జాబ్‌మేళాకు పోటెత్తిన యువత

ABN , First Publish Date - 2022-07-04T04:42:07+05:30 IST

మహబూబ్‌నగర్‌ పట్టణంలోని జిల్లా పరిషత్‌ మైదానంలో నిర్వహించిన జాబ్‌మేళాకు యువత అధిక సంఖ్యలో తరలొచ్చారు.

జాబ్‌మేళాకు పోటెత్తిన యువత
మాట్లాడుతున్న మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

అర్హత ఉన్న అందరికీ ఉద్యోగాలివ్వాలి

అక్టోబర్‌లో మరో మేళా : మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌

 మహబూబ్‌నగర్‌, జూలై 3: మహబూబ్‌నగర్‌ పట్టణంలోని జిల్లా పరిషత్‌ మైదానంలో నిర్వహించిన జాబ్‌మేళాకు యువత అధిక సంఖ్యలో తరలొచ్చారు. ఎక్సైజ్‌శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌ కృషితో యువజన సర్వీసుల శాఖ హైదరాబాద్‌ వారి ఆధ్వర్యంలో ధృవ్‌ కన్సల్టింగ్‌ సర్వీసెస్‌ ఈ జాబ్‌మేళాను నిర్వహించింది. యువతీ యువకుల సర్టిఫిక్టెలను ఆయా కంపెనీల ప్రతినిధులు పరిశీలించి, అర్హత గల వారికి ఉద్యోగాలు ఇచ్చారు. 


5 వేల మందికి ఉద్యోగాలివ్వాలి: మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

 జాబ్‌మేళాను మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌ ప్రారంభించి, ప్రసంగించారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తరువాత 1.33 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయగా, ప్రస్తుతం 80 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్‌లు వేయడం జరిగిందని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ చెప్పారు. ప్రైవేట్‌ రంగంలో లక్షల్లో ఉద్యోగాలు భర్తీ చేశారన్నారు. జిల్లాలో జాబ్‌మేళా నిర్వహించి, అర్హతను ఆయా కంపెనీలలో ఉన్న ఖాళీలను భర్తీ చేయాలని కోరగా హైదరాబాద్‌కు చెందిన 60 కంపెనీలు ముందుకు వచ్చాయన్నారు. ఐదు వేల ఉద్యోగాలకు తగ్గకుండా భర్తీ చేసి తనకు జాబితా ఇవ్వాలని కంపెనీ ప్రతినిధులకు సూచించారు. మిగిలిన వారినుంచి కూడా దరఖాస్తులు తీసుకుని అక్టోబర్‌లో మరో జాబ్‌మేళాను నిర్వహించి అవకాశాలు కల్పిస్తామన్నారు. అవసరమైన స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కోచింగ్‌ ఇప్పించి ఉద్యోగాలు వచ్చేలా చేస్తామని స్పష్టం చేశారు. ఎక్కడ.. ఏ ఉద్యోగం వచ్చినా ఓర్పు, నేర్పుతో పని చేసుకోవాలని చెప్పారు. మహిళలకు కూడా పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించాలని, ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఒకప్పుడు పాలమూరు అంటేనే వలసల జిల్లా అని పేరు ఉండేదని, వలసల గడ్డ ఇప్పుడు ఉపాధికి అడ్డాగా మారుతోందన్నారు. 


ఉద్యోగాలు పొందిన వారికి నియామక పత్రాలు

 జాబ్‌మేళాలో ఉద్యోగాలు సాధించిన వారిలో కొందరికి మంత్రి నియామక పత్రాలు అందించారు. అర్హతలను బట్టి ఒక్కొక్కరికి నెలకు రూ.12 వేల నుంచి రూ.40 వేల వరకు ఆయా కంపెనీలలో ఉద్యోగాలు కల్పించారు. వీరన్నపేటకు చెందిన ఆనంద్‌ తన కూతురు నందినికి రూ.30 వేల ఉద్యోగం రావడంపై ఆనందం వ్యక్తం చేశారు. మంత్రి కృషితో ఇది వరకు తనకు డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇల్లు వచ్చిందని, ఇప్పుడు కూతురుకు ఉద్యోగం రావడంతో తన బాధలు తీరాయని మంత్రి ముందు ఆనందం వ్యక్తం చేశాడు. ఆయన కూతురు నందిని కంటతడి పెట్టగా, మంత్రి ఆమె కన్నీటిని తుడిచారు. ఆడపిల్లలకు తొందరగా పెళ్ళిళ్ళు చేసి వారి జీవితాలు పాడు చేయొద్దని, ఉద్యోగాలు సాధించాక మంచి వ్యక్తులను చూసి పెళ్ళిళ్ళు చేయాలని మంత్రి కోరారు. కార్యక్రమంలో కలెక్టర్‌ ఎస్‌.వెంకట్రావ్‌, ఎస్పీ ఆర్‌ వెంకటేశ్వర్లు, సెట్విన్‌ ఎండీ వేణుగోపాల్‌రావు, జిల్లా యువజన సంక్షేమ అధికారి శ్రీనివాస్‌, మునిసిపల్‌ చైర్మన్‌ కోరమోని నర్సింహులు, గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ రాజేశ్వర్‌గౌడ్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ అబ్దుల్‌రహమాన్‌, నాయకులు తాటిగణేష్‌, చెరుకుపల్లి రాజేశ్వర్‌, కట్టా రవికిషన్‌రెడ్డి, శివరాజు, రాము, పోతులగిరిదర్‌రెడ్డి, సుధీప్‌రెడ్డి పాల్గొన్నారు. 

Updated Date - 2022-07-04T04:42:07+05:30 IST