బొమ్మ వేసేద్దాం...!

ABN , First Publish Date - 2020-12-05T06:31:03+05:30 IST

థియేటర్లు తెరిస్తే ఖర్చులైనా వస్తాయో, రావో అనే భయసందేహాల్లో ఉన్న సినీ ఎగ్జిబిటర్లు దాని నుంచి మెల్లగా బయటపడుతున్నారు.

బొమ్మ వేసేద్దాం...!

మిగిలిన థియేటర్లనూ తెరవాలని ఎగ్జిబిటర్ల నిర్ణయం

తెరచిన థియేటర్లకు పెరుగుతున్న ప్రేక్షకులు

విద్యుత్‌ బకాయిలపై తేలని నిర్ణయం

అప్పటి వరకు తాత్కాలిక కనెక్షన్లు ఇవ్వాలని విజ్ఞప్తి


ఆంధ్రజ్యోతి, విజయవాడ : థియేటర్లు తెరిస్తే ఖర్చులైనా వస్తాయో, రావో అనే భయసందేహాల్లో ఉన్న సినీ ఎగ్జిబిటర్లు దాని నుంచి మెల్లగా బయటపడుతున్నారు. తెరిచిన థియేటర్లకు ప్రేక్షకులు నెమ్మదిగా పెరగడమే దీనికి ప్రధాన కారణం. రాష్ట్రంలో థియేటర్లను తెరవడానికి అక్టోబర్‌ నెలలోనే అనుమతులిచ్చినా, ఎగ్జిబిటర్లు ధైర్యం చాలక ముందడుగు వేయలేదు. ఆ తరువాత నవంబరు ఒకటో తేదీ నుంచి సినిమాలు ప్రదర్శించాలని నిర్ణయానికి రాగా, విజయవాడలో మొత్తం ఐదు థియేటర్ల తలుపులు మాత్రమే తెరుచుకున్నాయి. ఐనాక్స్‌, మిరాజ్‌, సినీపోలిస్‌, నవరంగ్‌ థియేటర్లలో ప్రస్తుతం సినిమాలను ప్రదర్శిస్తున్నారు. ఈ థియేటర్లకు సెలవు రోజులు,  వారాంతపు రోజుల్లో ప్రేక్షకుల సంఖ్య పెరుగుతోంది. కొన్ని థియేటర్లలో కొత్త ఇంగ్లీష్‌ చిత్రాలను విడుదల చేస్తున్నారు. ప్రేక్షకులు పెరగడానికి ఇదొక కారణంగా కనిపిస్తోంది. ప్రేక్షకుల సంఖ్య పెరుగుతుండడం, వచ్చే నెలలో కొత్త సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉండడంతో థియేటర్లను తెరవడమే మంచిదన్న ఆలోచనలో మిగిలిన ఎగ్జిబిటర్లు ఉన్నారు. 


విద్యుత్‌ కనెక్షన్‌ ఇవ్వండి

ఎగ్జిబిటర్లు అడుగు ముందుకు వేయాలంటే విద్యుత్‌ సమస్య అవరోధంగా మారింది. లాక్‌డౌన్‌ సమయంలో బిల్లులు చెల్లించక పోవడంతో విద్యుత్‌ శాఖ అధికారులు థియేటర్ల ఫ్యూజులను తీసేశారు. విద్యుత్‌ బకాయిలను రద్దు చేయాలని ఎగ్జిబిటర్లు కోరడంతో, దీనిపై నిర్ణయం ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉంది. దీంతో ఎగ్జిబిటర్ల సంఘం ప్రతినిధులు జేసీ మాధవీలతను, సీపీడీసీఎల్‌ అధికారులను కలిసి, తమ సమస్యను విన్నవించుకున్నారు. బకాయిల రద్దు విషయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకునే వరకు విద్యుత్‌ కనెక్షన్లను తాత్కాలికంగా పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై అధికారులు ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇతర  సమస్యలను లిఖితపూర్వకంగా ఇస్తే పరిష్కరిస్తామని జేసీ హామీ ఇచ్చారు.

Updated Date - 2020-12-05T06:31:03+05:30 IST