Abn logo
Sep 26 2021 @ 14:45PM

Whatsappలో వచ్చిన ఒకే ఒక్క మెసేజ్ ను నమ్మి రూ.30 లక్షల పొలాన్ని అమ్మేశాడు.. ఇప్పుడు అతని పరిస్థితి ఏంటంటే..

ఇంటర్నెట్ డెస్క్: సైబర్ క్రైం గురించి ఒక పక్క పోలీసులు.. మరో పక్క మీడియా ఎన్నిసార్లు చెప్పినా ఆ మాటలను కొందరు వినడం లేదు. సూచనలను పెడచెవిన పెడుతూ.. కేటుగాళ్లకు అడ్డంగా బుక్కైపోతున్నారు. నిలువునా మోసపోతూ.. మళ్లీ పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ఓ 21ఏళ్ల యువకుడు వాట్సప్‌లో వచ్చిన ఒకే ఒక్క మెసేజ్‌ను నమ్మి రూ.30 లక్షల విలువైన పొలాన్ని అమ్మేసిన ఘటన హిమాచల్ ప్రదేశ్‌లో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. 


హిమాచల్ ప్రదేశ్‌లోని నసేరి గ్రామానికి చెందిన కుల్దీప్(21)కి ఫిబ్రవరి 13న వాట్సప్‌లో ఓ మెసేజ్ వచ్చింది. లక్కీ లాటరీలో అతడు రూ.25లక్షలు గెలుచుకున్నాడనేది ఆ మెసేజ్ సారంశం. ఆ సందేశాన్ని చూసి కుల్దీప్.. సంతోషంతో ఉబ్బితబ్బిబ్బై పోయాడు. ఆనందంలో ఆగకుండా ఆ సందేశానికి రిప్లై ఇచ్చాడు. ఈ క్రమంలో రూ. 25లక్షలను పొందేందుకు మొదటగా రూ.10వేలను ఆన్‌లైన్‌ ద్వారా జమచేయాలని అవతలి నుంచి మెసేజ్ రావడంతో కుల్దీప్ ముందూ వెనక ఆలోచించ లేదు. అవతలి వాళ్లు చెప్పిన విధంగా మొదట రూ.10 వేలను ట్రాన్ఫర్ చేశాడు. ఆ తర్వాత ఫీజులు, ప్రాసెంసింగ్ కోసం మరింత డబ్బును పంపాలని అవతలి వారు అడగడంతో ఆ మొత్తాన్ని కూడా కుల్దీప్ సమర్పించాడు. ఈ క్రమంలో దాదాపు 50 సార్లు.. రూ.40 లక్షలను కేటుగాళ్లకు ముట్టజెప్పాడు. అనంతరం తాను మోసపోయినట్లు గ్రహించి.. పోలీసులను ఆశ్రయించాడు. వాట్సప్‌లో వచ్చిన మెసేజ్‌ను నమ్మి.. రూ. 30లక్షలకు పొలాన్ని అమ్మి వారి అకౌంట్లో జమ చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు. మరో రూ. 10లక్షలను ఇతరుల వద్ద అప్పు చేసి మరీ.. వారికి ముట్టచెప్పినట్టు వాపోయాడు. కాగా.. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు. 


ఇవి కూడా చదవండిImage Caption

ప్రత్యేకంమరిన్ని...