మౌలిక సౌకర్యాల కల్పనలో వైసీపీ ప్రభుత్వం విఫలం

ABN , First Publish Date - 2021-07-25T05:46:05+05:30 IST

మౌలిక సౌకర్యాలను కల్పించడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని తెలుగుదేశం పార్టీ అనకాపల్లి పార్లమెంటరీ అధ్యక్షుడు బుద్దనాగ జగదీశ్వరరావు విమర్శించారు.

మౌలిక సౌకర్యాల కల్పనలో వైసీపీ ప్రభుత్వం విఫలం
కాశీపురంలో ధర్నా చేస్తున్న తెలుగుదేశం నాయకులు

టీడీపీ అనకాపల్లి పార్లమెంటరీ అధ్యక్షుడు బుద్దనాగ జగదీశ్వరరావు


దేవరాపల్లి, జూలై 24: మౌలిక సౌకర్యాలను కల్పించడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని తెలుగుదేశం పార్టీ అనకాపల్లి పార్లమెంటరీ అధ్యక్షుడు బుద్దనాగ జగదీశ్వరరావు విమర్శించారు. టీడీపీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు శనివారం మండలంలోని కాశీపురంలో ఆ పార్టీ నాయకులు మహా ధర్నా చేపట్టారు. అనంతరం నూకాలమ్మ గుడి వద్ద జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సంక్షేమం అన్న పదం దివంగత ముఖ్యమంత్రి ఎన్టీరామారావుకే సాధ్యమైందని, మిగతావారికి ఆ అర్హత లేదన్నారు. రాష్ట్రంలో అన్నిచోట్ల రోడ్లు అధ్వానంగా ఉన్నాయన్నారు. దేవరాపల్లి-ఆనందపురం రోడ్డు అధ్వానంగా ఉన్నా స్థానిక నాయకులకు, ప్రభుత్వానికి పట్టడం లేదన్నారు. అనకాపల్లి పార్లమెంటు పరిధిలో రోడ్ల పనులు ఆగస్టు ఒకటో తేదీకి పూర్తి కాకపోతే ప్రజా ఉద్యమం చేపడతామన్నారు. మాజీమంత్రి బండారు సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ.. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చిన్న గొయ్యి పడితే వెంటనే పూడ్చేవారన్నారు. వందల కిలోమీటర్ల రోడ్లు అధ్వానంగా ఉన్నా వైసీపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. బిల్లులు చెల్లించక దేవరాపల్లి-ఆనందపురం రోడ్డు, రైవాడ ఆధునికీకరణ పనులు జరగడం లేదన్నారు. ఏ కాంట్రాక్టర్‌ ఈ పనులు చేసేందుకు ముందుకు రావడం లేదన్నారు. అనకాపల్లి మాజీ ఎమ్మెల్యే పీలా గోవిందరావు మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వం రోడ్ల నిర్మాణానికి లీటరు పెట్రోల్‌పై రెండు రూపాయలు అదనంగా సెస్‌ వసూలు చేసినా ఆశ్చర్యపడనవసరం లేదన్నారు. మాజీఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు మాట్లాడుతూ.. వైసీపీ నాయకులు, కార్యకర్తలు భూములను ఆక్రమిస్తున్నారని ఆరోపించారు. అంతేకాకుండా తెలుగుదేశం కార్యకర్తల భూములను లాక్కోవడానికి కన్ను వేశారన్నారు. రెవెన్యూ, పోలీసులను పార్టీ కార్యకర్తలుగా వాడుకుంటున్నారన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకుడు పైలా ప్రసాదరావు, సర్పంచ్‌ ఆదిరెడ్డి వరలక్ష్మి, టీడీపీ మండల అధ్యక్షుడు చిటిమిరెడ్డి సూర్యనారాయణ, సత్యవతి, పోతల రమణమ్మ,   తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.


అడ్డుకున్న పోలీసులు

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు శనివారం దేవరాపల్లి-ఆనందపురం రోడ్డు పనులు చేపట్టాలని డిమాండ్‌ చేస్తూ కాశీపురంలో తలపెట్టిన ధర్నాలో పాల్గొనేందుకు వెళుతున్న టీడీపీ నాయకులు, కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. కొవిడ్‌ కారణంగా ఎక్కువ మంది జనంతో ఆందోళన చేయరాదని చోడవరం సీఐ మహమ్మద్‌ ఆధ్వర్యంలో పోలీసులు స్పష్టం చేశారు. దీంతో నాయకులు రెండు కిలోమీటర్లు కారులో వెళ్లగా, టీడీపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు వస్తున్నారన్న సమాచారంతో తెలుగుదేశం కార్యకర్తల కన్నా పోలీసులే ఎక్కువగా వచ్చారు.

  

Updated Date - 2021-07-25T05:46:05+05:30 IST