంలో ప్రభుత్వం నిర్ణయించిన కొత్త ధరలు ఏమాత్రం గిట్టుబాటు కావన్నది వారి వాదన. మల్టీపెక్స్‌ల వరకు లాభదాయకంగా అనిపించినప్పటికీ మిగిలిన థియేటర్ల విషయంలో ఈ ఉత్తర్వులు అమలు సాధ్యంకాదంటున్నారు. రాష్ట్రంలో మొత్తం 1,100 థియేటర్లు ఉన్నాయి. వాటిలో కృష్ణాజిల్లాలో సుమారు 80 ఉండగా విజయవాడలోనే 60స్ర్కీన్లు ఉన్నాయి. ఇందులో ఆయా తరగుతుల మేరకు టికెట్‌ ధరలు నిర్ణయించారు.


మల్లిప్లెక్స్‌ల్లో టికెట్‌ ధర రూ.200- రూ.150 ఉండగా సింగిల్‌ ధియేటర్లలో రూ.150-రూ.125వరకు ఉన్నాయి. కొన్ని మల్టీప్లెక్స్‌ల్లో రూ.184, రూ.112కు విక్రయిస్తున్నారు. కొత్త సినిమా విడుదలైనప్పుడు వారంపాటు టికెట్‌ ధరలను పెంచుకుని విక్రయించుకునే అవకాశం ఉంది. అయితే కొద్దిరోజుల క్రితం విడుదల అయిన వకీల్‌సాబ్‌ సినిమాతో దీనికి బ్రేక్‌ పడింది. ధరల పెంపునకు వీలులేదని, ప్రస్తుతం ఉన్న ధరలతోనే విక్రయించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. నగరపాలక సంస్ధలు, మున్సిపాల్టీలు, నగర పంచాయతీలు, గ్రామ పంచాయతీల్లో మల్టీప్లెక్స్‌లు, ఏసీ, నాన్‌ ఏసీ థియేటర్లకు వేర్వేరుగా టికెట్ల ధరలను నిర్ణయించింది. ఈ నిర్ణయంపై ఎగ్జిబిటర్లు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.


ఇలా అయితే ఎలా?

ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం మల్టీపెక్స్‌ల్లో ఎకనామిక్‌ క్లాస్‌కు రూ.75, డీలక్స్‌కు రూ.150, ప్రీమియంకు రూ.250గా టికెట్‌ ధర నిర్ణయించారు.. ఏసీ ధియేటర్లకు ఎకనామిక్‌ క్లాస్‌కు రూ.40, డీలక్స్‌కు రూ.60, ప్రీమియం క్లాస్‌కు రూ.100 నిర్ణయించగా, నాన్‌ ఏసీ థియేటర్లలో ఎకనామిక్‌ క్లాస్‌కు రూ.20, డీలక్స్‌కు రూ.40, ప్రీమియంకు రూ.60 నిర్ణయించారు. మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో ఉండే ఽథియేటర్లకు ఈ ధరలు వర్తిస్తాయి. మున్సిపాలిటీ పరిధిలో ఉండే మల్లిప్లెక్స్‌ల్లో ఎకనామిక్‌ క్లాస్‌కు రూ.60, డీలక్స్‌కు రూ.100, ప్రీమియంకు రూ.150 ధర నిర్ణయించగా, ఏసీ ఽథియేటర్లలో ఎకనామిక్‌ రూ.30, డీలక్స్‌కు రూ.50, ప్రీమియంకు రూ.70, నాన్‌ ఏసీ థియేటర్లలో ఎకనామిక్‌ రూ.15, డీలక్స్‌కు రూ. 30, ప్రీమియంకు రూ.50గా నిర్ణయించారు.


నగర పంచాయతీల్లో మల్లిప్లెక్స్‌ల్లో ఎకనామిక్‌ రూ.40, డీలక్స్‌ రూ.80, ప్రీమియంకు రూ.120, ఏసీ థియేటర్లలో ఎకనామిక్‌ రూ.15, డీలక్స్‌ రూ.25, ప్రీమియం రూ.35, నాన్‌ ఏసీ ధియేటర్లలో ఎకనామిక్‌ రూ.10, డీలక్స్‌ రూ.15, ప్రీమియం రూ.25గా ఖరారు చేశారు. పంచాయతీల పరిధిలో మల్టిప్లెక్స్‌ల్లో ఎకనామిక్‌ రూ.30, డీలక్స్‌ రూ.50, ప్రీమియం రూ.80, ఏసీ థియేటర్లలో ఎకనామిక్‌ రూ.10, డీలక్స్‌ రూ.15, ప్రిమియం రూ.20, నాన్‌ ఏసీ థియేటర్లలో ఎకనామిక్‌ రూ.5, డీలక్స్‌ రూ.10, ప్రీమియం రూ.15గా నిర్ణయించారు. మల్టిపెక్స్‌ థియేటర్లలో ప్రస్తుతం రెండు క్లాస్‌లు మాత్రమే ఉన్నాయి. పై తరగతిని రెక్లైనర్‌గా కింది తరగతిని గోల్డ్‌గా వ్యవహరిస్తున్నారు. కొన్ని మల్లిఫ్లెక్స్‌ల్లో గోల్డ్‌ క్లాస్‌ మాత్రమే ఉంది. రెక్లైనర్‌కు ప్రస్తుతం రూ.200, గోల్డ్‌కు రూ.112 చొప్పున వసూలు చేస్త్తున్నారు.


సింగిల్‌ థియేటర్ల విషయానికి వచ్చే సరికి 3 తరగతులు అమల్లోఉన్నాయి. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం మల్టిప్లెక్స్‌ల్లో మళ్లీ క్లాస్‌లను విభజించుకోవాల్సిన పరిస్ధితి. గ్రామీణ ప్రాంతాలు, పంచాయితీల పరిధిలో థియేటర్లను ఆధునీకరించి.. పలు సదుపాయాలను కల్పించారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరల ప్రకారం ఈ ధియేటర్లను నిర్వహించాలంటే తమ వల్ల కాదని నిర్వాహకులు తేల్చి చెప్పేస్తున్నారు. బీ, సీ సెంటర్లలో ఉండే థియేటర్లను ప్రభుత్వం విడుదల చేసిన ధరలతో నడిపితే నష్టాలతో మూసుకునే పరిస్ధితి వస్తుందని చెబుతున్నారు. మల్టిప్లెక్స్‌లకు రోజుకు 1,800 నుంచి 2,000 యూనిట్ల వరకు విద్యుత్‌ ఖర్చు అవుతుంది. నాన్‌ ఏసీ థియేటర్‌కు నెలకు రూ.15,000, ఏసీ ధియేటర్లకు రూ.2లక్షలకు పైన బిల్లులు వస్తున్నాయి. ధరలు స్ధిరీకరించిన ప్రభుత్వం విద్యుత్‌ బిల్లుల విషయంలో ఏన్యాయం చేస్తుందని వారు ప్రశ్నిస్తున్నారు.


ప్రభుత్వం నిర్ణయించిన ధరలతో టిక్కెట్లు విక్రయించి విద్యుత్‌ బిల్లులు చెల్లించి సిబ్బందికి వేతనాలు ఇవ్వాలంటే సాధ్యం కాదని అభిప్రాయపడుతున్నారు. తాజా ఉత్తర్వులు, థియేటర్ల పరిస్థితులపై చర్చించి నిర్ణయం తీసుకోవాటానికి ఎగ్జిబిటర్లు 20న విజయవాడలోని ఫిలిం ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌లో ప్రత్యేకంగా సమావేశం కావాలని నిర్ణయించారు. ప్రభుత్వానికి వినతిపత్రం ద్వారా సమస్యను తెలియజేయటమా, లేక కార్యాచరణ ప్రకటించటమా అనేది ఈ సమావేశంలో నిర్ణయిస్తారు.


ఇది కక్ష సాధింపు జీవో

ప్రభుత్వం ఇచ్చిన జీవో చూస్తుంటే కక్ష సాధింపు చర్యగా ఉంది. ఈ జీవోతో కార్పొరేషన్‌ పరిధిలో ఉన్న థియేటర్‌కు లాభం తప్ప మున్సిపాలిటీ, నగర పంచాయతీ, గ్రామ పంచాయతీలో ఉన్న ధియేటర్లకు ఏమాత్రం ఉపయోగం లేదు. థియేటర్లలో క్లాసులను విడదీస్తూ జీవోలు ఇచ్చినప్పటికి కరెంట్‌ బిల్లుల్లో తేడా ఉండదు.

 సాయిబాబా, తెలుగు ఫిలిం చాంబర్‌ ప్రతినిధి


చిన్న థియేటర్ల పని అయిపోయినట్టే

ప్రభుత్వ ఉత్తర్వులతో రాష్ట్రంలో చిన్న సినిమా థియేటర్ల మనుగడ దాదాపుగా ముగిసినట్లే. వాటిని మూసుకోవటం తప్ప వేరే మార్గం లేదు. మా కార్యాచరణ త్వరలో ప్రకటిస్తాం.

 బాబు ఎగ్జిబిటర్‌

Updated Date - 2021-04-16T10:15:41+05:30 IST