సంక్షేమంపై దృష్టి.. కానరాని అభివృద్ధి

ABN , First Publish Date - 2020-05-30T10:28:09+05:30 IST

రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకొంది. ఈ సంవత్సర కాలంలో జిల్లాకు ఒనగూరిన ప్రయోజనాలను పరిశీలిస్తే సంక్షేమ పథకాల అమలు

సంక్షేమంపై దృష్టి.. కానరాని అభివృద్ధి

వెలిగొండ పనుల్లో జాప్యం

పోర్టు, కారిడార్‌, వర్శిటీ, ట్రిపుల్‌ 

ఐటీలలో కనిపించని కదలిక

ఇరిగేషన్‌, తాగునీరు,ఇతర మౌలిక రంగాలదీ అదే పరిస్థితి

సంక్షేమ పథకాలతో వివిధ వర్గాలకు  భారీగానే లబ్ధి

ఏడాది పాలన పూర్తి చేసుకున్న రాష్ట్ర ప్రభుత్వం


జిల్లా అభివృద్ధికి సంబంధించిన అనేక అంశాల్లో పురోగతి కరువైంది. మౌలిక సదుపాయాల కల్పన, ఉపాధి అవకాశాల పెంపు, గతంలో చేపట్టిన పథకాల కొనసాగింపు   మందగించింది. వైసీపీ సర్కారు ఏడాది పాలనను పరిశీలిస్తే సంక్షేమ పథకాలపై చూపిన శ్రద్ధ జిల్లా ప్రజలకు శాశ్వత ప్రయోజనాలు చేకూర్చే ప్రాజెక్టులు, పథకాలపై కనబర్చలేదన్న విషయం స్పష్టవుతుంది. 


ఒక్క వెలిగొండ ప్రాజెక్టు మినహా మిగిలిన రామాయపట్నం పోర్టు, పారిశ్రామిక కారిడార్‌, యూనివర్శిటీ, ట్రిపుల్‌ ఐటీ, పలు తాగు, సాగునీటి పథకాలు పూర్తిగా పడకేశాయి. వివిధ పంటలు సాగు చేసిన రైతులు గిట్టుబాటు ధరలు లేక, పంట ఉత్పత్తుల అమ్ముకోలేక అవస్థలు పడుతున్నా ప్రభుత్వం నుంచి వారికి అవసరమైన సహకారం లభించక అల్లాడుతున్నారు. 


ఒంగోలు, మే 29 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకొంది. ఈ సంవత్సర కాలంలో జిల్లాకు ఒనగూరిన ప్రయోజనాలను పరిశీలిస్తే సంక్షేమ పథకాల అమలు  మినహా అభివృద్ధి విషయంలో పూర్తి నిర్లక్ష్యం కొనసాగింది. ఉపాధి కరువై వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు వలసలు వెళ్లడం నిత్యకృత్యమైంది. అదేసమయంలో వ్యవసాయ రంగం తీవ్ర ఆటుపోట్లను ఎదుర్కొంటోంది. 


వెలిగొండ తొలిదశ పూర్తికి ..అనేక అవాంతరాలు 

జిల్లా ప్రజలకు ప్రత్యేకించి పశ్చిమ ప్రాంతంలో సాగు, తాగునీటికి సంబంధించి శాశ్వత పరిష్కారమైన వెలిగొండ ప్రాజెక్టు విషయంలో గట్టి సంకల్పంతో ఉన్నట్లు ప్రభుత్వం కనిపించింది. తొలి దశ పనులు తొలుత ఈ  ఏడాది జనవరికి పూర్తిచేయాలని నిర్దేశించింది. అనంతరం దాన్ని జూన్‌కు పొడిగించింది. అందుకోసం పలు చర్యలు కూడా తీసుకుంటుంది. అయినప్పటికీ అనేక అవాంతరాలు ఎదురవుతూనే  ఉన్నాయి.  మరోవైపు నిర్మాణ పనులతో పాటు అంతే ప్రాధాన్యం ఉన్న నిర్వాసితుల తరలింపు, పునరావాస చర్యల్లో ఏమాత్రం పురోగతి కరువైంది. 


కదలని తాగు, సాగునీటి..పథకాల పనులు

తాగునీటి పథకాల విషయానికి వస్తే గత ప్రభుత్వం మంజూరు చేసిన వాటిని రద్దు చేసిన ప్రస్తుత ప్రభుత్వం తిరిగి కొత్త పథకాలను చేపట్టింది. అవి ప్రారంభం కాలేదు.  మరోవైపు ఇరిగేషన్‌, రోడ్లు ఇతరత్రా పలు శాశ్వత అభివృద్ధి పనులకు సంబంధించి టెండర్లు పూర్తయినా పనులు ముందుకు కదలలేదు.


పడకేసిన ప్రాజెక్టులు 

జిల్లాలో శాశ్వత ప్రయోజనాలతోపాటు పెద్ద ఎత్తున ఉపాధి కల్పన జరిగే భారీ ప్రాజెక్టుల విషయంలో అడుగు ముందుకు పడలేదు. కీలకమైన రామాయపట్నం పోర్టు విషయంలో కాగితాలపై ఇచ్చే ఆదేశాలతో సంతృప్తి మినహా క్షేత్రస్థాయిలో పనుల్లో కదలిక కరువైంది. తాజాగా పోర్టుకు సంబంధించి 2141 ఎకరాలలో డీపీఆర్‌ సిద్ధం చేశామని త్వరలో కెమికల్‌, క్రూడాయిల్‌ పరిశ్రమలు వస్తాయని ప్రభుత్వ పెద్దలు ప్రకటించడం కొంతమేర ఆశాజనకం. ఇక గతంలో రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన దొనకొండ పారిశ్రామిక కారిడార్‌, కేం ద్రం మంజూరు చేసిన కనిగిరి నిమ్జ్‌లు ‘ఎక్కడ వేసిన గొంగళి అక్కడే’ అన్న విధంగా ఉన్నాయి. గత ప్రభుత్వం శంకుస్థాపన  చేసిన పేపర్‌ పరిశ్రమ అడ్రసు లేకపోగా పారిశ్రామిక అభివృద్ధి, ప్రత్యేకించి ఎంఎ్‌సఎంఈ పార్కుల విషయంలో అడుగు ముందుకు పడలేదు. 


 సంక్షేమం కొంత సంతృప్తి

 సంక్షేమ పథకాలను పరిశీలిస్తే ప్రత్యేకించి ప్రభుత్వం ప్రకటించిన నవరత్నాలలో భాగంగా ఆయా వర్గాలకు రాష్ట్ర వ్యాప్తంగా చేకూర్చే పథకాల లబ్ధి మాత్రం కొంత మేర ప్రజలకు చేరింది. గత ఏడాది సుమారు 3.40 లక్షల మందికి ఈ ఏడాది 3.90 లక్షల రైతు కుటుంబాలకు రైతు భరోసా ద్వారా కోట్లాది రూపాయలు అందాయి. ఇటీవల కాలంలో డ్వాక్రా మహిళలకు, వాహన మిత్ర, చేనేతలకు నేతన్న హస్తం, అమ్మఒడి, విద్యాదీవెన, పెన్షన్ల పెంపు, వివిధ వర్గాలకు చెందిన కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల వేతనాలు పెంపు లబ్ధి అందింది. తాజాగా జిల్లాలో లక్షా 10వేల మందికి నివేశన స్థలాల పంపిణీ ప్రక్రియ వేగంగా జరుగుతోంది. 


అన్నదాతల అవస్థలు 

 జిల్లాలో వివిధ పంటలు సాగు చేసిన రైతులు గిట్టుబాటు ధరలు లేక, పంట ఉత్పత్తుల అమ్మకాలు జరగక అవస్థలు పడుతున్నారు. వారికి ప్రభుత్వం నుంచి అవసరమైన మేర సహకారం అందలేదు.  ఈ పరిస్థితులతో ఏడాది పాలన పూర్తి చేసుకున్న ప్రభుత్వం రానున్న ఏడాది అయినా శా శ్వత ప్రయోజనాలు ఇచ్చే మౌలిక సౌకర్యాల మెరు గు, ఉపాధి కల్పన వంటి అభివృద్ధి పనులతో పాటు కీలకమైన రైతు సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.


కార్యరూపం దాల్చని యూనివర్సిటీ

మౌలిక రంగాల అభివృద్ధిని పరిశీలిస్తే జిల్లాకు మంజూరైన ప్రకాశం యూనివర్శిటీ నిర్మాణం ఇంకా కార్యరూపం దాల్చలేదు. ఇక్కడి పీజీ సెంటర్‌ను అప్‌గ్రేడ్‌ చేస్తున్నట్లు ప్రకటించి వర్సిటీ నిర్మాణానికి రూ. 50 లక్షలు ప్రాథమికంగా నిధులు ఇస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది తప్ప ఈ ఏడాదిలో పనుల  వైపు దృష్టి పెట్టలేదు.  మరో కీలకమైన ట్రిపుల్‌ ఐటీ విషయంలో ఇంకా గందరగోళ పరిస్థితి కొనసాగుతోంది. 

Updated Date - 2020-05-30T10:28:09+05:30 IST