Jun 24 2021 @ 01:18AM

తమ్ముడే పెళ్లి ఫొటోలు తీశాడు

కథానాయిక యామీ గౌతమ్‌, హిందీ చిత్రం ‘ఉరి’ దర్శకుడు ఆదిత్యాధర్‌ వివాహం ఈ నెల 4న జరిగిన సంగతి తెలిసిందే. కరోనా నేపథ్యంలో కుటుంబ సభ్యులు, అతికొద్ది మంది సన్నిహితుల సమక్షంలో ఏడడుగులు వేశారు. ఈ పెళ్లిలో ప్రత్యేకత ఏంటంటే... తమ్ముడే పెళ్లి ఫొటోలు తీయడం! యామీ గౌతమ్‌ తమ్ముడు ఓజాస్‌ గౌతమ్‌ అన్ని ఫొటోలూ తీశాడట. అంతేకాదు... అతిథిమర్యాదలు, మండపం అలంకరణ విషయంలో  ఆహారం, పూలు వృథా కాకుండా చూసుకున్నారట. ఎకో-ఫ్రెండ్లీ పద్ధతిలో పెళ్లి జరగడం విశేషం. పర్యావరణానికి హాని చేసే వస్తువులేవీ పెళ్లిలో ఉపయోగించలేదని హిందీ సినిమా జనాలు చెబుతున్నారు. యామీ గౌతమ్‌ సొంత రాష్ట్రమైన హిమాచల్‌ ప్రదేశ్‌లోని మండీ ప్రాంతంలో వారి కుటుంబానికి చెందిన వ్యవసాయక్షేత్రంలో వైభవంగా వివాహం జరిగింది. ఈ దంపతులు చేస్తున్న సినిమాలకు వస్తే... విక్కీ కౌశల్‌ హీరోగా ‘ద ఇమ్మోర్టల్‌ అశ్వత్థామ’ చిత్రానికి ఆదిత్యా ధర్‌ దర్శకత్వం వహించనున్నారు. అభిషేక్‌ బచ్చన్‌, నిమ్రత్‌ కౌర్‌తో కలిసి ‘దస్వి’, సైఫ్‌ అలీఖాన్‌, అర్జున్‌ కపూర్‌, జాక్వలిన్‌ ఫెర్నాండేజ్‌తో కలిసి ‘బూత్‌ పోలీస్‌’ చిత్రాల్లో యామీ గౌతమ్‌ నటించనున్నారు.