రాష్ట్రాన్ని పాలించే అర్హత వైసీపీకి లేదు

ABN , First Publish Date - 2020-05-23T10:17:47+05:30 IST

రాష్ట్రాన్ని పాలించే అర్హత వైసీపీకి లేదని బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి విమర్శించారు.

రాష్ట్రాన్ని పాలించే అర్హత వైసీపీకి లేదు

హైకోర్టు తీర్పులు ప్రభుత్వానికి చెంపపెట్టు 

మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి 


బనగానపల్ల్లె, మే 22: రాష్ట్రాన్ని పాలించే అర్హత వైసీపీకి లేదని బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి విమర్శించారు. టీడీపీ కార్యాలయంలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ ప్రజావ్యతిరేక విధానాలను అనుసరిస్తున్న వైసీపీ ప్రభుత్వ తీరును అత్యున్నత న్యాయస్థానాలు ఎండగడుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. మడ అడవులను నాశనం చేసి ఇంటి పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వం ప్రయత్నించడాన్ని హైకోర్టు తప్పు పట్టిందని బీసీ తెలిపారు. గ్రామ సచివాలయాలకు వైసీపీ రంగులు వేయవద్దని చెప్పినా మరో రంగు అదనంగా చేర్చడాన్ని హైకోర్టు తీవ్రంగా పరిగణించిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన 623 జీవోను హైకోర్టు రద్దు చేసిందని మాజీ ఎమ్మెల్యే తెలిపారు. హైకోర్టు, సుప్రీంకోర్టు తీర్పులను సైతం బేఖాతరు చేయడం ఏమిటని? హైకోర్టు తప్పుబట్టిందన్నారు.


దళిత డాక్టర్‌ సుధాకర్‌ కరోనా చికిత్సలు చేయడానికి మాస్క్‌లు లేవని ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు ఆయనను సస్పెండ్‌ చేయడమే కాక విశాఖపట్నంలో నడిరోడ్డులో రెండు చేతులు కట్టివేసి లాఠీలతో కొట్టడం అమానుషమని జనార్దన్‌రెడ్డి అన్నారు. ఈ విషయాన్ని హైకోర్టు సుమోటాగా స్వీకరించి సీబీఐతో విచారణ నిర్వహించాలని ఆదేశించిందని తెలిపారు. అలాగే ఇంటెలిజెన్స్‌ అధికారిగా పనిచేసిన ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌ చెల్లదని, ఆయనను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని హైకోర్టు ఆదేశించిందని బీసీ తెలిపారు. రాజ్యాంగ విరుద్ధంగా వైసీపీ ప్రభుత్వం జీవోలు తెస్తూ తనకు వ్యతిరేకమైన అధికారులపై కూడా కక్షపూరితంగా వ్యవహరిస్తూ సస్పెండ్‌ చేస్తోందన్నారు. ఇప్పటికైనా వైసీపీ ప్రభుత్వం బుద్ధి తెచ్చుకోవాలని సూచించారు. హైకోర్టు తీర్పులు వైసీపీ ప్రభుత్వానికి చెంపపెట్టు అని ఆయన అన్నారు. 

Updated Date - 2020-05-23T10:17:47+05:30 IST