‘ప్రేమ’ రణం.. ఆగిన ప్రాణం

ABN , First Publish Date - 2021-04-22T07:40:54+05:30 IST

ఒకే గ్రామానికి చెందిన అమ్మాయి, అబ్బాయి ప్రేమించుకొని పరారవ్వడం యువకుడి తండ్రికి ప్రాణాంతకమైంది.

‘ప్రేమ’ రణం.. ఆగిన ప్రాణం

  • యువకుడి ఇంటిపై విరుచుకుపడ్డ యువతి బంధువులు
  • కర్రలు, గొడ్డళ్లు, రాళ్లతో తలుపులు బద్దలు
  • గుండెపోటుతో యువకుడి తండ్రి మృతి

చింతపల్లి, ఏప్రిల్‌ 21: ఒకే గ్రామానికి చెందిన అమ్మాయి, అబ్బాయి ప్రేమించుకొని పరారవ్వడం యువకుడి తండ్రికి ప్రాణాంతకమైంది. యువతి తరఫువారు కర్రలు, గొడ్డళ్లు, రాళ్లతో యువకుడి ఇంటి మీద విరుచుకుపడి భయోత్పాతం సృష్టించడంతో  యువకుడి తండ్రి ఆందోళనకు గురై గుండెపోటుతో మృతిచెందాడు. నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం వర్కాలలో బుధవారం ఈ ఘటన జరిగింది. మృతుడి భార్య కలకొండ జ్యోతి కథనం ప్రకారం..  కలకొండ దేవదానం(50), జ్యోతి దంపతుల చిన్న కుమారుడు శ్రీకాంత్‌.. వింజమూరి అఖిలతో ప్రేమలో పడ్డాడు. పెళ్లికి పెద్దలు అంగీకరించపోవటంతో 19న ఇద్దరూ ఇల్లు వదిలేసి వెళ్లిపోయారు. ఆగ్రహానికి గురైన అఖిల తల్లిదండ్రులు మహేందర్‌, జంగమ్మ, అన్నయ్య అజయ్‌కుమార్‌, ఆమె బాబాయి పిన్ని సురేందర్‌, జంగమ్మ బుధవారం తెల్లవారుజామున దేవదానం ఇంటిపైకి దాడికి వెళ్లారు.  తలుపులు, కిటీకీలు పగులగొట్టారు.  చంపుతామంటూ పెట్రోల్‌ తీసుకుని ఇంట్లోకి వెళ్లారు.. ఇదంతా చూసి గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న దేవదానం ఉద్వోగానికిలోనై కుప్పకూలిపోయాడు. ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. తన భర్త మృతికి కారణమైన ఐదుగురు వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని జ్యోతి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Updated Date - 2021-04-22T07:40:54+05:30 IST